నీరుండీ వాడుకోలేని దుస్థితి! | ys jagan mohan reddy review with irrigation officials | Sakshi
Sakshi News home page

నీరుండీ వాడుకోలేని దుస్థితి!

Published Sat, Feb 14 2015 3:18 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan mohan reddy review with irrigation officials

  • ప్రభుత్వం చొరవ చూపితే మెట్ట ప్రాంతానికి కరువు నుంచి విముక్తి
  • ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష
  • వైఎస్ హయాంలోనే గాలేరు-నగరి సుజల స్రవంతికి రూ.4,200 కోట్లు,హంద్రీ-నీవా సుజల స్రవంతికి రూ.6,700 కోట్ల వ్యయం
  • రూ.1,900 కోట్లు, రూ.1,700 కోట్లు వెచ్చిస్తే ఈ రెండూ పూర్తి.. ఆరు జిల్లాలకు మేలని వెల్లడి
  • సాక్షి ప్రతినిధి, కడప: ‘కృష్ణా, గోదావరి నదులు మూడు నెలలు ఉప్పొంగి ప్రవహిస్తాయి.. ఆ వరద నీటిని సద్వినియోగం చేసుకుంటే మెట్ట ప్రాంతంలో తిష్టవేసే కరువుకు విముక్తి కల్గించవచ్చు.. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పూర్తిచేస్తే ఆరు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి.. నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా సకాలంలో స్పందించలేకపోతున్నాం.. సగానికి సగం నీటిలాస్ ఉంటున్నా అరికట్టలేకున్నాం.. తక్షణమే స్పందించండి.. ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు వివరించండి.. ప్రజాపక్షంగా అందరం ప్రాజెక్టుల సాధనకు కృషి చేద్దాం..’ అని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప స్టేట్ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఆయన జిల్లా ప్రాజెక్టులపై ఇరిగేషన్,ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

    ప్రాజెక్టుల వారీగా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడితే మనుగడలోకి రాగలవనే వివరాలు తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట ప్రాజెక్టు వరకు నీరు వచ్చేందుకు ఉన్న అడ్డంకుల గురించి అధికారులు వివరించారు. వరదలను దృష్టిలో ఉంచుకుని మూడు నెలల్లో లభించనున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సత్వర చర్యలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచాలని వైఎస్ జగన్ సూచించారు. అధికారులుగా మీ స్థాయిలో మీరు కృషిచేయండి, ప్రభుత్వంపై మా పోరాటం ద్వారా ఒత్తిడి తెస్తాం.. అని ఆయన చెప్పారు.
     
    ఆ ప్రాజెక్టులు వరప్రసాదం


    మెట్టప్రాంతాలకు గాలేరి-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్), హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పథకాలు వరప్రసాదమని, వాటిని సత్వరమే పూర్తిచేస్తే ఆరు జిల్లాల్లో మెట్టభూములు సస్యశ్యామలం అవుతాయని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో రూ.6,700 కోట్లు, జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో రూ.4200 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఇంకా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో రూ.1,700 కోట్లు, జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో రూ.1,900 కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు.

    ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో రూ.3,600 కోట్లు ఖర్చు చేయగలిగితే ఆరు జిల్లాల్లో సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది ఉండదని వివరించారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 3.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. పోతిరెడ్డిపాడు-బనకచర్ల, బనకచర్ల- గోరుకల్లు, గోరుకల్లు-అవుకు, అవుకు-గండికోట రిజర్వాయర్ల వరకు మధ్యలో అసంపూర్తి పనులు పూర్తి చేయగలిగితే సునాయాసంగా 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు లభిస్తుందని చెప్పారు. రూ.185 కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు మనుగడలోకి వస్తాయని అధికారులు తెలిపారు.
     
    రూ.150 కోట్లు వెచ్చిస్తే 26 టీఎంసీల నీరు నిల్వ

    గండికోట ప్రాజెక్టు పూర్తయింది.. పునరావా సం, అభివృద్ధి (ఆర్‌అండ్‌ఆర్) ప్యాకేజీ పెం డింగ్‌లో ఉంది. కేవలం రూ.150 కోట్లు కేటాయిస్తే ఏకకాలంలో 26 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆమాత్రం చొరవ కూడా చూపకపోవడం విచారకరం.. అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ సెటిల్ కాకపోవడం వల్ల ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేయలేదన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రహ్మంసాగర్ పరిధిలో మరో రూ.54 కోట్లు కేటాయిస్తే లైనింగ్ పనులు కూడా పూర్తవుతాయని అధికారులు వివరించారు.
     
    నీరున్నా తెచ్చుకోవడంలో విఫలం


    సకాలంలో స్పందించి వృథాగా పోయే కృష్ణా, గోదావరి జలాలను తెచ్చుకోగలిగితే జిల్లాలో బ్రహ్మంసాగర్, గండికోట రిజర్వాయర్లలో నీరు నిల్వ చేసుకోవచ్చు.. తద్వారా భూగర్భజలాలు పెరిగి తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది.. అని జగన్ చెప్పారు. పెపైచ్చు డ్రా చేసిన నీటిలో 50 శాతం లాస్ అవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. చిత్రావతి 10 టీఎంసీల నీటికిగాను 4 టీఎంసీల నీరు డ్రా చేస్తే కేవలం 2 టీఎంసీలే ప్రాజెక్టుకు చేరిందని చెప్పారు. ఆ నీటి నుంచే కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల మున్సిపాలిటీలకు తాగునీరు ఇవ్వాల్సి ఉందన్నారు. వేసవి ప్రారంభమైనా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీరందలేదని తెలిపారు. బ్రహ్మం సాగర్‌కు 6.7 టీఎంసీల నీరు డ్రా చేస్తే కేవలం 4 టీఎంసీలే రిజర్వాయర్‌కు చేరిందన్నారు. మెయిన్ కెనాల్స్ ఇంతటి అధ్వానంగా ఉంటే పూర్తిస్థాయి నీరు ఎలా డ్రా చేయగలరని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజాపోరాటం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో మైనర్, మీడియం ఇరిగేషన్ పరిధిలో 1.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఒక్క ఎకరాకు నీరు ఇచ్చిన పాపాన పోలేద ని విమర్శించారు.
     
    మున్సిపాలిటీల ఆదాయం విద్యుత్ బిల్లులకే..

    మున్సిపాలిటీల ఆదాయం విద్యుత్ బిల్లులకే సరిపోతోందని, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని జగన్ ప్రశ్నించారు. పులివెందుల మున్సిపాలిటీలో రూ.5 కోట్ల ఆదాయం ఉంటే రూ.2.5 కోట్లు విద్యుత్ బిల్లులకు చెల్లిస్తున్నారన్నారు. కడప కార్పొరేషన్‌లో ప్రతినెలా రూ.32 కోట్ల ఆదాయం ఉంటే దాదాపు రూ.20 కోట్లు విద్యుత్ బిల్లులకే పోతోందన్నారు. పంచాయతీల్లో తాగునీటి పథకాలదీ అదే పరిస్థితన్నారు. వైఎస్ హయాంలో తాగునీటి పథకాలకు ప్రభుత్వమే బకాయిలు చెల్లించేదని, స్థానిక సంస్థలకు భారం ఉండేదికాదన్నారు. జెడ్పీ తాగునీటి పథకాలకు రూ.10 కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తోందని, అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

    ఎంపీ ఫండ్స్ రూ.5 కోట్లు తాగునీటికే ఖర్చు చేస్తున్నా సమస్య తీరలేదని, ప్రభుత్వం నుంచీ తగిన నిధులు రావడం లేదన్నారు. నీటి ట్రాన్స్‌పోర్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడమే నిదర్శనమన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులతోపాటు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే లు రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బి అంజాద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు తిరుపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కడప డిప్యూటీ మేయర్ అరీఫుల్లా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement