రాజధాని ప్రాంతంలోని నేలపాడులో రైతులకు కేటాయించిన లేఅవుట్లలో మొలిచిన పిచ్చి మొక్కలు హ్యాపీ నెస్ట్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన బ్రోచర్
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన రైతులను అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుం డడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మూడున్న రేళ్ల క్రితం భూములు తీసుకునేటప్పుడు రైతులకిచ్చిన హామీలను గాలికి వదిలేసి ఇప్పుడు వారి భూముల్లోనే అపార్ట్‌మెంట్లు నిర్మించి అమ్ముకోవడం ఏమిటనే ప్రశ్నలకు సర్కారు నుంచి సమాధానం కరువైంది. తమకిచ్చిన ప్లాట్ల లేఅవుట్లలో పిచ్చిమొక్కలు మొలిపించి వాటిని బీళ్లుగా మార్చిన ప్రభుత్వం, వాటి పక్కనే అపార్ట్‌మెంట్లు నిర్మించి వేరే వాళ్లకి విక్రయించడం ఎంతవరకూ సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో హ్యాపీనెస్ట్ పేరుతో సీఆర్‌డీఏ.. 14.46 ఎకరాల్లో 12 అపార్టుమెంట్లు నిర్మిస్తామని ప్రకటించి ఫ్లాట్ల అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. పరిపాలనా నగరం సమీపంలో 19 అంతస్తుల్లో నిర్మించే ఈ అపార్ట్‌మెంట్లలో మొత్తం 1,200 ఫ్లాట్లు విక్రయించాలని నిర్ణయించి తొలిదశలో గత వారం ఆన్‌లైన్‌లో 300 ఫ్లాట్లను అమ్మేసింది. మలిదశలో మరికొన్నింటిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఏర్పాట్లుచేస్తోంది. వీటి నిర్మాణాన్ని నెల రోజుల్లో చేపడతామని సీఆర్‌డీఏ కమిషనర్ ప్రకటించారు. 1,225 చదరపు అడుగుల నుంచి 2,750 చదరపు అడుగుల వరకూ రకరకాల కేటగిరీల్లో డబుల్, త్రిబుల్ బెడ్‌రూమ్ ప్లాట్లను చదరపు అడుగు రూ.3,492కు విక్రయిస్తోంది. ఈ అమ్మకాలు, బుకింగ్‌లు, సమాచారం కోసం ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ కంపెనీల తరహాలో పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వడంతోపాటు ఆకర్షణీయంగా బ్రోచర్లు ముద్రించింది. 1,200 ఫ్లాట్లు అంటున్నా డిమాండ్‌ను బట్టి వీటిని పెంచుకుంటూ వెళ్లాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించడం గమనార్హం.
మూడేళ్లలో రైతులకిస్తామన్న ప్లాట్లేవి?
వాస్తవానికి భూములిచ్చిన రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ, రైతులు భూములిచ్చి మూడున్నరేళ్లయినా వాటిని అభివృద్ధి చేసే పనులే ఇంకా మొదలుకాలేదు. అలాగే, 29 గ్రామాల్లో రైతుల వాటాగా ఇవ్వాల్సిన ప్లాట్ల లేఅవుట్లను 13 జోన్లుగా విభజించి వాటిలో సకల సౌకర్యాలు కల్పిస్తామని సీఆర్‌డీఏ ప్రకటించింది. ఆ పనులూ మొదలు కాలేదు. దీంతో లేఅవుట్లన్నీ బీళ్లుగా మారాయి.
రైతుల చేతికి ఇంకా ప్లాట్లే రాలేదు
కాగా, మ్యాపులు, కాగితాల్లోనే రైతుల ప్లాట్లను చూపిస్తున్న సీఆర్డీఏ ఇప్పటివరకు రైతుల చేతికి భౌతికంగా అప్పగించలేదు. అందరికీ వారి వాటా ప్రకారం ప్లాట్లు ఇచ్చేసినట్లు మాత్రం ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. దీంతో ప్రభుత్వంపై అనుమానంతో ఇప్పటివరకూ 80 శాతం మంది తమ భూములను సీఆర్‌డీఏకు రిజిస్టర్ చేయలేదు. దీనిపైనా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ నేరుగా అపార్టుమెంట్లు నిర్మించి ఫ్లాట్లు అమ్ముతుండడంతో పిచ్చిమొక్కలు మొలిచిన తమ ప్లాట్లు ఎవరు కొంటారని, కొన్నా రేటు ఎలా వస్తుందని రైతులు వాపోతున్నారు.
మా భూములతో వ్యాపారం చేస్తారా?
భూములిచ్చిన రైతులను కోటీశ్వరుల్ని చేస్తామన్నారు.. మా భూమి రూ.5 కోట్లు పలుకుతుందన్నారు.. మూడేళ్లలో ప్రపంచ ప్రమాణాలతో ప్లాటు తిరిగిస్తామన్నారు.. ఒక్కటైనా చేశారా? కానీ, మేమిచ్చిన భూములతో వ్యాపారం చేసుకుంటారా? మా ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చాకే మీరు ఏమైనా చేసుకోండి.
– బత్తుల కిశోర్, రైతు, తుళ్లూరు
మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు
రాజధాని కోసం భూములు తీసుకునేటప్పుడు ఇచ్చిన హామీలు ఏవీ అమలుకాలేదు. మా భూములను కార్పొరేట్ వాళ్లకు తక్కువ రేటు ఇచ్చేస్తున్నారు. వాటిలో అపార్టుమెంట్లు కట్టి అమ్ముతున్నారు. ఇది న్యాయమా?
– పోలు రమేష్, రైతు, అనంతవరం
Comments
Please login to add a commentAdd a comment