సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సొంత బస్సులు వేయి వరకు తగ్గిపోనుండగా, అదే సమయంలో 1,334 అద్దె బస్సులు వచ్చి చేరబోతున్నాయి. అద్దె బస్సులు పెరిగే కొద్దీ నష్టాలు ఎక్కువవుతాయన్న నిపుణుల సూచనలు కాదని, సిబ్బంది జీతాల భారం, బస్సులపై పెట్టుబడి తగ్గించుకునే క్రమంలో అద్దె బస్సుల వైపు ఆర్టీసీ చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడున్న 2,100 అద్దె బస్సులకు అదనంగా మరో నెల రోజుల్లో 1,334 వచ్చి చేరబోతున్నాయి. దీంతో మొత్తం బస్సుల్లో ఇవి 35 శాతానికి చేరనున్నాయి.
హైదరాబాద్‌లో వేయి సొంత బస్సులను తగ్గించుకునే పని ఇప్పటికే ఆర్టీసీ ప్రారంభించింది. శనివారం నుంచి ఆ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ బస్సుల కండక్టర్లను పెరుగనున్న అద్దె బస్సులకు విని యోగించినా, డ్రైవర్లు మిగిలిపోతారు. ఇలా త్వరలో మొత్తం 5 వేల మంది సిబ్బంది అదనంగా మారనున్నారు. ప్రస్తుతం వేయి బస్సుల తొలగింపుతో 4 వేల మంది వరకు మిగిలిపోనున్నారు. వీరిని ఎక్కడెక్కడ నియమించాలన్న అంశంపై ఈడీలు, ఫైనాన్స్ అడ్వయిజర్‌తో కలసి ఓ కమిటీని ఎండీ సునీల్‌శర్మ ఏర్పాటు చేశారు.
17వ తేదీ వరకు నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే సరుకు రవాణా విభాగంలో అవసరమైన వారిని వినియోగించుకోవడం, తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్న సిబ్బంది స్థానంలో వీరిని వాడుకోవడం, చదువు అర్హత ఉన్న వారిని జూనియర్ అసిస్టెంట్లుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, టికెట్ చెకింగ్ సిబ్బందిగా విధులు వేయడం... పలు అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. సమ్మె సమయం లో ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సుల కోసం రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనికి సంబంధించి 1,334 అద్దె బస్సుల ను ఖరారు చేశారు. నోటిఫికేషన్ ఒప్పం దం ప్రకారం.. జనవరి 26 వరకు నిర్వాహకులకు గడువు ఉంది. అంటే ఈ బస్సులు దాదాపు నెల రోజుల్లో రోడ్డెక్కనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment