ఈ తరం గల్లీ కుర్రాడు
-
డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటున్న ఇంజనీర్
-
రాత్రంతా పార్ట్‌టైం జాబ్
-
ఉదయం టీకొట్టులో తండ్రికి సాయపడుతూ..
-
మధ్యాహ్నం పోటీ పరీక్షలకు శిక్షణ
-
షార్ట్ ఫిల్మ్‌లో హీరోగా అవకాశం
బీటెక్ పూర్తిచేసిన ఆ కుర్రాడి లైఫ్ సై్టల్ డిఫరెంట్. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు టీ కొట్టు నిర్వహిస్తున్న తండ్రికి సాయపడడం.. మధ్యాహ్నం 2 గంటల నుంచి పోటీ పరీక్షలకు కోచింగ్.. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌గా పార్ట్‌టైం జాబ్.. వీటితోపాటు డ్యాన్స్, షార్ట్ ఫిల్మ్ నటన.. ఇలా ఇరవై నాలుగు గంటల్లో ఏ క్షణాన్నీ వథా చేయడం లేదు. పేదరికమే తనకు లభించిన వరంగా దూసుకుపోతున్న ఈ గల్లీ కుర్రాడి గురించి ఈ తరం యువత తెలుసుకోవాల్సిందే.
సాక్షి, విశాఖపట్నం : అక్కయ్యపాలేనికి చెందిన నిద్దాన కళ్యాణŠ కుమార్ అందరి కుర్రాళ్లలాగే ఆడుతూ పాడుతూ గడపాలనుకోలేదు. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాన్ని చూసి చేదోడువాదోడుగా ఉండాలనుకునేవాడు. సీతమ్మధారలో టీకొట్టు నిర్వహిస్తున్న తండ్రి బంగారునాయుడికి సాయపడుతూ బీటెక్ పూర్తి చేశాడు. సాధారణంగా బీటెక్ విద్యార్థులంటే కొంచెం హైఫైగా ఉంటారు. కళ్యాణ్ మాత్రం అనవసర ఆర్భాటాలకు పోలేదు. ఉదయాన్నే టీకొట్టు దగ్గరకు వెళ్లి మధ్యాహ్నం వరకూ తండ్రికి సాయం చేస్తాడు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌గా పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. తండ్రికి అనారోగ్యంగా ఉంటే కళ్యాణ్ ఒక్కడే టీ బండిని చూసుకుంటుంటాడు. ఇటీవలే ఫస్ట్‌క్లాస్‌లో బీటెక్ పూర్తి చేసిన అతను మధ్యాహ్నం బ్యాంకుSటెస్ట్‌లకు శిక్షణ తీసుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తూనే తన అభిరుచులను వదులుకోకుండా డాన్స్ నేర్చుకున్నాడు. శుభకార్యాలు, పండుగల సమయంలో డాన్స్ చేయడంతోపాటు కొరియోగ్రఫీ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తన చిన్ననాటి స్నేహితులతో ‘ఒక్క నిమిషం’ అనే షార్ట్‌ఫిల్మ్ రూపొందిస్తున్నాడు. హీరోగా తానే నటిస్తుండగా, అతని చిన్ననాటి స్నేహితురాలు బి.రాజి హీరోయిన్‌గా చేస్తోంది. ప్రాణ స్నేహితుడైన జి.మధు ఈ షార్ట్‌ఫిల్మ్‌ని రచించి, దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ పనైనా ఎందుకు చేయలేకపోతున్నారని ఎవరైనా అడిగితే ఎక్కువ మంది చెప్పే కారణం తమకు సమయం సరిపోవడం లేదని. కానీ కళ్యాణ్ గురించి తెలిశాక మాటలో వాస్తవం లేదని అర్ధమవుతోంది.
ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు
చిన్నప్పటి నుంచీ మా అమ్మానాన్న పడుతున్న కష్టాలు చూశాను. వారికి అదనపు భారం కాకూడదనుకున్నాను. నాన్నే టీకొట్టు నడుపుతున్నపుడు నేను అక్కడ టీలు అందించడం నామోషీగా భావించలేదు. ఇప్పుడు కోచింగ్ కోసం డబ్బులు కావాలి కాబట్టి పార్ట్‌టైమ్ జాబ్ తప్పదు. ఇంత కష్టంలో నాకున్న ఒకే ఒక్క ఊరట నటన, డాన్స్. అందుకే వాటిని వదులు కోవడం లేదు. నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. –కళ్యాణ్ కుమార్
వాడి కోసమే డైరెక్టర్‌నయ్యా..
కళ్యాణ్ నా ప్రాణ స్నేహితుడు. నేను బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం షిప్‌యార్డ్‌లో సూపర్‌వైజర్‌గా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి కళ్యాణ్ పడుతున్న కష్టాలు చూస్తున్నాను. వాడికి నటన అంటే ఇష్టం. అందుకే వాడికోసం షార్ట్ పిల్మ్ తీయాలనుకున్నాను. కథ రాసి డైరెక్టర్‌గా మారాను. సమాజానికి సందేశమిచ్చే చిత్రాలు తీయాలనుకుంటున్నాం.
–మధు
స్నేహం కోసం ఒప్పుకున్నా..
చిన్నప్పటి నుంచి మా ముగ్గురం మంచి ఫ్రెండ్స్. పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం. తర్వాత కాలేజీలు వేరైనా రోజూ కలుస్తుండేవాళ్లం. మధు ఎప్పటి నుంచో ఓ స్టోరీ రాసి ఉంచుకున్నాడు. వాళ్లు షార్ట్‌ఫిల్మ్ తీయాలనుకున్నప్పుడు నన్ను హీరోయిన్‌గా చేయమని అడిగారు. మా మధ్య స్నేహం కొద్దీ ఒప్పుకున్నాను. నాక్కూడా నటనపై ఆసక్తి ఉండటంతో ఎటువంటి టెన్షన్ లేదు. –రాజి