పొలాల్లో ‘పైపుల’ బాంబు | State government planing over farmers lands again | Sakshi
Sakshi News home page

పొలాల్లో ‘పైపుల’ బాంబు

Published Thu, Apr 5 2018 3:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

State government planing over farmers lands again - Sakshi

సాక్షి, అమరావతి: అన్నదాతలపై రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టింది. జీవనాధారమైన భూమిపై రైతులకున్న హక్కును లాగేసుకోవడానికి సిద్ధమైంది. భూసేకరణ చట్టం–2013ను తుంగలో తొక్కుతూ మరో బిల్లు తీసుకొచ్చింది. సాగునీటి ఎత్తిపోతల పథకాలు, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కింద పైప్‌లైన్‌లు వేయడానికి అవసరమైన భూమిని సేకరించకూడదని నిర్ణయిం చింది. కేవలం ఆ భూమిపై రైతుల హక్కులను సొంతం చేసుకోవాలని ఎత్తుగడ వేసింది. ఇందుకోసం మార్కెట్‌ విలువలో కేవలం పది శాతం మాత్రమే రాయల్టీగా చెల్లించి భూమిపై రైతుల హక్కును సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నింది.

కలెక్టర్‌ ఇచ్చిందే పరిహారమని స్పష్టం చేసింది. దీనిపై కోర్టులకు వెళ్లే అవకాశం కూడా లేకుండా చేసింది. ఒకవేళ రైతుల భూముల్లో వేసిన పైప్‌లైన్లకు పొరపాటున నష్టం వాటిల్లితే సంబంధిత రైతులను మూడేళ్ల పాటు జైలుకు పంపాలంటూ నిబంధనలు తీసుకొ చ్చింది. ఈ మేరకు ‘ఆంధ్రప్రదేశ్‌ డొమెస్టిక్, ఇరిగేషన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ వాటర్‌ గ్రిడ్‌ పైప్‌లైన్స్‌ చట్టం–2018’ ముసాయిదాను మంగళవారం హడావుడిగా మంత్రులకు పంపించి ఆమోదముద్ర వేయించింది. శాసనసభ సంప్రదాయాలు, నియమావళిని కాలరాస్తూ బుధవారం ఈ బిల్లును అప్పటికప్పుడు సభలో ప్రవేశపెట్టి.. క్షణాల వ్యవధిలోనే ఆమోదముద్ర వేయించుకుంది. తద్వారా కర్షకుల నడ్డివిరిచింది.
రైతుల జీవితాలతో చెలగాటం..

రాష్ట్రంలో గోదావరి–పెన్నా అనుసంధానం, అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల, బీటీపీ ఎత్తిపోతల వంటి సాగునీటి పథకాలతో పాటు గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చడం కోసం రూ.22 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా పథకాల్లో భాగంగా పైప్‌లైన్‌లు వేయడానికి అవసరమైన భూమిని సేకరించకుండా.. భూమిపై రైతులకున్న హక్కులను మాత్రమే సొంతం చేసుకోవాలని నిర్ణయించింది. భూమికి ఉన్న మార్కెట్‌ విలువలో పది శాతం రాయల్టీగా చెల్లించడం ద్వారా రైతుల హక్కులను దక్కించుకోవాలని భావించింది. అంటే ఎకరం మార్కెట్‌ విలువ రూ.లక్ష ఉంటే.. రైతుకు రూ.పది వేలు మాత్రమే చెల్లించి, ఆ భూమిపై ఉన్న హక్కును లాగేసుకోవడమన్న మాట.

తద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని భావించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ డొమెస్టిక్, ఇరిగేషన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ వాటర్‌ గ్రిడ్‌ పైప్‌లైన్స్‌ చట్టం–2018 బిల్లు తీసుకొచ్చింది. సాగునీటి ఎత్తిపోతల పథకాలు, వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ ప్రకారం పైపులైన్‌ వెళ్లే మార్గంలో భూములను సంబంధిత రైతులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సర్వే చేసే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కట్టబెట్టింది. సర్వే పూర్తయిన తర్వాత భూమి హక్కును సొంతం చేసుకోవడం కోసం జిల్లా కలెక్టర్‌ నియమించే అధికారి నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఏవైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా నోటిఫికేషన్‌ జారీ చేసిన అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

పైప్‌లైన్‌లకు నష్టం కలిగితే మూడేళ్ల జైలు! 
రైతులకు భూమిపై ఉన్న హక్కులను సొంతం చేసుకోవడం కోసం మార్కెట్‌ విలువలో 10 శాతాన్ని కలెక్టర్‌ రాయల్టీగా నిర్ణయిస్తారు. ఈ రాయల్టీ సంతృప్తికరంగా లేకపోతే న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం కూడా లేకుండా ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది. అదే సమయంలో పైపులైన్‌కు ఏమాత్రం నష్టం వాటిల్లినా కూడా సంబంధిత రైతులను మూడేళ్ల పాటు జైలులో పెట్టడం లేదా భారీగా జరిమానా విధించి శిక్షించేలా నిబంధన తీసుకొచ్చింది. అలాగే కోర్టు విచారణలో ఉన్న వివాదాస్పద భూములకు సంబంధించిన రాయల్టీని సంబంధిత కోర్టుల్లోనే డిపాజిట్‌ చేసి.. వాటి హక్కులను కూడా సర్కార్‌ సొంతం చేసుకుంటుంది.

శాసనసభ సంపద్రాయాలు, నియమావళి అపహాస్యం..
మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించలేదు. అయినా కూడా ముసాయిదాను మంత్రులకు పంపి ఆగమేఘాలపై ఆమోదముద్ర వేయించారు. శాసనసభ నియమాలు, సంప్రదాయాల ప్రకారం బిల్లును ప్రవేశపెట్టే అంశాన్ని అజెండాలో చేర్చుతారు. అజెండా ప్రకారం అదే రోజున బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి, ప్రతులను సభ్యులందరికీ అందిస్తారు. ఆ మరుసటి రోజుగానీ లేదా రెండు, మూడు రోజుల తర్వాత గానీ బిల్లుపై చర్చ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏవైనా లోటుపాట్లు ఉంటే.. సభ్యులకు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ డొమెస్టిక్, ఇరిగేషన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ వాటర్‌ గ్రిడ్‌ పైప్‌లైన్స్‌ చట్టం–2018 బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అంశాన్ని బుధవారం అజెండాలో చేర్చలేదు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం హడావుడిగా బిల్లును సభలో ప్రవేశపెట్టి.. నిమిషాల వ్యవధిలోనే చర్చ నిర్వహించి ఆగమేఘాలపై ఆమోదముద్ర వేయించుకుంది. దీనిపై పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నుంచి విమర్శలు చెలరేగాయి. 

భూసేకరణ చట్టం–2013 ప్రకారమైతే..
ఇప్పటివరకూ సాగునీటి ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకాల పనుల్లో భాగంగా పైపులైన్‌లు వేసేందుకు అవసరమైన భూమిని.. ‘భూసేకరణ చట్టం–2013’ ప్రకారమే ప్రభుత్వం పరిహారం చెల్లించి సేకరించాల్సి వస్తోంది. ఈ చట్టం ప్రకారం మార్కెట్‌ విలువ కన్నా రెండున్నర రెట్లు అధికంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు భూమి సేకరించాల్సిన ప్రాంతంలో ఎకరం మార్కెట్‌ విలువ రూ.పది లక్షలుంటే.. రెండున్నరెట్లు అధికంగా అంటే రూ.35 లక్షలు పరిహారంగా చెల్లించాలి. అయితే దీనివల్ల ఆర్థిక భారం ఎక్కువ అవుతుందంటూ.. రైతుల నోళ్లు కొట్టేందుకు తాజా బిల్లు ద్వారా సర్కార్‌ కుట్ర పన్నింది.

చంద్రబాబు పైశాచికత్వానికి నిదర్శనం..
సీఎం చంద్రబాబుకు రైతులపై ఎంత కక్ష ఉందో ఈ బిల్లు ద్వారా అర్థమవుతోంది. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెడుతూ కమీషన్‌లు దుండుకోవడానికైతే ఖజానాలో నిధులు ఉంటాయా? రైతులకు పరిహారం ఇచ్చేటప్పుడు మాత్రం నిధులు ఉండవా.. ఇదెక్కడి న్యాయం? భూసేకరణ చట్టం–2013 ప్రకారం రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాల్సిందే. పైప్‌లైన్‌కు నష్టం వాటిల్లితే రైతులనే బాధ్యులను చేసి.. మూడేళ్లు జైల్లో పెడతామనడం చంద్రబాబు పైశాచికత్వానికి నిదర్శనం. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయి.
– వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే

రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌కు రైతుల బాధలు ఏం తెలుస్తాయి?
లక్షలాది ఎకరాలను కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతూ, కమీషన్‌లు వసూలు చేసుకుంటూ సీఎం చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాంటి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌కు రైతుల బాధలు ఎలా తెలుస్తాయి? అత్యంత కీలకమైన ఈ బిల్లును ప్రతిపక్షం లేనప్పుడు సభలో ప్రవేశపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకోవడాన్ని చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులతో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. ఈ బిల్లుపై న్యాయస్థానంలో పోరాటం చేస్తాం.
– రావుల వెంకయ్య, సీపీఐ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు

రైతులకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తాం..
కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పైపులైన్‌లు వేసుకున్న భూమికిగానూ అక్కడి ప్రభుత్వాలు 40 శాతం పరిహారం, పంట నష్టం చెల్లిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పది శాతాన్ని మాత్రమే రాయల్టీగా చెల్లించాలని నిర్ణయించడం దారుణం. పైప్‌లైన్‌ పగిలితే రైతులను జైళ్లలో పెడతారా? లోపభూయిష్టమైన ఈ బిల్లుపై న్యాయపోరాటం చేస్తాం. రైతులకు అన్యాయం చేస్తే చూస్తు ఊరుకోం. బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం.
– కేశవరావు, సీపీఎం నాయకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement