మా నీళ్లు మాకే! | To Government MLA visvesvarareddi alert | Sakshi
Sakshi News home page

మా నీళ్లు మాకే!

Published Tue, Aug 4 2015 2:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

మా నీళ్లు మాకే! - Sakshi

మా నీళ్లు మాకే!

- ఎవరెవరో నీళ్లు తీసుకు పోతుంటే చూస్తూ ఊరుకోం
- ప్రభుత్వానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరిక
- ‘అనంత’పై చంద్రబాబు వక్రబుద్ధి - మాజీ ఎంపీ అనంత
- ఈ ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీరివ్వకపోతే తీవ్ర పరిణామాలు-గురునాథ
- నీళ్లివ్వకపోతే చలోఅసెంబ్లీ చేపట్టి భారీ ధర్నా చేస్తాం- సీపీఐ జగదీశ్
- రైతుసదస్సులో ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టిన ‘అనంత’ నేతలు
సాక్షిప్రతినిధి, అనంతపురం:
‘‘హంద్రీ-నీవా కోసం రైతులు పొలాలను త్యాగం చేశారు. ఆర్థికంగా నష్టపోయారు. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తయి కళ్లెదుట నీళ్లుపోతున్నా ఆయకట్టుకు ప్రభుత్వం నీరివ్వడం లేదు. కుప్పానికి తీసుకెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీ పనులు చేయొద్దని అధికారులను ఆదేశించారు. ఎవరెవరో నీళ్లు తీసుకుపోతుంటే  చూస్తే ఊరుకునేది లేదు. మా నీళ్లు మాకు ఇవ్వాల్సిందే! లేదంటే ప్రధాన కాలువను తెంచి ఆయకట్టు పారించుకుంటాం’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హంద్రీ-నీవా మొదటి విడత ఆయకట్టుకు నీరివ్వాలనే డిమాండ్‌తో విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన ఉరవకొండలోనీ వీరశైవ కళ్యాణమండపంలో సోమవారం సదస్సు నిర్వహించారు.

సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. ఆయకట్టుకు నీరు వచ్చేంత వరకూ సమష్టిగా పోరాడతామని చేతులు కలిపి ఐక్యత చాటారు. తర్వాత విశ్వ మాట్లాడారు. ‘‘అనంత’ వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. స్థిరమైన ఆయకట్టు ఉన్న హెచ్చెల్సీకి 32.5 టీఎంసీలు రావాల్సి ఉంటే 22 టీఎంసీలే వస్తున్నాయి. బీటీప్రాజెక్టుకు 4టీఎంసీలకు గాను 1.5 టీఎంసీలు...పీఏబీఆర్‌కు 10టీఎంసీలకు 4.5టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. దీంతో ఆయకట్టు గణనీయంగా తగ్గింది.

ఈక్రమంలో ‘అనంత’కు జీవనాడి అయిన హంద్రీ-నీవా మొదటి విడత పనులు 90శాతం పూర్తయ్యాయి. చంద్రబాబు సీఎం కాకముందే 2సార్లు జీడిపల్లికి నీళ్లొచ్చాయి. కేవలం డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేస్తే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో ఉరవకొండ నియోజకవర్గంలో 80వేల ఎకరాలకు నీరందుతుంది. కానీ కళ్లెదుట నీళ్లుపోతున్నా ప్రాజెక్టు కోసం భూమలు త్యాగం చేసిన రైతుల పొలాలకు నీళ్లందడం లేదు. కేవలం రూ.200కోట్లు ఖర్చు చేస్తే ఈ ఖరీఫ్‌కే ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. నెలకోసారి ప్రాజెక్టుపై చంద్రబాబు రివ్యూలు చేస్తున్నారు. నిద్ర చేస్తున్నారు. వైఎస్ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఎక్కడా నిద్ర చేయలేదు.

రైతులకు నీరివ్వాలని చిత్తశుద్ధి ఉంటే చాలు.. నిద్రపోవడం దేనికీ. ఇటీవల జీడిపల్లి సమీక్షలో ‘నీళ్లివ్వమని అడిగితే మా ప్రణాళికలు మాకున్నాయి. మీతో మాట్లాడాలంటే సభ్యత అడ్డొస్తోంది’ అని సీఎం అన్నారు. నీళ్ల అడగడం తప్పా? ఎమ్మెల్యేతో ఓ ముఖ్యమంత్రి ఇలాగానే మాట్లాడేది? డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీరిస్తామంటున్నారు. ఈ ఏడాది 20 టీఎంసీలు వస్తాయంటున్నారు. నీళ్లు ఇవ్వకపోతే జీడిపల్లి పంప్‌హస్‌ను ముట్టడిస్తాం. ధర్మపురి వద్ద నిద్ర చేస్తాం. ఆయకట్టు కమిటీలు వేసి ఉద్యమిస్తాం’’ అని విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 ఆ 13 టీఎంసీల
 
నీళ్లు ఏమయ్యాయి?
‘గతేడాది హంద్రీ-నీవా ద్వారా 16.9 టీఎంసీల నీరు వచ్చాయి. ఇందులో 13 టీఎంసీలు జిల్లాకు చేరాయి. వీటిని ఏం చేశారు? లెక్కలు చెప్పండి’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ‘హంద్రీ-నీవాను హెచ్చెల్సీకి అనుబంధ కాలువలా మార్చేలా ప్రభుత్వం వ్యవహిరిస్తోంది. చంద్రబాబు అదృష్టవంతుడు ప్రాజెక్టు పూర్తిగా నిర్మించాం. 5 ఏళ్లలో 5వేలకోట్లకుపైగా ఖర్చుచేశాం. 2012 ఫిబ్రవరి 18న నీళ్లు లిప్ట్ చేశాం. కేవలం డిస్ట్రిబ్యూటరీలు చేస్తే ఆయకట్టుకు నీళ్లివ్వొచ్చు.

కానీ చంద్రబాబు రూపాయి కూడా ఖర్చుపెట్టడం లేదు. ‘అనంత’పై వక్రబుద్ధిని చూపిస్తున్నారు. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ఇంత అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉండటం ఎందుకు సహ ంచాలి? పట్టిసీమ ద్వారా సీమకు నీళ్లిస్తాననడం బూటకం. పోతిరెడ్డిపాడు హెడ్‌రెడ్యులేటర్‌ను 44వేల క్యూసెక్కులకు పెంచేముందు కేసీకెనాల్ వాటాలో పది టీఎంసీలను ‘అనంత’కు మళ్లిస్తూ వైఎస్ జీవోజారీ చేశారు. ఇప్పుడు పట్టిసీమద్వారా రాయలసీమకు నీరిస్తామని ఎందుకు జీవో ఇవ్వరు? ఆగష్టు 15న పట్టిసీమకు నీళ్లిస్తామంటున్నారు. ఇప్పుడు సాగర్‌కు నీళ్లవసరం లేదు. కాబట్టి శ్రీశైలం నుంచి వెంటనే సీమకు నీళ్లివ్వాలి.’’ అని అన ంత డిమాండ్ చేశారు.
 
టీడీపీ ఎన్నికల వేళ హంద్రీ-నీవాను పూర్తిచేస్తామని మాటలు చెప్పడం మినహా తట్టెడు మట్టిని కూడా ఎత్తలేదని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. వైఎస్ పూర్తిచేసిన ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరివ్వలేని చేతకాని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో సంస్కారంగా మాట్లాడలేని సీఎం రైతులకు ఏం మేలు చేస్తారో ఆలోచించాలన్నారు. కుప్పంకు నీళ్లిచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే డిస్ట్రిబ్యూటరీ పూర్తి చేసి ముందు ‘అనంత’ ఆయకట్టుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
 
పుణ్యమంతా ఏమైంది ‘బాబూ’: గోదావరి పుష్కరాల పేరుతో 12రోజులు చంద్రబాబు నదిలో మునిగారు. కానీ ఆయన పుణ్యం అంతా ఎక్కడకి పోయిందో అర్థం కాలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ అన్నారు. ఇంతటి కరువు గత 18ఏళ్లలో ఎప్పుడూ లేదన్నారు. బతికేమార్గం లేక రైతులు వలసపోతున్నారని, ఆత్మహత్యలకూ తెగిస్తున్నారన్నారు. ఈ స్థితిలో చంద్రబాబు డిస్ట్రిబ్యూటరీ పనులు ఆపేయాలని ఆదేశించడం శోచనీయమన్నారు. 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించిన జిల్లాకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. రూ.200కోట్లు ఖర్చు చేస్తే పిల్లకాలువల నిర్మాణం పూర్తవుతుందని, ఇందులోనూ సీఎం వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. వానల్లేక అల్లాడుంటే చీఫ్‌విప్ కాాల్వ శ్రీనివాసులు హరిత విప్లవం అంటూ స్పీకర్ కోడెలతో మొక్కలు నాటిస్తున్నారని, ఇప్పుడు జల విప్లవం కావాలన్నారు. ఒక్కో మొక్కకు వంద రూపాయల చొప్పున డబ్బు వస్తుందని, ఇందులో అవినీతికి అవకాశం ఉంది కాబట్టే ఆ కార్యక్రమానికి పూనుకున్నాని ఆరోపించారు.  
 
చంద్రబాబు చర్యలతో ఇనుపుట్ సబ్సిడి, ఇన్సూరెన్స్ కోల్పోయామని ఈ పాపం చంద్రబాబుదే అన్నారు. హంద్రీ-నీవా ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వడంతో పాటు మంత్రాలయం వద్ద ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మించి ‘సీమ’కు నీరివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు శివన్న, సీపీఐ నేతలు మల్లికార్జున, రామకృష్ణ, వన్నూరు, వైఎస్సార్‌సీపీ నేతలు వీరన్న, కొర్రపాటి హుసేన్‌పీరా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement