అరచేతిలో నీటి ప్రాజెక్టు! | water in the palm of the project! | Sakshi
Sakshi News home page

అరచేతిలో నీటి ప్రాజెక్టు!

Published Thu, Sep 4 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

అరచేతిలో నీటి ప్రాజెక్టు!

అరచేతిలో నీటి ప్రాజెక్టు!

  •  ఏడాదిలోగా హంద్రీ-నీవాను పూర్తి చేస్తామన్న మంత్రి దేవినేని ఉమ
  •  ఆ ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూ.1750 కోట్లు అవసరమంటున్న అధికారులు
  •  బడ్జెట్లో కేవలం రూ.100.28 కోట్లను మాత్రమే కేటాయించిన వైనం
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: అరచేతిలో వైకుంఠం చూపించ డం అంటే ఇదే..! హంద్రీ-నీవా ప్రాజెక్టుకు 2014-15 బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు. కానీ.. బడ్జెట్లో కేవలం రూ.100.28 కోట్లనే కేటాయించారు. ఆ నిధులు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడానికి.. తొలి దశ పనులు పూర్తిచేయడానికే సరిపోవు. కానీ.. భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం ఏడాదిలోగా హంద్రీ-నీవాను పూర్తిచేసి, ఆయకట్టుకు నీళ్లందిస్తామని మంగళవారం శాసనసభలో ప్రకటించడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి.
     
    దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయడమే లక్ష్యం గా దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి రూ.6,850 కోట్ల వ్యయంతో అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల జలాలను ఎత్తిపోసి.. 33 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చడంతోపాటు 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు.

    2004-05 నుంచి 2009-10 వరకూ బడ్జెట్లో నిధుల కేటాయింపులో హంద్రీ-నీవాకు వైఎస్ పెద్దపీట వేశారు. ఫలితంగా ఆ పథకం పనులు శరవేగంగా సాగాయి. హంద్రీ-నీవాకు ఇప్పటిదాకా రూ.5,100 కోట్లను ఖర్చు చేస్తే.. రూ.4,250 కోట్లను దివంగత వైఎస్ హయాం లోనే ఖర్చు చేయడం గమనార్హం. వైఎస్ హఠాన్మరణంతో ఆ ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుంది. హంద్రీ-నీవా తొలి దశ వైఎస్ హయాంలోనే పాక్షికంగా పూర్తయింది.

    2012 నుంచి ఇప్పటిదాకా హంద్రీ-నీవా ద్వారా కర్నూలు జిల్లా కృష్ణగిరి, పత్తికొండ.. అనంతపురం జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్లకు నీటిని తెస్తున్నారు. చిత్తూరు జిల్లా హంద్రీ-నీవా రెండో దశ కింద ఉంది. జిల్లాలో రెండో దశ కింద 11 లక్షల మందికి తాగునీరు, 1.40 లక్షల ఎకరాలకు హంద్రీ-నీవా కింద నీళ్లందించాలని నిర్ణయించారు. కిరణ్ హయాంలో నిధులు కేటాయించకపోవడం వల్ల రెండో దశ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ దుస్థితిపై మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు.

    ఇందుకు దేవినేని ఉమా స్పందిస్తూ.. ఏడాదిలోగా హంద్రీ-నీవాను పూర్తిచేసి 6.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. హంద్రీ-నీవాకు ఈ ఏడాది రూ.750 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తే ప్రభుత్వం కేవలం రూ.100.28 కోట్లు కేటాయించింది. ఇందులో బకాయిల రూపంలో రూ.45 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించాలని అధికారవర్గాలు స్పష్టీ కరిస్తున్నాయి. తక్కిన రూ.55 కోట్లతో తొలి దశలో నిలిచిపోయిన పనులను పూర్తిచేయడానికే సరిపోవని అధికారుంటున్నారు.

    ఈ నేపథ్యంలో రెండో దశ పనులకు నిధుల కొరత తప్పదన్నది స్పష్టం. ఇది మంత్రి దేవినేనికి కూడా తెలియంది కాదు. నిధుల కేటాయింపులో ఏమాత్రం పట్టించుకోని మంత్రి.. ఇప్పుడు హంద్రీ-నీవా ను ఏడాదిలోగా పూర్తిచేస్తామని ప్రకటించడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. ప్రభుత్వం నిధులను ఇదే రీతిలో కేటాయిస్తే మరో పదేళ్లకు కూడా హంద్రీ-నీవాను పూర్తిచేయలేమని నీటిపారుదలశాఖ అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement