ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా షార్ట్‌ఫిల్మ్‌‌ ఖిల్లా | Short Films making in undivided Karimnagar District | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా షార్ట్‌ఫిల్మ్‌‌ ఖిల్లా

Published Mon, Jan 25 2021 9:34 AM | Last Updated on Mon, Jan 25 2021 9:51 AM

Short Films making in undivided Karimnagar District - Sakshi

టాలెంట్‌ ఎవడబ్బా సొత్తు కాదని ఓ సినీ కవి రాసిన పాటను ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కళాకారులు.. దర్శకనిర్మాతలు నిజం చేస్తున్నారు. సందేశాత్మక షార్ట్‌ ఫిల్మ్‌లు చిత్రీకరిస్తూ.. నటిస్తూ.. నిర్మిస్తూ సత్తాచాటుతున్నారు.. పల్లె పాటలు, గ్రామీణ జీవన విధానాలను బుల్లితెరపైకి ఎక్కిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. సామాజిక మాధ్యమమే వేదికగా     ప్రదర్శిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు..

విద్యానగర్ ‌(కరీంనగర్‌): నేడు సోషల్‌ మీడియాలో వీడియోలు.. షార్ట్‌ ఫిల్మ్‌లు ప్రపంచమంతా మారుమోగుతున్నాయి.. యువతను ఉర్రూతలూగిస్తున్నాయి.. వివిధ లోకేషన్లలో చిత్రీకరించిన లఘు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్‌ సిటీ కరీంనగర్‌ ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్‌ సిటీగా మారింది. కళలు, కళాకారులు, విన్నూత్న ఒరవడికి వేదిక అయిన ఉమ్మడి జిల్లా నేడు షార్ట్‌ ఫిల్మ్‌ల నిర్మాణాలతో ప్రత్యేకతను చాటుతోంది. డిజిటల్‌ కెమెరాలు అందుబాటులోకి రావడం షార్ట్‌ ఫిల్మ్‌ రంగంలో ఓ విప్లవాన్ని తీసుకువచ్చింది. ఔత్సాహికులకు వరంలా మారింది. తక్కువ టైమ్‌లో తక్కువ ఖర్చుతో తమ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం లభించింది. షార్ట్‌ ఫిల్మ్‌లను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు దోహదపడుతున్నాయి.

అవార్డులు..
జగిత్యాలకు చెందిన లక్ష్మీపతి ప్రభుత్వ డాక్యుమెంటరీలు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 13 నంది అవార్డులు గెలుచుకున్నారు. మేడిపల్లికి చెందిన నరేందర్‌రాజు నిర్మించిన ‘ఆశాదీపం’ లఘుచిత్రానికి నందిఅవార్డు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన వారాల ఆనంద్‌ ఇప్పటికి 5 లఘుచిత్రాలు నిర్మించారు. ఆయన నిర్మించిన ‘లాంగ్‌ బ్యాటిల్‌ విత్‌ షార్ట్‌ మెస్సేజెస్‌’ చిత్రానికి   అంతర్జాతీయ అవార్డు, శివపార్వతులు చిత్రానికి సౌత్‌ ఏషియన్‌ అవార్డు లభించగా ఆయన తనయుడు అన్విష్‌ పట్నం, పేరిణి చిత్రాలు తీశారు.

యూట్యూబ్‌ చానల్స్‌...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 పైచిలుకు యూట్యూబ్‌ చానల్స్‌ ఉండగా అందులో 100 వరకు రెగ్యులర్‌గా షార్ట్‌ ఫిల్మ్‌లు ఇప్పటికే అప్‌లోడ్‌ చేశారు. వాటిలో మన విలేజ్‌ సినిమా, సదన్న కామెడీ, మా తెలంగాణ ముచ్చట్లు, మన పల్లె ముచ్చట్లు, మా ఊరి ముచ్చట్లు, తెలంగాణ విలేజ్‌ థియేటర్, కరీంనగర్‌ కుర్రాడు, ఏఎస్‌ఆర్‌ క్రియేషన్స్, సత్తన్న మల్లన్న, మన పల్లె ఏ టు జెడ్, మా పల్లె సందడి, విలేజ్‌ పటాస్, ఎస్‌కే క్రియేషన్స్, ఫైవ్‌ స్టార్‌ చానల్, విరాట్‌ క్రియేషన్స్, తెలంగాణ కుర్రాడు, శ్రీను గ్రాఫిక్స్‌ సినిమా, మన సినిమా ముచ్చట్లు, ఎంబీఏ ప్రొడక్షన్స్, నా చిన్న సినిమా తదితర ఫిల్మ్‌లు ఉన్నాయి.

షార్ట్‌ ఫిల్మ్‌ బడ్జెట్‌..
షార్ట్‌ ఫిల్మ్‌ల నిర్మాణంలోనూ కష్టాలున్నాయి. ఒక్క లఘుచిత్రం నిర్మాణానికి రూ.15 నుంచి రూ.20వేల వరకు ఖర్చవుతోంది. ఒక్కరోజులో చిత్రం పూర్తవుతోంది. అడ్డంకులు వస్తే మరో రోజు పూర్తి చేస్తారు. కెమెరాకు రోజుకు రూ.1000– 1500, పేరున్న నటులకు రూ.1000– 3500 ఇవ్వాల్సి ఉంటుంది. లోకేషన్, ట్రావెలింగ్, భోజనాలు, తదితర వాటికి ఖర్చులుంటాయి.

ఆదాయం ఇలా..
తీసిన లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే, చూసిన ప్రేక్షకుల సంఖ్యను బట్టి యూట్యూబ్‌ వారు పేమెంట్‌ ఇస్తారు. లక్ష మంది వీక్షిస్తే 100 డాలర్లు వస్తాయి. మనం ప్రారంభించిన చానల్‌ను యూట్యూబ్‌ వారు గుర్తించాలంటే వెయ్యి మంది సబ్‌స్క్రైబ్‌ చేయాలి. అప్‌లోడ్‌ చేసిన చిత్రాన్ని 30రోజుల్లో లక్ష మంది వీక్షించాలి. అప్పుడే డబ్బులు వస్తాయి. 

సత్తా చాటుతున్న వారు

సందేశాత్మక దర్శకుడు
ఉమ్మడి జిల్లాలోని తోటపల్లికి చెందిన అనసూరి భూనాథచారి కరీంనగర్‌లో మోడ్రన్‌ యాక్టింగ్‌ స్కూల్‌ ఆఫ్‌ కరీంనగర్‌ పేరున  ఇనిస్టిట్యూట్‌ ప్రారంభించారు. సామాజిక రుగ్మతలపై షార్ట్‌ ఫిల్మ్‌ లు నిర్మిస్తున్నారు. ఆడపిల్లల మీద ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, వేధింపులు వంటి యదార్థ సంఘటనల ఆధారంగా 15కుపైగా సందేశాత్మక లఘుచిత్రాలను స్థానికులతో నిర్మించారు.

రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతులు..
బడుకోలు దేవేందర్‌రెడ్డిది చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. రెండేళ్ల కిత్రం ‘మన విలేజ్‌ సినిమా’ యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించారు. కథ, మాటలు రాసి లఘుచిత్రాలను నిర్మిస్తూ వాటిలో నటిస్తున్నారు. 65 లఘు చిత్రాలు నిర్మించగా, 71వేల సబ్‌స్క్రైవర్లు ఉన్నారు. 

కుర్రకారు గుండెల్లో అలజడి..
నటన, అందంతో చెంచల హరిత కుర్రాకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ 150కిపైగా షార్ట్‌ఫిలీంలలో హీరోయిన్‌గా, 200 లఘుచిత్రాల్లో సహనటిగా నటించింది. చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన ఆమెకు చిన్నప్పటి నుంచి నటన అంటే ప్రాణం. ఉమ్మడి రాష్ట్రంలో పలు రంగస్ధల ప్రదర్శనలిచ్చింది. అత్తపెత్తనం లఘుచిత్రానికి ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

ఎడిటర్, యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌..
గంగాధర మండలం కాసారాంకు చెందిన మోగిలోజి రామ్‌ ఎడిటర్, యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌. స్కూళ్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని నటుడిగా గుర్తింపు పొందారు. డిగ్రీ తర్వాత మల్టీమీడియా, యానిమేషన్‌లో శిక్షణ పొంది, యాడ్‌ ఫిల్మŠస్‌ ఎడిటర్‌గా వచ్చిన గుర్తింపుతో విరాట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘గుసగుస’ షార్ట్‌ ఫిల్మ్‌ తీశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో కలిసి పని చేశాడు. ఇప్పటి వరకు 400లకు పైగా లఘుచిత్రాలకు ఎడిటర్‌గా, 200లకు పైగా షార్ట్‌ ఫిల్మ్‌లకు డైరెక్టర్‌ పని చేశారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు చేశారు.

చిన్న సినిమాల పెద్ద నటి..
కరీంనగర్‌ మార్కండేయకాలనీకి చెందిన జి.రాధిక చిన్న సినిమాలకు పెద్ద నటి. భర్త ప్రోత్సాహంతో నటన రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 700 వరకు షార్ట్‌ఫిల్మŠస్‌తో పాటు మూడు సినిమాలు, ఇది మా కుటుంబం సీరియల్‌లో నటించారు.

షార్ట్‌ఫిల్మ్‌ నుంచి సినిమాకు.. 
నటనపై మక్కువ పెంచుకున్న గోదావరిఖనికి చెందిన ఏదుల స్వప్నకు దామెర శంకర్‌ షార్ట్‌ఫిల్మ్‌లో అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు 250 చిత్రాల్లో నటించింది. అన్నయ్య రాఖీ, గయ్యాళి గాయత్రి, అనుమానపు పెళ్లాం, వసుంధర, అత్తకు తగ్గ కోడలు, కొత్త జంట తదితర లఘుచిత్రాల్లో గుర్తింపు తెచ్చుకుంది. గల్లీగ్యాంగ్, పరేషాన్, బిచ్చగాడా మజాకా సినిమాల్లో నటించింది.

ఆర్‌ఎస్‌ నంద ప్రోత్సాహంతో..
దూడం శ్రీను ఆలియాస్‌ గ్రాఫిక్స్‌ శ్రీనుది కరీంనగర్‌ మండలం చామన్‌పల్లి గ్రామం. చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక. శ్రీనులోని నటనాసక్తిని గమనించిన ఆర్‌ఎస్‌ నంద ప్రోత్సాహించారు. ఆయన బ్యానర్‌లోనే ‘చిల్లరలొల్లి’ షార్ట్‌ ఫిల్మ్‌లో అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు 50 వరకు షార్ట్‌ఫిలీంలలో నటించారు. మన తెలంగాణ విలేజ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ పేరున చానల్‌ ప్రారంభించి 15 చిత్రాలను అప్‌లోడ్‌ చేశారు.

ఉత్తమ నిర్మాత..
వెంగల రాజ్‌కుమార్‌ ఏఆర్‌ఎస్‌ క్రియేషన్స్, మన పల్లె మాటలు యూట్యూబ్‌ చానల్‌పై 100కుపైగా షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించారు.  రచయితగా నేను సైతం ప్రీమియర్‌ అవార్డు అందుకున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి..
మహిళలకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని నిరూపిస్తున్న వ్యక్తి అనితరాజ్‌. చొప్పదండి గ్రామానికి చెందిన అనితరాజ్‌కు ఫొటోగ్రఫీ అంటే మక్కువ. ఏఆర్‌ఎస్‌ క్రియేషన్‌ యూట్యూబ్‌ చానల్‌ స్టోరీ రైటర్‌గా, డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా, కెమెరాఉమెన్‌గా ఇప్పటి వరకు 120కిపైగా షార్ట్‌ఫిల్మ్‌లు తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement