సాక్షి, సిటీబ్యూరో :ఆ యువకుడు కలలు కన్నాడు. వాటి సాకారానికి కృషి చేసిసఫలీకృతుడయ్యాడు. రూ.5,500 చిన్నమొత్తంతో ఓ షార్ట్ ఫిలింను రూపొందించాడు. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథనంతో 8 నిమిషాలనిడివితో సైఫై థ్రిల్లర్ కౌంట్‌డౌన్ షార్ట్ ఫిలింని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు నగరానికి చెందిన కార్తీక్. ఈ ప్రయోగం ఔత్సాహిక ఫిలిం మేకర్స్‌కి ఎంతో ఉపయోగం. తక్కువ డబ్బుల్లో ఎఫెక్టివ్ చిత్ర రూపకల్పన చేసిన కార్తీక్ తన అనుభవాలను ఇలా వెలిబుచ్చాడు..
పీవీసీ పైపుల మెటీరియల్‌తో..
మంచి విషయాన్ని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఎఫెక్టివ్‌గా చెప్పవచ్చు. దానికి ఎక్కువ క్రూ, ఎక్కువ బడ్జెట్ అవసరంలేదని ప్రూవ్ చేయాలనుకున్నా. సెర్చ్ స్టార్ట్ చేశాను. ఈ రోజుల్లో మనకు ఏది రాకపోయినా, నేర్పించడానికి ఇంటర్నెట్ ఉండనే ఉన్నది. చిత్రాన్ని రూపొందించాలి అనుకున్నప్పుడు ఏయే విభాగాల్లో నైపుణ్యం అవసరమో లిస్ట్ రాసుకున్నాను. గూగుల్ సెర్చ్‌లో చాలా ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. కెమెరా లెన్సుల నుంచి వీఎఫ్‌ఎక్స్, కలర్ గ్రేడింగ్, డ్రోన్ షాట్స్ అన్నీ అలాగే నేర్చుకున్నాను. అలా స్క్రీన్ రైటింగ్, షాట్ కంపోజిషన్ నేర్చుకున్నాక, వీడియో ప్రొడక్షన్ ఎక్వీప్‌మెంట్ గురించి తెలుసుకున్నాను. ఇక్కడ నాకు బ్రేక్ పడింది. నా స్టైఫండ్‌తో కొనుకున్న నికాన్ పి100 కెమెరా ట్రైపాడ్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి. స్టెడీ, స్మూత్ షాట్స్ రావాలంటే పీవీసీ పైపులతో చేసిన కెమెరా ఎక్వీప్‌మెంట్ చాలా కావాలి. నాలాంటి బిగినర్‌కి అంత ఖర్చు భరించటం సాధ్యం కాదు. ఇవేవీ లేకుండానే.. అలాంటి ఎఫెక్ట్ పొందాలి. అప్పుడు డూ ఇట్ యువర్‌సెల్ఫ్ (డీఐవై) వీడియోలే మార్గంగా మారాయి. యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోలు అనేకం ఉన్నాయి. కెమెరా స్లైడర్స్, షోల్డర్ మౌంట్స్, లైట్ స్టాండ్స్, డిఫ్యూజన్ ప్యానెల్స్, బూమ్ పోల్స్ అన్నీ పేపర్ మీద డిజైన్ వేసుకుని హార్డ్‌వేర్ షాపు నుంచి పీవీసీ పైపుల మెటీరియల్ తీసుకుని తయారు చేయటం ప్రారంభించాను. దీనికి 18 గంటల సమయం పట్టింది.
నాన్న బ్యాంకర్, అమ్మ గృహిణి. నల్లకుంటలో నివాసం. 2003లో గువాహటీలో ఐఐటీ చేశా. స్టార్టప్ కంపెనీలతో కలిసి ప్రొడక్ట్ మేనేజర్‌గా చేస్తున్నా. మిగతా సమయాల్లో సినిమాలు చూస్తా. ట్రావెలింగ్ చేస్తా. 2017లో బోధ్‌గయా నా మొదటి డాక్యుమెంటరీ. దానికి చక్కటి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నా ట్రావెల్ సిరీస్ లాంచ్ చేశాను. ఇప్పటికి 20 వీడియోలు నా యూట్యూబ్ చానెల్ అద్వైతలో ఉన్నాయి.
‘కౌంట్ డౌన్’ ఇలామొదలైంది..
నా స్నేహితుడు కొన్నాళ్ల కిత్రం ఓ ఆర్టికల్ పంపించాడు, 15 ఏళ్ల తర్వాత మనమంతా ఆక్సిజన్ మాస్క్‌లు వేసుకుని తిరగాల్సి వస్తుందని ఆ ఆర్టికల్ పరమార్థం. అది చదివి ఒక్కసారిగా ఖిన్నుడనయ్యా. రీసెర్చ్ ప్రారంభించాను. జీర్ణించుకోవడానికి వీలు కాని ఎన్నో విషయాలు ఈ రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను. ఉత్తర ధృవంలో వేగంగా కరుగుతున్న మంచు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సైంటిస్టుల అంచనా ప్రకారం 2,100కల్లా 77 శాతం మాల్దీవులు సముద్రంలో మునిగిపోవచ్చు. మరో 15 దేశాలకు ఇదే పరిస్థితి రావచ్చు. ఈ విషమ పరిస్థితి గురించి అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాను. మెసేజ్ ఓరియెంటెడ్ చెప్తే ఎక్కదు. గ్రావిటీ పెంచి చెప్పాలని అనుకున్నాను.. ప్రేక్షకులను వేరే ప్లానెట్‌కి తీసుకెళ్లి నీకు ఆక్సిజన్, నీరు లేదంటే పరిస్థితి ఏంటి అని వాళ్లు ఆలోచించాలి. ఆ రోజు నుంచే స్టోరీ రైటింగ్, స్క్రీన్‌ప్లే బోర్డ్ తయారీకి శ్రీకారం చుట్టాను.
రూ.5,500తో ఎలా..
స్క్రీన్ చేసిన చాలా చోట్ల ఈ చిత్రానికి రూ.10–15 లక్షలు ఖర్చు పెట్టారా అని అడిగిన వారున్నారు. అసలు ఖర్చు 75 డాలర్లు అని చెబితే ఆశ్చర్యపోయారు. స్పేస్ సూట్ కాస్ట్యూమ్ రూ.2,400, ట్రావెల్, లాడ్జింగ్ రూ.2,500, సెట్ డిజైన్, టైప్‌రైటర్ రెంటల్ రూ.600. మొత్తం ఖర్చు రూ.5,500. కాస్ట్, క్రూ నా కజిన్స్ చైతన్య, చాణక్య.. చాణక్య ఆస్ట్రనాట్‌గా నటించాడు. చైతన్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఫ్రీగా పనిచేశారు. వీఎఫ్‌ఎక్స్ నేనే స్వయంగా చేసుకున్నా.
ఆస్ట్రనాట్ కాస్ట్యూమ్ డిజైన్..
కాస్ట్యూమ్స్ అద్దెకి తీసుకోవాలంటే రూ.10 వేలు కావాలి. వాటిని నేనే తయారు చేయడానికి రెడీ అయ్యాను. 5 రోజులు కష్టపడి సూట్ రెడీ చేశా. పాత హెల్మెట్ తీసుకుని, హోంస్ప్రేతో పెయింట్ చేశాను. మిగతా సెట్ సామాను రీసైక్లింగ్, వేస్ట్ మెటీరియల్‌తో చేసినవే. నా బెడ్‌రూంలో కొన్ని సీన్లు షూట్ చేశాం.
సమయం..
2 రోజులు స్క్రిప్టింగ్, వారం ప్రి ప్రొడక్షన్, 72 గంటలు ఫిల్మింగ్. 2 వారాలు పోస్ట్ ప్రొడక్షన్. అంతే ఇండిపెండెంట్ సైఫై షార్ట్ థ్రిల్లర్ రెడీ.
ఇదీ కథ..
ఒక అంతరిక్ష వ్యోమగామి అతను ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక పాడుకావటంతో తెలియని గ్రహంపై ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. అక్కడ నుంచి ప్రారంభమైన కథ భూగ్రహ వాసులమైన మనందరినీ కనెక్ట్ చేస్తూ ముగుస్తుంది.
ప్రశంసల జల్లు..
మిలాన్‌కి చెందిన డ్యుమిలా30– అంతర్జాతీయ చిత్రోత్సవం, ఇటలీలో జరిగే సాలస్ సినీ ఫెస్టివల్, ఊటి, కాకతీయ, చెన్నై ఫిలిం ఫెస్టివల్స్‌లో నా కౌంట్‌డౌన్ షార్ట్ ఫిలిం ప్రదర్శితమైంది. టాలీవుడ్ హీరోలు నవదీప్, సుధీర్ బాబు ప్రశంసలందుకుంది ఈ చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment