‘కళ’లతో కళ్లెం | Short Films For Crime Control | Sakshi
Sakshi News home page

‘కళ’లతో కళ్లెం

Published Mon, Aug 6 2018 10:21 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Short Films For Crime Control - Sakshi

ఇంద్రకరణ్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న షార్ట్‌ ఫిల్మ్‌ 

సంగారెడ్డి క్రైం : మితిమిరిన వేగం, అజాగ్రత్త, మద్యం తాగి వాహనాలు నడుపడంతో తనతో పాటు రోడ్డుపై నడిచే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు సైతం భరోసా లేని ప్రస్తుత తరుణంలో జిల్లాపోలీస్‌శాఖ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తరుచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం యువత అతివేగం ఒక కారణం అయితే మద్యం తాగి వాహనాలు నడుపడం మరోకారణం.

దీన్ని గుర్తించిన అధికారులు జరుగుతున్న పరిణామలు, వాటి వల్ల ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన ఇతివృత్తంతో షార్ట్‌ఫీల్మ్‌లను నిర్మించి ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కళా బృందాలతో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన, షార్ట్‌ ఫిల్మ్‌లతో సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజులోనే వేల మంది ఈ వీడియోలను ఫేస్‌బుక్‌ ద్వారా వీక్షిస్తున్నారు. 

ఆన్‌లైన్‌ మోసాలపై...

ప్రజల్లో ఉన్న అత్యాశను ఆసరాగా చేసుకొని కొందరు ఆన్‌లైన్‌ మోసాలకు గురై నష్టపోయిన విషయాన్ని గుర్తించిన పోలీసు శాఖ స్థానిక యువకులతో ఇందుకు సంబంధించిన షార్ట్‌ ఫిల్మ్‌ నిర్మించారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలను మోసగాళ్లు ఏ విధంగా ఆకట్టుకుంటారో అనంతరం ఎలా బురడి కొట్టిస్తారో కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం ద్వారా వివరించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

దీని వలన మోసపోయి ఆత్మహత్యలకు పూనుకోకుండా ఉండేలా వారిలో ఆత్మస్థైర్యం కల్పించేలా అవి రూపొందిస్తున్నారు. పోలీసులను ఆశ్రయించేలా ప్రోత్సాహిస్తున్నారు. ఈ దృశ్యాన్ని సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల చిత్రీకరించారు. 

డ్రంకెన్‌ డ్రైవ్‌ నివారణకు..

మద్యం తాగి వాహనాలు నడుపడం ద్వారా తనతో పాటు ఇతరులకు ప్రమాదం పొంచి ఉంటుందని అంతేకాకుండా తనపై ఇతరులు ఆధారపడి ఉన్న విషయాన్ని మర్చిపోకుండా ఆలోచింపజేసేలా చిత్రాన్ని రూపొందించి సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు.

ఈ ప్రక్రియపై ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తూ కేసులు నమోదుచేయడమే కాకుండా పట్టుబడిన వారి పరివర్తన కోసం తనదైన పంథాలో అవగాహన కల్పిస్తున్నారు. 

ప్రేమ, పెళ్లి తదితర సమస్యలపై..

యుక్త వయస్సులో సామాజిక కట్టుబాట్లు, కుటుంబ నేపథ్యాన్ని మర్చిపోయి ప్రేమపేరుతో వివాహాలు చేసుకుంటున్న జంటలు.. ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన చిత్రం సైతం తీయడానికి పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది.

కులం, మతాలకు ఆతీతంగా ప్రేమ వివాహాలు చేసుకోవడంతో రెండు కుటుంబాలు ఆదరించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఒంటరిగా భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘనటలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంతో కూడిన చిత్రాన్ని రూపొందించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్‌శాఖ సిద్ధమవుతోంది.

కళాబృందాలతో చైతన్యం..

ప్రజల భాషలో వ్యవహరిక ఇతివృత్తాలతో రూపొందించిన గేయ రూపంలో పోలీస్‌ కళాబృందాలు గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, అంటరానితనం, షీ టీమ్‌ అందిస్తున్న సేవలు, ఆన్‌లైన్‌ మోసాలు, పేకాట, జూదం, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 20 గ్రామ పంచాయతీలో కళాబృందాలు పర్యటించి అవగాహన కల్పించాయి.

అందరికీ అర్థం కావాలనే.. 

రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక విప్లవాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేసే విధానం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. అలాంటి అంశాలపై ప్రజలకు సులభమైన పద్ధతిలో చిత్ర ప్రదర్శన  ద్వారా అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న ఆలోచనతో షార్ట్‌ఫిల్మ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రజల నుంచి వీటికి వస్తున్న ఆదరణతో మరికొన్ని నూతన చిత్రాలు నిర్మించేందుకు సమాయత్తమవుతున్నాం. -చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ , సంగారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement