కొందరికి ఓకే.. మరికొందరికి నాట్ ఓకే
కొందరికి ఓకే.. మరికొందరికి నాట్ ఓకే
Published Wed, Feb 8 2017 11:25 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
ఎకరాకు రూ.28 పరిహారం ఇప్పించేందుకు పెందుర్తి హామీ
మెత్తబడిన కొందరు రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు
ఎమ్మెల్యే పెందుర్తి సమక్షంలోనే అగ్రిమెంట్లు
భూములిచ్చేది లేదంటున్న చినకొండేపూడి రైతులు
పురుషోత్తపట్నం ఎత్తిపోతల భూసేకరణ వ్యవహారం
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు అంగీకార పత్రాలపై సంతకాలు చేస్తుండగా, మరికొందరు సందిగ్ధంలో ఉన్నారు. ప్రధానంగా చినకొండేపూడి రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. మరోపక్క భూసేకరణ బాధ్యతను అధికార పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తన భుజాలపై వేసుకున్నారు. స్వయంగా ఆయన దగ్గర ఉండి రైతులతో ఒప్పందాలు చేయిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన పురుషోత్తపట్నం రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఒప్పించి, ఎకరానికి రూ.28 లక్షల చొప్పున పరిహారంగా ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో చాలామంది రైతులు మెత్తబడ్డారు. అయితే ఆ రేటుకు కూడా తమ భూములు ఇవ్వడానికి చినకొండేపూడి రైతులు అంగీకరించడం లేదు. ఎమ్మెల్యే వెంకటేశ్ బుధవారం మధ్యాహ్నం పురుషోత్తపట్నం వచ్చి రాత్రి వరకూ ఉన్నారు. ఆయన సమక్షంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, వీఆర్వోలు రవీంద్ర, వసంత, అఖిల్, మురళీకృష్ణలు భూములు ఇచ్చేలా రైతులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించారు. పురుషోత్తపట్నం, రామచంద్రపురం రెవెన్యూ గ్రామాల్లో భూములు సేకరించాల్సిన రైతులు 150 మంది ఉండగా, సాయంత్రం 6.30 గంటలకు వారిలో 50 మంది సంతకాలు చేశారు. అలాగే వంగలపూడి రెవెన్యూ గ్రామంలో 4.73 ఎకరాలకు హక్కుదారులైన ఐదుగురు రైతులతో కూడా సంతకాలు చేయించినట్టు సమాచారం. చినకొండేపూడికి చెందిన ఇద్దరు రైతులు కూడా సంతకాలు చేశారు. వారిలో కొందరు రైతులు తమ భూములను కేవలం లీజ్‌కు ఇచ్చేలా మాత్రమే సంతకాలు చేశారు.
నేడు రైతుల నిరసన
పరిహారం ఎక్కువా, తక్కుగా అనే దానితో సంబంధం లేకుండా, పురుషోత్త పథకం ఎత్తిపోతల పథకానికి భూమలు ఇవ్వడానికి చినకొండేపూడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. అంతేగాకుండా ఈ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వారు పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం వారు నిరసన తెలిపి, వినతిపత్రం అందించారు.
Advertisement