ఘనపురం ఆయకట్ట కింద కళకళలాడుతున్న పొలాలు
పాపన్నపేట(మెదక్): మెతుకు సీమకు వరప్రసాదిని మంజీరా నది. కొల్చారం.. పాపన్నపేట మండలాల మధ్య 1905 లో నిర్మించిన ఘనపురం ఆనకట్ట 30వేల ఎకరాల పంటలకు ప్రాణం పోస్తోంది. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు లెక్క ప్రకారం యేటా 4 టీఎంసీల నీరు రావాలి. అయితే గతంలో హైదరాబాద్ వాసుల దాహార్తి కోసం సింగూరు నుంచే నీరు తీసుకెళ్లేవారు. కానీ కొంత కాలంగా సింగూరు నీటిని ప్రథమంగా స్థానిక అవసరాల కోసం వాడుతున్నారు. అయినప్పటకీ నాలుగేళ్ల క్రితం వరకు రైతులు ఆందోళన చేస్తేనే సాగు నీరు వచ్చేది. ఆ నీటి విడుదల కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం గొంతు విప్పేవారు. దీంతో సాగు నీటి విడుదల కోసం ప్రతి విడతకు ఒక జీఓ విడుదల చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితులు మారాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి.. మంత్రి హరీశ్‌రావు చిత్తశుద్ధి మేరకు ప్రతి యేటా అడకుండానే అవసరాలకు ఘనపురం ప్రాజెక్టు వాటా కనుగుణంగా సింగూరు నుంచి నీరు విడుదల అవుతోంది.
ప్రభుత్వ జీఓల కోసం మీన మేషాలు లెక్కించకుండానే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రబీ సీజన్‌లో ఘనపురం ప్రాజెక్టుకు 11 విడతలుగా ఇప్పటి వరకు 3.35 టీఎంసీల నీరు విడుదల చేశారు. దీంతో ఘనపురం ఆయకట్టు కింద ఒక్క గుంట ఎండకుండానే రబీ గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల సింగూరు ప్రాజెక్టు 29 టీఎంసీల గరిష్ట నిల్వ నీటి సామర్థ్యాన్ని చేరుకుంది. అనంతరం కురిసిన వర్షాల వల్ల వరద పోటెత్తడంతో మునుపెన్నడు లేని విధంగా 11 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేశారు. అనంతరం నవంబర్ నెలలో ఈయేడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 14 టీఎంసీల నీటిని వదిలారు. దీంతో నిజాంసాగర్ ఆనకట్ట కింద సైతం రబీ పంటలు డోకా లేదు. అలాగే శ్రీరాంసాగర్‌కు ప్రయోజనం కలిగింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 8.731 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ ఈఈ యేసురత్నం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment