సాక్షి, అమరావతి: పట్టణ, నగర ప్రాంతాల్లో భూములు, స్థలాలు, భవనాలు తదితర స్థిరాస్తులకు కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఖరారయ్యాయి. పట్టణాల పరిధిలోని స్థిరాస్తులకు జేసీల నేతృత్వంలోని మార్కెట్ విలువల సవరణ కమిటీలు రిజిస్ట్రేషన్ విలువలను హేతుబద్ధీకరించాయి. వాటిని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్(కార్డ్) వెబ్‌సైట్‌లో పెట్టారు. సోమవారం నుంచి అమల్లోకొస్తాయి.
► కట్టడాలకు సంబంధించి పురపాలక సంస్థలు/నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలను ఒక కేటగిరిగా, మేజర్ గ్రామ పంచాయతీలను మరో కేటగిరిగా, మైనర్ గ్రామ పంచాయతీలను మరో విభాగంగా వర్గీకరించారు. చదరపు అడుగు ప్రాతిపదికన పక్కా ఇళ్లు, పెంకుటిళ్లు, రేకుల షెడ్డు తదితరాలకు వేర్వేరుగా ధరలు నిర్ణయించారు.
► వ్యవసాయ భూములకు ఎకరా, నివాస స్థలాలకు చదరపు గజం ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ విలువలను నిర్ధారించారు.
► స్థలాలు, భూములను ఎవరైనా కొనుగోలు చేసి తమ పేరుతో కొనుగోలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మార్కెట్ విలువపై 5 శాతం స్టాంపు డ్యూటీ, ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, ఒకటిన్నర శాతం బదిలీ సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
► రక్త సంబంధీకులు బహుమతి కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. ఆస్తి విలువలో రెండు శాతం స్టాంపు డ్యూటీ రూ.1,000 నుంచి రూ.10,000 వరకూ ఫీజు, బదిలీ సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
► కుటుంబ సభ్యుల మధ్య సెటిల్‌మెంట్ రిజిస్ట్రేషన్ అయితే.. ఆస్తి విలువలో రెండు శాతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. దీనికి బదిలీ సుంకం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment