shortfilms
-
ఉమ్మడి కరీంనగర్ జిల్లా షార్ట్‌ఫిల్మ్ ఖిల్లా
టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని ఓ సినీ కవి రాసిన పాటను ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కళాకారులు.. దర్శకనిర్మాతలు నిజం చేస్తున్నారు. సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌లు చిత్రీకరిస్తూ.. నటిస్తూ.. నిర్మిస్తూ సత్తాచాటుతున్నారు.. పల్లె పాటలు, గ్రామీణ జీవన విధానాలను బుల్లితెరపైకి ఎక్కిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. సామాజిక మాధ్యమమే వేదికగా ప్రదర్శిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.. విద్యానగర్ (కరీంనగర్): నేడు సోషల్ మీడియాలో వీడియోలు.. షార్ట్ ఫిల్మ్‌లు ప్రపంచమంతా మారుమోగుతున్నాయి.. యువతను ఉర్రూతలూగిస్తున్నాయి.. వివిధ లోకేషన్లలో చిత్రీకరించిన లఘు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ సిటీ కరీంనగర్ ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్ సిటీగా మారింది. కళలు, కళాకారులు, విన్నూత్న ఒరవడికి వేదిక అయిన ఉమ్మడి జిల్లా నేడు షార్ట్ ఫిల్మ్‌ల నిర్మాణాలతో ప్రత్యేకతను చాటుతోంది. డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి రావడం షార్ట్ ఫిల్మ్ రంగంలో ఓ విప్లవాన్ని తీసుకువచ్చింది. ఔత్సాహికులకు వరంలా మారింది. తక్కువ టైమ్‌లో తక్కువ ఖర్చుతో తమ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం లభించింది. షార్ట్ ఫిల్మ్‌లను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు దోహదపడుతున్నాయి. అవార్డులు.. జగిత్యాలకు చెందిన లక్ష్మీపతి ప్రభుత్వ డాక్యుమెంటరీలు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 13 నంది అవార్డులు గెలుచుకున్నారు. మేడిపల్లికి చెందిన నరేందర్‌రాజు నిర్మించిన ‘ఆశాదీపం’ లఘుచిత్రానికి నందిఅవార్డు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన వారాల ఆనంద్ ఇప్పటికి 5 లఘుచిత్రాలు నిర్మించారు. ఆయన నిర్మించిన ‘లాంగ్ బ్యాటిల్ విత్ షార్ట్ మెస్సేజెస్’ చిత్రానికి అంతర్జాతీయ అవార్డు, శివపార్వతులు చిత్రానికి సౌత్ ఏషియన్ అవార్డు లభించగా ఆయన తనయుడు అన్విష్ పట్నం, పేరిణి చిత్రాలు తీశారు. యూట్యూబ్ చానల్స్... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 పైచిలుకు యూట్యూబ్ చానల్స్ ఉండగా అందులో 100 వరకు రెగ్యులర్‌గా షార్ట్ ఫిల్మ్‌లు ఇప్పటికే అప్లోడ్ చేశారు. వాటిలో మన విలేజ్ సినిమా, సదన్న కామెడీ, మా తెలంగాణ ముచ్చట్లు, మన పల్లె ముచ్చట్లు, మా ఊరి ముచ్చట్లు, తెలంగాణ విలేజ్ థియేటర్, కరీంనగర్ కుర్రాడు, ఏఎస్ఆర్ క్రియేషన్స్, సత్తన్న మల్లన్న, మన పల్లె ఏ టు జెడ్, మా పల్లె సందడి, విలేజ్ పటాస్, ఎస్కే క్రియేషన్స్, ఫైవ్ స్టార్ చానల్, విరాట్ క్రియేషన్స్, తెలంగాణ కుర్రాడు, శ్రీను గ్రాఫిక్స్ సినిమా, మన సినిమా ముచ్చట్లు, ఎంబీఏ ప్రొడక్షన్స్, నా చిన్న సినిమా తదితర ఫిల్మ్‌లు ఉన్నాయి. షార్ట్ ఫిల్మ్ బడ్జెట్.. షార్ట్ ఫిల్మ్‌ల నిర్మాణంలోనూ కష్టాలున్నాయి. ఒక్క లఘుచిత్రం నిర్మాణానికి రూ.15 నుంచి రూ.20వేల వరకు ఖర్చవుతోంది. ఒక్కరోజులో చిత్రం పూర్తవుతోంది. అడ్డంకులు వస్తే మరో రోజు పూర్తి చేస్తారు. కెమెరాకు రోజుకు రూ.1000– 1500, పేరున్న నటులకు రూ.1000– 3500 ఇవ్వాల్సి ఉంటుంది. లోకేషన్, ట్రావెలింగ్, భోజనాలు, తదితర వాటికి ఖర్చులుంటాయి. ఆదాయం ఇలా.. తీసిన లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే, చూసిన ప్రేక్షకుల సంఖ్యను బట్టి యూట్యూబ్ వారు పేమెంట్ ఇస్తారు. లక్ష మంది వీక్షిస్తే 100 డాలర్లు వస్తాయి. మనం ప్రారంభించిన చానల్‌ను యూట్యూబ్ వారు గుర్తించాలంటే వెయ్యి మంది సబ్‌స్క్రైబ్ చేయాలి. అప్లోడ్ చేసిన చిత్రాన్ని 30రోజుల్లో లక్ష మంది వీక్షించాలి. అప్పుడే డబ్బులు వస్తాయి. సత్తా చాటుతున్న వారు సందేశాత్మక దర్శకుడు ఉమ్మడి జిల్లాలోని తోటపల్లికి చెందిన అనసూరి భూనాథచారి కరీంనగర్లో మోడ్రన్ యాక్టింగ్ స్కూల్ ఆఫ్ కరీంనగర్ పేరున ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. సామాజిక రుగ్మతలపై షార్ట్ ఫిల్మ్ లు నిర్మిస్తున్నారు. ఆడపిల్లల మీద ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, వేధింపులు వంటి యదార్థ సంఘటనల ఆధారంగా 15కుపైగా సందేశాత్మక లఘుచిత్రాలను స్థానికులతో నిర్మించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతులు.. బడుకోలు దేవేందర్రెడ్డిది చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. రెండేళ్ల కిత్రం ‘మన విలేజ్ సినిమా’ యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. కథ, మాటలు రాసి లఘుచిత్రాలను నిర్మిస్తూ వాటిలో నటిస్తున్నారు. 65 లఘు చిత్రాలు నిర్మించగా, 71వేల సబ్స్క్రైవర్లు ఉన్నారు. కుర్రకారు గుండెల్లో అలజడి.. నటన, అందంతో చెంచల హరిత కుర్రాకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ 150కిపైగా షార్ట్ఫిలీంలలో హీరోయిన్గా, 200 లఘుచిత్రాల్లో సహనటిగా నటించింది. చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన ఆమెకు చిన్నప్పటి నుంచి నటన అంటే ప్రాణం. ఉమ్మడి రాష్ట్రంలో పలు రంగస్ధల ప్రదర్శనలిచ్చింది. అత్తపెత్తనం లఘుచిత్రానికి ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఎడిటర్, యాక్టర్ కమ్ డైరెక్టర్.. గంగాధర మండలం కాసారాంకు చెందిన మోగిలోజి రామ్ ఎడిటర్, యాక్టర్ కమ్ డైరెక్టర్. స్కూళ్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని నటుడిగా గుర్తింపు పొందారు. డిగ్రీ తర్వాత మల్టీమీడియా, యానిమేషన్లో శిక్షణ పొంది, యాడ్ ఫిల్మŠస్ ఎడిటర్‌గా వచ్చిన గుర్తింపుతో విరాట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘గుసగుస’ షార్ట్ ఫిల్మ్ తీశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో కలిసి పని చేశాడు. ఇప్పటి వరకు 400లకు పైగా లఘుచిత్రాలకు ఎడిటర్‌గా, 200లకు పైగా షార్ట్ ఫిల్మ్‌లకు డైరెక్టర్ పని చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు చేశారు. చిన్న సినిమాల పెద్ద నటి.. కరీంనగర్ మార్కండేయకాలనీకి చెందిన జి.రాధిక చిన్న సినిమాలకు పెద్ద నటి. భర్త ప్రోత్సాహంతో నటన రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 700 వరకు షార్ట్‌ఫిల్మŠస్తో పాటు మూడు సినిమాలు, ఇది మా కుటుంబం సీరియల్లో నటించారు. షార్ట్‌ఫిల్మ్ నుంచి సినిమాకు.. నటనపై మక్కువ పెంచుకున్న గోదావరిఖనికి చెందిన ఏదుల స్వప్నకు దామెర శంకర్ షార్ట్‌ఫిల్మ్‌లో అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు 250 చిత్రాల్లో నటించింది. అన్నయ్య రాఖీ, గయ్యాళి గాయత్రి, అనుమానపు పెళ్లాం, వసుంధర, అత్తకు తగ్గ కోడలు, కొత్త జంట తదితర లఘుచిత్రాల్లో గుర్తింపు తెచ్చుకుంది. గల్లీగ్యాంగ్, పరేషాన్, బిచ్చగాడా మజాకా సినిమాల్లో నటించింది. ఆర్ఎస్ నంద ప్రోత్సాహంతో.. దూడం శ్రీను ఆలియాస్ గ్రాఫిక్స్ శ్రీనుది కరీంనగర్ మండలం చామన్‌పల్లి గ్రామం. చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక. శ్రీనులోని నటనాసక్తిని గమనించిన ఆర్ఎస్ నంద ప్రోత్సాహించారు. ఆయన బ్యానర్లోనే ‘చిల్లరలొల్లి’ షార్ట్ ఫిల్మ్‌లో అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు 50 వరకు షార్ట్ఫిలీంలలో నటించారు. మన తెలంగాణ విలేజ్ షార్ట్ ఫిల్మ్ పేరున చానల్ ప్రారంభించి 15 చిత్రాలను అప్లోడ్ చేశారు. ఉత్తమ నిర్మాత.. వెంగల రాజ్‌కుమార్ ఏఆర్ఎస్ క్రియేషన్స్, మన పల్లె మాటలు యూట్యూబ్ చానల్‌పై 100కుపైగా షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించారు. రచయితగా నేను సైతం ప్రీమియర్ అవార్డు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి.. మహిళలకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని నిరూపిస్తున్న వ్యక్తి అనితరాజ్. చొప్పదండి గ్రామానికి చెందిన అనితరాజ్కు ఫొటోగ్రఫీ అంటే మక్కువ. ఏఆర్ఎస్ క్రియేషన్ యూట్యూబ్ చానల్ స్టోరీ రైటర్‌గా, డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా, కెమెరాఉమెన్గా ఇప్పటి వరకు 120కిపైగా షార్ట్‌ఫిల్మ్‌లు తీశారు. -
షార్ట్ లవ్... హిట్ ఫార్ములా
వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు... ఆ తర్వాత విడిపోయి దశాబ్దాల తర్వాత కలుస్తారు. అప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నప్రేమికుడు, పెళ్లి చేసుకుని సెటిలైన అతని ప్రేమికురాలి మధ్య ఒక రోజున్నర పాటు చోటు చేసుకునే భావోద్వేగాలు...తాజాగా వచ్చి మంచిటాక్ తెచ్చుకున్న ఓ తెలుగు సినిమా ఇది. విలన్లు, డ్యూయట్లు వగైరాలేవీ లేకుండా సింపుల్‌గా సాగే ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీస్ ఇప్పుడిప్పుడేవెండితెరపై సందడి చేస్తున్నాయేమోగానీ ఎప్పటినుంచో షార్ట్‌ఫిలిం రూపంలో పొట్టి తెరపై హల్చల్ చేస్తూనే ఉన్నాయి. – సాక్షి, సిటీబ్యూరో:లవ్ స్టోరీస్ విషయంలో మెయిన్ స్ట్రీమ్ సినిమా రూట్ మార్చిన వాటిల్లో ఇవి కూడా ఉన్నాయి. అంతేకాదు...ప్రేమనే సోపానం చేసుకుని వైవిధ్యభరితమైన కథాంశాలతో షార్ట్తెరపై హిట్ కొట్టిన సిటీ దర్శకులు, నటీనటులు ఆ తర్వాత వెండితెరపైనా చోటు దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌లో హల్చల్ చేసిన కొన్ని షార్ట్ ఫిలింస్ గురించి... మధురం :ఆధునిక ప్రేమలకు సనాతన ధర్మాలు, పురాణాలకూలింకేమిటి? ప్రేమలో ఉన్న ఏడు దశలను వివరిస్తూ,కాఫీషాప్‌నకు వచ్చిన అమ్మాయి మనసు దోచుకుంటాడో కుర్రాడు. ప్రేమ, పురాణాలను టచ్ చేస్తూయానిమేషన్ను కూడా ఉపయోగించుకుంటూ సాగుతుందీ షార్ట్ ఫిలిమ్. మంచి హిట్టయిన ఈ సినిమా దర్శకుడు తర్వాత మను అనే సినిమా అవకాశం కూడాదక్కించుకున్నాడు. ఇందులో నటించిన చాందినిచౌదరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె మెయిన్‌స్ట్రీమ్ హీరోయిన్గా ఎదగడానికి దోహదం చేసింది. 15 డేస్ ఆఫ్ లవ్ సెలవులకు హైదరాబాద్‌కి వస్తుందో అమ్మాయి. 15 రోజులు మాత్రమే నగరంలో ఉన్న ఆమెను ఇక్కడే పరిచయం చేసుకున్న ఓ పోకిరీ అబ్బాయి ప్రేమవైపు ఎలా నడిపించగలిగాడు? జీవితం గురించిన గొప్ప దృక్పథం, మాటలు, ఆలోచనలతో ఆమె మనసులో ఎలా చోటు సంపాదించాడు? ఇక్కడ ఉన్నన్ని రోజులూ ఆమె నుంచి రాని గ్రీన్‌సిగ్నల్ వైజాగ్ వెళ్లాక ఎలా పొందగలిగాడు? వంటి వాటితో సూపర్‌హిట్టయిన ఈ షార్ట్ ఫిలిమ్‌కు జయకిషోర్ బండి దర్శకుడు, చక్కని, చిక్కని ఆలోచనలను, గాఢతను పొట్టి తెరకెక్కించిన జయకిషోర్...ఆ తర్వాత సినీ దర్శకుడిగా మారాడు. హ్యాపీ లైఫ్.. సాధారణంగా లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలను దేవదాసుల్ని చేస్తుంది అంటారు. అయితే తాగుబోతైన 20 ఏళ్ల యువకుడు లవ్ ఫెయిల్యూర్లో ఉండి, ప్రేమ పట్ల వ్యతిరేకత నింపుకున్న 27 ఏళ్ల అమ్మాయిని ఎలా కన్విన్స్ చేశాడు? సంతోషకరమైన సమాప్తం అనే అర్థం వచ్చే టైటిల్‌తో 2015లో వచ్చిన ఈ సినిమా చూపించేది ఇదే. ఒక గంట వ్యవధితో ఫీచర్ ఫిల్మ్‌ని తలపించే దీని దర్శకుడు జయశంకర్. ఇందులోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఆ తర్వత కొన్ని మెయిన్‌స్ట్రీమ్ మూవీస్‌లోనూ వాడుకోవడం విశేషం. మనోజ్ అనే హీరో క్యారెక్టర్‌కి అర్జున్ రెడ్డి హీరో క్యారెక్టర్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ షార్ట్ ఫిలిం హిట్‌తో దీని డైరెక్టర్ పేపర్ బాయ్ అని ఒక మూవీ తీశాడు ..ఒక పెద్ద బ్యానర్లో సినిమాతో పాటు , కొన్ని వెబ్ సిరీస్‌కూ పనిచేస్తున్నాడు. డైలాగ్ ఇన్ ది డార్క్... ఓ ప్రేమకథని విజువల్స్ లేకుండా చూపించడం సాధ్యమా? ఈ పేరుతో సిటీలో ఒక రెస్టారెంట్ ఉందని, అది ప్రేమికులకు చిరునామా అని మనకు తెలుసు. అదే పేరుతో ఒక సినిమాని రూపొందించడం డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ కు తెలుసు. కళ్లు లేని వారు కూడా హృదయంతో చూడవచ్చు అంటూ...వర్చువల్ టెక్నాలజీతో వచ్చిన మొదటి షార్ట్ ఫిల్మ్ ఇది. వీక్షకులను నేరుగా సన్నివేశాల్లోని భావోద్వేగాలతో అనుసంధానం చేస్తుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ షాక్ ఇస్తుంది. చాలామంది సెలెబ్రిటీస్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్‌ని షేర్ చేశారు. పొట్టి తెరది గట్టి పాత్ర సోషల్ మీడియా వినియోగంలో యువతదే పెద్ద వాటా కాబట్టి సహజంగానే ప్రేమ ఆధారిత షార్ట్ ఫిలింస్ బాగా వచ్చేవి. అలాంటి పొట్టి చిత్రాలు తీసిన మాలాంటి వారి పరిమితుల వల్ల హంగు ఆర్భాటాల కన్నా వైవిధ్య భరిత సబ్జెక్టులు, సంభాషణలు, భావోద్వేగాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి సక్సెస్ సాధించాం. ఇప్పుడు ఆ ప్రభావం సినిమాలతో పాటు వెబ్‌సిరీస్ మీద కూడా పడింది.– జయశంకర్, సినీ దర్శకులు కృష్ణమూర్తిగారింట్లో (2016) హీరోకి నాన్న ఫోన్ చేసి అతని స్నేహితుడు కృష్ణమూర్తికి వంట్లో బాగాలేదు రాజమండ్రి దగ్గర ఒక విలేజ్ లో ఉన్నాడు అతడిని కలిసి రమ్మని చెబుతాడు. హీరోకి ఏమాత్రం ఇష్టం లేకున్నా నాన్న కోసం ఆ ఊరికి వెళతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కృష్ణమూర్తి కూతురితో ప్రేమలో పడతాడు. అయితే కృష్ణమూర్తి గతంలో హీరో తల్లిని ప్రేమించాడని తెలిసి హీరో ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి సున్నితమైన సన్నివేశాలతో కథని నడిపిస్తారు డైరెక్టర్ లక్ష్మణ్.కె.కృష్ణ. -
అతిచిన్న మొత్తంతో షార్ట్ ఫిలిం
సాక్షి, సిటీబ్యూరో :ఆ యువకుడు కలలు కన్నాడు. వాటి సాకారానికి కృషి చేసిసఫలీకృతుడయ్యాడు. రూ.5,500 చిన్నమొత్తంతో ఓ షార్ట్ ఫిలింను రూపొందించాడు. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథనంతో 8 నిమిషాలనిడివితో సైఫై థ్రిల్లర్ కౌంట్‌డౌన్ షార్ట్ ఫిలింని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు నగరానికి చెందిన కార్తీక్. ఈ ప్రయోగం ఔత్సాహిక ఫిలిం మేకర్స్‌కి ఎంతో ఉపయోగం. తక్కువ డబ్బుల్లో ఎఫెక్టివ్ చిత్ర రూపకల్పన చేసిన కార్తీక్ తన అనుభవాలను ఇలా వెలిబుచ్చాడు.. పీవీసీ పైపుల మెటీరియల్‌తో.. మంచి విషయాన్ని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఎఫెక్టివ్‌గా చెప్పవచ్చు. దానికి ఎక్కువ క్రూ, ఎక్కువ బడ్జెట్ అవసరంలేదని ప్రూవ్ చేయాలనుకున్నా. సెర్చ్ స్టార్ట్ చేశాను. ఈ రోజుల్లో మనకు ఏది రాకపోయినా, నేర్పించడానికి ఇంటర్నెట్ ఉండనే ఉన్నది. చిత్రాన్ని రూపొందించాలి అనుకున్నప్పుడు ఏయే విభాగాల్లో నైపుణ్యం అవసరమో లిస్ట్ రాసుకున్నాను. గూగుల్ సెర్చ్‌లో చాలా ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. కెమెరా లెన్సుల నుంచి వీఎఫ్ఎక్స్, కలర్ గ్రేడింగ్, డ్రోన్ షాట్స్ అన్నీ అలాగే నేర్చుకున్నాను. అలా స్క్రీన్ రైటింగ్, షాట్ కంపోజిషన్ నేర్చుకున్నాక, వీడియో ప్రొడక్షన్ ఎక్వీప్మెంట్ గురించి తెలుసుకున్నాను. ఇక్కడ నాకు బ్రేక్ పడింది. నా స్టైఫండ్‌తో కొనుకున్న నికాన్ పి100 కెమెరా ట్రైపాడ్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి. స్టెడీ, స్మూత్ షాట్స్ రావాలంటే పీవీసీ పైపులతో చేసిన కెమెరా ఎక్వీప్మెంట్ చాలా కావాలి. నాలాంటి బిగినర్‌కి అంత ఖర్చు భరించటం సాధ్యం కాదు. ఇవేవీ లేకుండానే.. అలాంటి ఎఫెక్ట్ పొందాలి. అప్పుడు డూ ఇట్ యువర్సెల్ఫ్ (డీఐవై) వీడియోలే మార్గంగా మారాయి. యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోలు అనేకం ఉన్నాయి. కెమెరా స్లైడర్స్, షోల్డర్ మౌంట్స్, లైట్ స్టాండ్స్, డిఫ్యూజన్ ప్యానెల్స్, బూమ్ పోల్స్ అన్నీ పేపర్ మీద డిజైన్ వేసుకుని హార్డ్‌వేర్ షాపు నుంచి పీవీసీ పైపుల మెటీరియల్ తీసుకుని తయారు చేయటం ప్రారంభించాను. దీనికి 18 గంటల సమయం పట్టింది. నాన్న బ్యాంకర్, అమ్మ గృహిణి. నల్లకుంటలో నివాసం. 2003లో గువాహటీలో ఐఐటీ చేశా. స్టార్టప్ కంపెనీలతో కలిసి ప్రొడక్ట్ మేనేజర్‌గా చేస్తున్నా. మిగతా సమయాల్లో సినిమాలు చూస్తా. ట్రావెలింగ్ చేస్తా. 2017లో బోధ్‌గయా నా మొదటి డాక్యుమెంటరీ. దానికి చక్కటి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నా ట్రావెల్ సిరీస్ లాంచ్ చేశాను. ఇప్పటికి 20 వీడియోలు నా యూట్యూబ్ చానెల్ అద్వైతలో ఉన్నాయి. ‘కౌంట్ డౌన్’ ఇలామొదలైంది.. నా స్నేహితుడు కొన్నాళ్ల కిత్రం ఓ ఆర్టికల్ పంపించాడు, 15 ఏళ్ల తర్వాత మనమంతా ఆక్సిజన్ మాస్క్‌లు వేసుకుని తిరగాల్సి వస్తుందని ఆ ఆర్టికల్ పరమార్థం. అది చదివి ఒక్కసారిగా ఖిన్నుడనయ్యా. రీసెర్చ్ ప్రారంభించాను. జీర్ణించుకోవడానికి వీలు కాని ఎన్నో విషయాలు ఈ రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను. ఉత్తర ధృవంలో వేగంగా కరుగుతున్న మంచు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సైంటిస్టుల అంచనా ప్రకారం 2,100కల్లా 77 శాతం మాల్దీవులు సముద్రంలో మునిగిపోవచ్చు. మరో 15 దేశాలకు ఇదే పరిస్థితి రావచ్చు. ఈ విషమ పరిస్థితి గురించి అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాను. మెసేజ్ ఓరియెంటెడ్ చెప్తే ఎక్కదు. గ్రావిటీ పెంచి చెప్పాలని అనుకున్నాను.. ప్రేక్షకులను వేరే ప్లానెట్కి తీసుకెళ్లి నీకు ఆక్సిజన్, నీరు లేదంటే పరిస్థితి ఏంటి అని వాళ్లు ఆలోచించాలి. ఆ రోజు నుంచే స్టోరీ రైటింగ్, స్క్రీన్‌ప్లే బోర్డ్ తయారీకి శ్రీకారం చుట్టాను. రూ.5,500తో ఎలా.. స్క్రీన్ చేసిన చాలా చోట్ల ఈ చిత్రానికి రూ.10–15 లక్షలు ఖర్చు పెట్టారా అని అడిగిన వారున్నారు. అసలు ఖర్చు 75 డాలర్లు అని చెబితే ఆశ్చర్యపోయారు. స్పేస్ సూట్ కాస్ట్యూమ్ రూ.2,400, ట్రావెల్, లాడ్జింగ్ రూ.2,500, సెట్ డిజైన్, టైప్‌రైటర్ రెంటల్ రూ.600. మొత్తం ఖర్చు రూ.5,500. కాస్ట్, క్రూ నా కజిన్స్ చైతన్య, చాణక్య.. చాణక్య ఆస్ట్రనాట్గా నటించాడు. చైతన్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఫ్రీగా పనిచేశారు. వీఎఫ్ఎక్స్ నేనే స్వయంగా చేసుకున్నా. ఆస్ట్రనాట్ కాస్ట్యూమ్ డిజైన్.. కాస్ట్యూమ్స్ అద్దెకి తీసుకోవాలంటే రూ.10 వేలు కావాలి. వాటిని నేనే తయారు చేయడానికి రెడీ అయ్యాను. 5 రోజులు కష్టపడి సూట్ రెడీ చేశా. పాత హెల్మెట్ తీసుకుని, హోంస్ప్రేతో పెయింట్ చేశాను. మిగతా సెట్ సామాను రీసైక్లింగ్, వేస్ట్ మెటీరియల్‌తో చేసినవే. నా బెడ్రూంలో కొన్ని సీన్లు షూట్ చేశాం. సమయం.. 2 రోజులు స్క్రిప్టింగ్, వారం ప్రి ప్రొడక్షన్, 72 గంటలు ఫిల్మింగ్. 2 వారాలు పోస్ట్ ప్రొడక్షన్. అంతే ఇండిపెండెంట్ సైఫై షార్ట్ థ్రిల్లర్ రెడీ. ఇదీ కథ.. ఒక అంతరిక్ష వ్యోమగామి అతను ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక పాడుకావటంతో తెలియని గ్రహంపై ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. అక్కడ నుంచి ప్రారంభమైన కథ భూగ్రహ వాసులమైన మనందరినీ కనెక్ట్ చేస్తూ ముగుస్తుంది. ప్రశంసల జల్లు.. మిలాన్కి చెందిన డ్యుమిలా30– అంతర్జాతీయ చిత్రోత్సవం, ఇటలీలో జరిగే సాలస్ సినీ ఫెస్టివల్, ఊటి, కాకతీయ, చెన్నై ఫిలిం ఫెస్టివల్స్‌లో నా కౌంట్‌డౌన్ షార్ట్ ఫిలిం ప్రదర్శితమైంది. టాలీవుడ్ హీరోలు నవదీప్, సుధీర్ బాబు ప్రశంసలందుకుంది ఈ చిత్రం. -
‘కళ’లతో కళ్లెం
సంగారెడ్డి క్రైం : మితిమిరిన వేగం, అజాగ్రత్త, మద్యం తాగి వాహనాలు నడుపడంతో తనతో పాటు రోడ్డుపై నడిచే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు సైతం భరోసా లేని ప్రస్తుత తరుణంలో జిల్లాపోలీస్‌శాఖ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తరుచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం యువత అతివేగం ఒక కారణం అయితే మద్యం తాగి వాహనాలు నడుపడం మరోకారణం. దీన్ని గుర్తించిన అధికారులు జరుగుతున్న పరిణామలు, వాటి వల్ల ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన ఇతివృత్తంతో షార్ట్‌ఫీల్మ్‌లను నిర్మించి ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కళా బృందాలతో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన, షార్ట్ ఫిల్మ్‌లతో సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజులోనే వేల మంది ఈ వీడియోలను ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నారు. ఆన్లైన్ మోసాలపై... ప్రజల్లో ఉన్న అత్యాశను ఆసరాగా చేసుకొని కొందరు ఆన్లైన్ మోసాలకు గురై నష్టపోయిన విషయాన్ని గుర్తించిన పోలీసు శాఖ స్థానిక యువకులతో ఇందుకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. ఆన్లైన్ ద్వారా ప్రజలను మోసగాళ్లు ఏ విధంగా ఆకట్టుకుంటారో అనంతరం ఎలా బురడి కొట్టిస్తారో కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం ద్వారా వివరించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీని వలన మోసపోయి ఆత్మహత్యలకు పూనుకోకుండా ఉండేలా వారిలో ఆత్మస్థైర్యం కల్పించేలా అవి రూపొందిస్తున్నారు. పోలీసులను ఆశ్రయించేలా ప్రోత్సాహిస్తున్నారు. ఈ దృశ్యాన్ని సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల చిత్రీకరించారు. డ్రంకెన్ డ్రైవ్ నివారణకు.. మద్యం తాగి వాహనాలు నడుపడం ద్వారా తనతో పాటు ఇతరులకు ప్రమాదం పొంచి ఉంటుందని అంతేకాకుండా తనపై ఇతరులు ఆధారపడి ఉన్న విషయాన్ని మర్చిపోకుండా ఆలోచింపజేసేలా చిత్రాన్ని రూపొందించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు. ఈ ప్రక్రియపై ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ కేసులు నమోదుచేయడమే కాకుండా పట్టుబడిన వారి పరివర్తన కోసం తనదైన పంథాలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రేమ, పెళ్లి తదితర సమస్యలపై.. యుక్త వయస్సులో సామాజిక కట్టుబాట్లు, కుటుంబ నేపథ్యాన్ని మర్చిపోయి ప్రేమపేరుతో వివాహాలు చేసుకుంటున్న జంటలు.. ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన చిత్రం సైతం తీయడానికి పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. కులం, మతాలకు ఆతీతంగా ప్రేమ వివాహాలు చేసుకోవడంతో రెండు కుటుంబాలు ఆదరించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఒంటరిగా భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘనటలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంతో కూడిన చిత్రాన్ని రూపొందించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్‌శాఖ సిద్ధమవుతోంది. కళాబృందాలతో చైతన్యం.. ప్రజల భాషలో వ్యవహరిక ఇతివృత్తాలతో రూపొందించిన గేయ రూపంలో పోలీస్ కళాబృందాలు గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, అంటరానితనం, షీ టీమ్ అందిస్తున్న సేవలు, ఆన్లైన్ మోసాలు, పేకాట, జూదం, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 20 గ్రామ పంచాయతీలో కళాబృందాలు పర్యటించి అవగాహన కల్పించాయి. అందరికీ అర్థం కావాలనే.. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక విప్లవాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేసే విధానం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. అలాంటి అంశాలపై ప్రజలకు సులభమైన పద్ధతిలో చిత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న ఆలోచనతో షార్ట్‌ఫిల్మ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రజల నుంచి వీటికి వస్తున్న ఆదరణతో మరికొన్ని నూతన చిత్రాలు నిర్మించేందుకు సమాయత్తమవుతున్నాం. -చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ , సంగారెడ్డి -
హైదరాబాద్ అంతా చుట్టేయాలి...
షార్ట్ ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి.. ‘కేటుగాడు’తో తెరంగ్రేటం చేసి.. ‘శమంతకమణి’లా మెరిసిన ‘కుందనపు బొమ్మ’లాంటి పదహారణాల తెలుగమ్మాయి చాందినీ చౌదరి. ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆమె నటించిన మరో చిత్రం ‘హౌరాబ్రిడ్జి’విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చాందిని సిటీతో అనుబంధం, తన నటనా ప్రస్థానాన్ని వివరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... మాది వైజాగ్. బెంగళూర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. బీటెక్‌లో ఉండగా స్నేహితుల కోరిక మేరకు షార్ట్ఫిల్మ్స్లో నటించాను. నేను, హీరో రాజ్‌తరుణ్ కలిసి 2011లో నటించిన ‘బ్లైండ్ డేట్’ షార్ట్ఫిలిమ్కి మంచి స్పందన వచ్చింది. తర్వాత లక్కీ, నౌదోగ్యారా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు మరింత చేరువయ్యాను. 2014లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నేను, రవి నటించిన ‘మధురం’ షార్ట్ ఫిలిమ్ యూట్యూబ్‌లో సూపర్‌హిట్ అయింది. వెండితెరపై అవకాశం.. ‘మధురం’ సోషల్‌లో వైరల్ అవడంతో వెండితెరపై అవకాశాలొచ్చాయి. అయితే అప్పుడు చదువు కోసం సినిమాలు వదులుకున్నాను. 2015లో కేటుగాడు చిత్రంలో హీరోయిన్గా నటించాను. అనంతరం కుందనపు బొమ్మ, శమంతకమణి చిత్రాల్లో చేశాను. హీరో రాహుల్ రవీంద్రన్తో కలిసి నటించిన ‘హౌరాబ్రిడ్జి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌తో కలిసి నటించిన ‘మను’ చిత్రం త్వరలో విడుదల కానుంది. సిటీ చుట్టేయాలి... హైదరాబాద్ అంతా చుట్టేయాలని ఉంది. అయితే షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో కుదరడం లేదు. ఇక్కడ ఎక్కువ సమయం గడపాలనుకున్నా వీలు కావడం లేదు. దేశంలోనే ఇది డిఫరెంట్, ఫ్రీడమ్ అండ్ ఫ్రెండ్లీ సిటీ. సిటీలో ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. జూబ్లీహిల్స్‌లోని కొన్ని రెస్టారెంట్స్‌లో దొరికే ‘జపనీస్ సూశి’ వంటకాన్ని ఎంతో ఇష్టంగా లాగించేస్తా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ వంటకాన్ని రుచి చూస్తాను. షాపింగ్ చేయడమంటే ఇష్టం. స్పోర్ట్స్ అంటే ఇష్టం.. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల్లో అధికంగా పాల్గొనేదాన్ని. త్రోబాల్, ఖోఖో, లాంగ్‌జంప్‌లలో రాష్ట్రస్థాయిలో పాల్గొన్నాను. పెయింటిం కూడా వేస్తాను. పెయింటింగ్ ఎగ్జిబిషన్లో నా చిత్రాలు ప్రదర్శించాను. ఫేస్బుక్లో 5లక్షల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 2.3 లక్షల మంది అభిమానులు ఉన్నారు. వారందరి ఆదరాభిమానాలతో తెలుగు తెరపై రాణిస్తున్నాను. -
ఈ తరం గల్లీ కుర్రాడు
డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటున్న ఇంజనీర్ రాత్రంతా పార్ట్‌టైం జాబ్ ఉదయం టీకొట్టులో తండ్రికి సాయపడుతూ.. మధ్యాహ్నం పోటీ పరీక్షలకు శిక్షణ షార్ట్ ఫిల్మ్‌లో హీరోగా అవకాశం బీటెక్ పూర్తిచేసిన ఆ కుర్రాడి లైఫ్ సై్టల్ డిఫరెంట్. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు టీ కొట్టు నిర్వహిస్తున్న తండ్రికి సాయపడడం.. మధ్యాహ్నం 2 గంటల నుంచి పోటీ పరీక్షలకు కోచింగ్.. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌గా పార్ట్‌టైం జాబ్.. వీటితోపాటు డ్యాన్స్, షార్ట్ ఫిల్మ్ నటన.. ఇలా ఇరవై నాలుగు గంటల్లో ఏ క్షణాన్నీ వథా చేయడం లేదు. పేదరికమే తనకు లభించిన వరంగా దూసుకుపోతున్న ఈ గల్లీ కుర్రాడి గురించి ఈ తరం యువత తెలుసుకోవాల్సిందే. సాక్షి, విశాఖపట్నం : అక్కయ్యపాలేనికి చెందిన నిద్దాన కళ్యాణŠ కుమార్ అందరి కుర్రాళ్లలాగే ఆడుతూ పాడుతూ గడపాలనుకోలేదు. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాన్ని చూసి చేదోడువాదోడుగా ఉండాలనుకునేవాడు. సీతమ్మధారలో టీకొట్టు నిర్వహిస్తున్న తండ్రి బంగారునాయుడికి సాయపడుతూ బీటెక్ పూర్తి చేశాడు. సాధారణంగా బీటెక్ విద్యార్థులంటే కొంచెం హైఫైగా ఉంటారు. కళ్యాణ్ మాత్రం అనవసర ఆర్భాటాలకు పోలేదు. ఉదయాన్నే టీకొట్టు దగ్గరకు వెళ్లి మధ్యాహ్నం వరకూ తండ్రికి సాయం చేస్తాడు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌గా పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. తండ్రికి అనారోగ్యంగా ఉంటే కళ్యాణ్ ఒక్కడే టీ బండిని చూసుకుంటుంటాడు. ఇటీవలే ఫస్ట్‌క్లాస్‌లో బీటెక్ పూర్తి చేసిన అతను మధ్యాహ్నం బ్యాంకుSటెస్ట్‌లకు శిక్షణ తీసుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తూనే తన అభిరుచులను వదులుకోకుండా డాన్స్ నేర్చుకున్నాడు. శుభకార్యాలు, పండుగల సమయంలో డాన్స్ చేయడంతోపాటు కొరియోగ్రఫీ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తన చిన్ననాటి స్నేహితులతో ‘ఒక్క నిమిషం’ అనే షార్ట్‌ఫిల్మ్ రూపొందిస్తున్నాడు. హీరోగా తానే నటిస్తుండగా, అతని చిన్ననాటి స్నేహితురాలు బి.రాజి హీరోయిన్గా చేస్తోంది. ప్రాణ స్నేహితుడైన జి.మధు ఈ షార్ట్‌ఫిల్మ్‌ని రచించి, దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ పనైనా ఎందుకు చేయలేకపోతున్నారని ఎవరైనా అడిగితే ఎక్కువ మంది చెప్పే కారణం తమకు సమయం సరిపోవడం లేదని. కానీ కళ్యాణ్ గురించి తెలిశాక మాటలో వాస్తవం లేదని అర్ధమవుతోంది. ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచీ మా అమ్మానాన్న పడుతున్న కష్టాలు చూశాను. వారికి అదనపు భారం కాకూడదనుకున్నాను. నాన్నే టీకొట్టు నడుపుతున్నపుడు నేను అక్కడ టీలు అందించడం నామోషీగా భావించలేదు. ఇప్పుడు కోచింగ్ కోసం డబ్బులు కావాలి కాబట్టి పార్ట్‌టైమ్ జాబ్ తప్పదు. ఇంత కష్టంలో నాకున్న ఒకే ఒక్క ఊరట నటన, డాన్స్. అందుకే వాటిని వదులు కోవడం లేదు. నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. –కళ్యాణ్ కుమార్ వాడి కోసమే డైరెక్టర్‌నయ్యా.. కళ్యాణ్ నా ప్రాణ స్నేహితుడు. నేను బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం షిప్‌యార్డ్‌లో సూపర్వైజర్గా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి కళ్యాణ్ పడుతున్న కష్టాలు చూస్తున్నాను. వాడికి నటన అంటే ఇష్టం. అందుకే వాడికోసం షార్ట్ పిల్మ్ తీయాలనుకున్నాను. కథ రాసి డైరెక్టర్‌గా మారాను. సమాజానికి సందేశమిచ్చే చిత్రాలు తీయాలనుకుంటున్నాం. –మధు స్నేహం కోసం ఒప్పుకున్నా.. చిన్నప్పటి నుంచి మా ముగ్గురం మంచి ఫ్రెండ్స్. పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం. తర్వాత కాలేజీలు వేరైనా రోజూ కలుస్తుండేవాళ్లం. మధు ఎప్పటి నుంచో ఓ స్టోరీ రాసి ఉంచుకున్నాడు. వాళ్లు షార్ట్‌ఫిల్మ్ తీయాలనుకున్నప్పుడు నన్ను హీరోయిన్గా చేయమని అడిగారు. మా మధ్య స్నేహం కొద్దీ ఒప్పుకున్నాను. నాక్కూడా నటనపై ఆసక్తి ఉండటంతో ఎటువంటి టెన్షన్ లేదు. –రాజి -
వెండితెరపై విశాఖ కెరటం
సీతమ్మధార : ఆ యువకుడికి సినిమా అంటే పిచ్చి. వెండితెరపై కనిపించాలని, స్క్రీన్‌పై తనను తాను చూసుకుని మురిసిపోవాలని కలలు కన్నాడు. కళ్లు మూసినా..కళ్లు తెరిచినా లక్ష్యం వెంటబడుతూనే ఉండేది. కట్ చేస్తే అనుకున్నది సాధించాడు. ఎంకా పైకి ఎదగాలని శ్రమిస్తున్నాడు. విశాఖ సీతమ్మధారకు చెందిన గోవర్ధనరెడ్డి ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌లో సత్తా చాటుతున్నాడు. సినీ పరిశ్రమలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఎంతో మంది నటులు హీరోలుగా ఎదిగారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని గోవర్ధన్ అడుగులు వేస్తున్నారు. ఓ వైపు సెక్యూరిటీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తూ తనకిష్టమైన నటనా రంగంలో రాణిస్తున్నారు. పలు సినిమాల్లో హీరోకు స్నేహితుడిగా, పోలీస్ అధికారిగా, ప్రేమికుడిగా, విలన్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తున్నాడు. చిన్నతనంలోనే కరాటే నేర్చుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతభి కనబరిచారు. బ్లాక్‌బెల్ట్ సాధించారు. ఇంతవరకూ నటించిన సినిమాలు ఇప్పటి వరకు‘‘ లవ్ చేయాల వద్దా’లో పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు, ‘నేత్ర’లో విలన్ పాత్ర దామోదర్గా నటించాడు, ‘అసలేమయింది’’లో హీరోయిన్ను అల్లరి పెట్టే పాత్ర పోషిస్తున్నాడు. 12 షార్టు ఫిల్మ్‌ల్లో నటించాడు. ఎం.ఆర్. ప్రొడక్షన్లో ‘బ్రదర్స్’ షార్ట్ ఫిల్మ్‌కు విశేష ఆదరణ వచ్చిందని గోవర్ధన రెడ్డి తెలిపారు.