![Department of Agriculture Cooperation issued internal orders - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/25/DCCB-BANK11.jpg.webp?itok=DPX7WLXM)
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాలను పొడిగిస్తూ ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల ప్రకారం వాటి ప్రస్తుత పాలకవర్గాలకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో వాటిని రద్దు చేయాలని సిఫార్సు చేసిన సహకార శాఖనే, చివరకు రాజకీయ ఒత్తిళ్లతో పొడిగింపు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సహకార సంఘాల కాలపరిమితి ఈనెల 3తో, డీసీసీబీల కాలపరిమితి ఈనెల 17తో ముగిసింది.
సహకార ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయడంతో వాటన్నింటికీ పర్సన్ ఇన్‌చార్జులను నియమించాల్సి వచ్చింది. అధికారులను కాకుండా ఆయా పాలకవర్గాలకే పర్సన్ ఇన్‌చార్జ్ బాధ్యతలుఇచ్చి ఆరు నెలలపాటు పొడిగింపు ఇచ్చారు. ఇక ఖమ్మం, నల్లగొండ పాలకవర్గాలపై అవినీతి అక్రమాలు బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను తదుపరి కొనసాగించకూడదని సహకారశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా జిల్లాల నుంచి మంత్రుల స్థాయిలో తీవ్ర ఒత్తిడి రావడంతో అధికారులు వెనకడుగు వేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షులను, డైరెక్టర్లనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఖమ్మంలో ఆసుపత్రి నిర్మాణంపై ఆరోపణలు...
రైతులకు రుణాలు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమ నిధి పేరుతో రైతులకిచ్చే పంటరుణాల నుంచి వసూళ్లకు పాల్పడిందని గతంలో జరిపిన విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. రూ.8.11 కోట్లు వసూలుచేసి ఆస్పత్రి నిర్మించింది. అంతేగాక రైతు సంక్షేమ నిధి పేరిట పెద్ద ఎత్తున నిధులను ఆసుపత్రికి వెచ్చిస్తూ, వాహనాల కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా చెబుతున్నారు.
వసూలుచేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చుపెడుతున్నట్లు పాలకవర్గం ఇచ్చిన వివరణ రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్ స్పష్టంచేసింది. గతంలో వసూలు చేసిన నిధులు అయిపోతుండటంతో మళ్లీ వసూళ్లకు పాల్పడుతుండటంపై భారీగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలోనే ఖమ్మం డీసీసీబీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఒక సహకార బ్యాంకు బ్రాంచిని తెరిచి రైతుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఖమ్మం డీసీసీబీ పాలకవర్గం అవకతవకలకు పాల్పడుతుందని, దాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి సహకార శాఖ సిఫార్సు చేసినా, చివరకు అదే పాలకవర్గానికి పర్సన్ ఇన్‌చార్జులుగా పొడిగింపు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment