రియల్ ఆఫర్లు
నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. నేరుగా రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఎయిర్‌పోర్టు విస్తరణ, పారిశ్రామిక వాడల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం భూ సమీకరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 33 వేల ఎకరాల పైనే సమీకరించింది. కొందరు రైతులు రియల్ వ్యాపారుల ఆఫర్లే బాగున్నాయని అటువైపు మొగ్గు చూపుతున్నారు.
- రాజధాని ప్రాంతంలో ` కోల్పోతున్న
- రైతులతో అగ్రిమెంట్లు
- ప్రభుత్వ ప్యాకేజీ కంటే ఇవే బెటర్ అంటున్న అన్నదాతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను రాజధాని రైతులపై పడింది. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు ఏటా కొంత సొమ్ము పరిహారంగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భూములన్నీ చదునుచేసి ప్లాట్లుగా మార్చిన తరువాత రైతులకు ప్రభుత్వం ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. అప్పుడే ఆ సొమ్ము చెల్లిస్తారు. అయితే రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి ఇస్తున్న భూములను తమకు ఇచ్చేందుకు అగ్రిమెంట్లు చేస్తే ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చే పరిహారాన్ని ఒకేసారి ఇవ్వడంతో పాటు బహిరంగ మార్కెట్లో భూమి విలువను బట్టి పది శాతం నుంచి 20 శాతం అదనంగా సొమ్ము ఇచ్చేందుకు రైతులకు రియల్ వ్యాపారులు ఆఫర్లు ఇస్తున్నారు.
భూ బాధితులకు మంత్రి నారాయణ హామీ...
ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం ప్రభుత్వం 490 ఎకరాలు సమీకరించనుంది. మొత్తం 300 మంది రైతులు ఉన్నారు. 90 మంది ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. మిగిలిన వారు ఇవ్వాల్సి ఉంది. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇస్తే రాజధాని ప్యాకేజీ ప్రకారం రాజధాని నిర్మాణ ప్రాంతంలో స్థలాలు ఇస్తామని గన్నవరం విమానాశ్రయ భూ బాధితులకు మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి కేసర పల్లి, బుద్ధవరం, అజ్జంపూడి గ్రామాల నుంచి భూ సమీకరణ జరగనుంది. కేసరపల్లి పరిధిలోని భూములకు ఎకరాకు రూ.98 లక్షలు, బుద్ధవరం భూములకు ఎకరాకు రూ.56 లక్షలు, అజ్జంపూడి భూములకు ఎకరాకు రూ.47 లక్షలు మార్కెట్ విలువ ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విలువ ప్రకారం లెక్కకట్టి పరిహారం ఇస్తామని, లేదా రాజధాని ప్రాంతంలో స్థలం కావాలంటే ఇస్తామని ఉన్నతాధికారులు, మంత్రులు రైతులకు హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇస్తేనే ఇది సాధ్యమని అధికారులు, నేతలు రైతులకు చెప్పారు.
ఏడేళ్ల క్రితమే రిజిస్ట్రేషన్ల నిలిపివేత...
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు తీసుకోవాలనుకుంటున్న భూములను అమ్మకాలు జరిపేందుకు వీలులేదని ఏడేళ్ల క్రితం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో ఈ భూముల్లో రిజిస్ట్రేషన్లు జరగటం లేదు. ఎంతకాలం ఇలా ఉంటామనే ఆందోళన కూడా పలువురు రైతుల్లో ఉంది. అమ్ముకునేందుకు ప్రభుత్వం అడ్డుపడటం, పైగా వారు ఇచ్చే పరిహారం ఎప్పటికి అందుతుందో తెలియకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అగ్రిమెంట్లు చేసుకొని వారి నుంచి భూమి ఖరీదును ఒకేసారి తీసుకోవడం మంచిదనే ఆలోచనకు రైతులు వచ్చారు. ప్రభుత్వం ఇచ్చే దానికంటే భూమి విలువను బట్టి పది నుంచి 20 శాతం అదనంగా ఇచ్చేందుకు రియల్ వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయ భూ బాధితులు పలువురు రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. మరికొందరు ఆ ఆలోచనలో ఉన్నారు.
రాజధాని ప్రాంతంలోనూ... రాజధాని ప్రాంతంలో కూడా కొందరు రైతుల నుంచి రియల్ వ్యాపారులు ఇదే ప్యాకేజీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎకరా పొలానికి ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం, కమర్షియల్ ఏరియాలో 200 గజాల స్థలాన్ని ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. బహిరంగ మార్కెట్ విలువను రైతుకు ఇప్పుడే రియల్ వ్యాపారులు ఇస్తారు. రాజధాని ప్యాకేజీ కింద ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చే స్థలాన్ని రియల్టర్లకు ఇస్తున్నట్లు అగ్రిమెంట్లు ఇవ్వాలి. ఇందుకు కొందరు ఎమ్మెల్యేలు కూడా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడో వచ్చే డబ్బు కోసం, స్థలం కోసం ఎదురు చూసేకంటే ఇప్పుడు మార్కెట్ విలువ ఇస్తానంటున్నందున తీసుకోవడం మంచిదని కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడిలోని కొందరు రైతులకు ఎమ్మెల్యే వంశీ సూచించినట్లు సమాచారం.