తిరుపతి : సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ సాగిస్తున్న కృషి అనిర్వచనీయమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ.కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం జరిగే త్రైమాసిక మెట్లోత్సవాలను ఆదివారం సాయంత్రం ఉపముఖ్యమంత్రి జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి సత్రాల సముదాయంలో దాససాహిత్య భజన మండళ్లతో ఏర్పాటైన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
గ్రామ గ్రామాన యాగాలు, హోమాలు నిర్వహించి సనాతన హిందూ ధర్మాలను విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. తిరుమల శ్రీవారి మహిమలు అపారమైనవన్నారు. అందుకే కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భావించి విదేశాల్లో సైతం వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నారన్నారు. శేషాచల అడవుల్లో సిరులు కురిపించే అపారమైన ఎర్రచందనం చెట్లు ఉన్నాయని. ఇక్కడి ఎర్రచందనమే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పెట్టుబడిలో భాగస్వామి కాబోతోందన్నారు.
టీటీడీ జేఈవో పోలా భాస్కర్ ప్రసంగిస్తూ భగవంతుని చేరుకోవడానికి సులభమైన మార్గం నామసంకీర్తనమని అన్నారు. దాససాహిత్యం పుట్టుక కర్ణాటక రాష్ట్రమైనా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించిందన్నారు. ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ ఎడిటర్-ఇన్-చీఫ్ రవ్వా శ్రీహరి, తిరుమల ఆలయ డెప్యూటీ ఈవో చిన్నం గారి రమణ, దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి పీఆర్ ఆనందతీర్థాచార్య, టీటీడీ పీఆర్‌వో రవి పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలో భజనమండళ్ల శోభాయాత్ర సాగింది.
ధర్మప్రచారాన్ని విస్తృతం చేయాలి
Published Mon, Jul 28 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement