కాళంగి నుంచి చెన్నైకి ‘గంగ’ | Kalangi away from the 'Ganga' | Sakshi
Sakshi News home page

కాళంగి నుంచి చెన్నైకి ‘గంగ’

Published Sun, Jan 4 2015 6:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Kalangi away from the 'Ganga'

తిరుపతి : తెలుగుగంగ జలాలను జిల్లాలోని ఉబ్బలమడుగు, కాళంగి రిజర్వాయర్ల ద్వారా మళ్లించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అన్ని అనుకున్నట్లు జరిగితే కొద్ది కాలంలో తెలుగుగంగ జలాలు జిల్లా అవసరాలకు వినియోగించి, తమిళనాడుకు అందించే విధంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ఆ రిజర్వాయర్‌కు జలకళ చేకూరనుంది. రూ.60 కోట్లతో తెలుగుగంగ నుంచి లింకు కెనాల్ ద్వారా నీటి ని మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. రిజర్వాయర్‌లో ఒక టీఎంసీ నీటిని నిలువ ఉంచి, కరువు కాలంలో రైతాంగానికి అందించాలనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా సుమారు 70 చెరువులను అనుసంధానించడానికి ఆస్కారం ఉంది.
 
ఆ ఒప్పందం ప్రకారం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచి ఏటా చెన్నై మహానగరానికి 8 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలనేది కాలువ నిర్మాణ సమయంలో ఇరు రాష్ట్రాలు  చేసుకున్న ఒప్పందం. అందుకు అనుగుణంగానే ఇప్పటివరకు జరుగుతోంది. అయితే కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల గంగ పరీవాహక ప్రాంత రైతులు పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. దీంతో చెన్నైకి అందిస్తున్న నీళ్లలో కొంతమేరకు వాడుకుంటున్న వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం గుర్రుగా ఉంది. దీంతో ఈ ప్రాంత ప్రయోజనాలు, తమిళనాడుతో ఉన్న ఒప్పందానికి ఏమాత్రం దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
 
కాళంగి రిజర్వాయర్‌తో అనుసంధానం


అందులో భాగంగానే జిల్లాలో వరదయ్యపాళెం వద్దనున్న ఉబ్బలమడుగు ప్రాజెక్టును, కేవీబీ పురం మండలంలోని కాళంగి రిజర్వాయర్‌తో అనుసంధానం చేయనున్నారు. గంగ నీటిని ఇక్కడి నుంచి చెన్నైకి మళ్లించాలనే ఆలోచనతో ఉన్నారు. ఉబ్బలమడుగు ప్రాజెక్టులో మూడు టీఎంసీలు, కాళంగి రిజర్వాయర్‌లో ఒక టీఎంసీ నీటిని నిలువ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముందు గా కాళంగి రిజర్వాయర్ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
 
రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంపు

తాజా ప్రతిపాదనల్లో భాగంగా కాళంగి రిజర్వాయర్ ఎత్తు పెంచి ఆ తరువాత స్ట్టోరేజీ రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు 60 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. కండలేరు నుంచి తెలుగుగంగకు  వచ్చే జలాలను కాటూరు గ్రామం వద్ద ఉన్న పదో మైలు నుంచి కొండ అంచున కెనాల్ తొవ్వి, అక్కడి నుంచి అంజూరు మీదుగా కాళంగి రిజర్వాయర్‌లో కలపాలనేది అధికారులు ప్రతిపాదన. అన్ని కాలాల్లోనూ ఒక టీఎంసీ నీళ్లు నిలువ ఉంచే విధంగా ఈ ప్రాజెక్టును తయారు చేస్తున్నారు.

ఈ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లోని 70 చెరువులను నింపుకుంటూ సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడుకండ్రిగ, వరద య్యపాళెం, సత్యవేడు వరకు ఈ నీటిని తీసుకెళ్లి తెలుగుగంగలోకి మళ్లించే విధంగా డిజైన్లు సిద్ధం అవుతున్నాయి. జిల్లాలో రైతాంగానికి అన్నికాలాల్లోనూ నీటి నిల్వలు ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement