హంద్రీ-నీవాకు ప్రాధాన్యంప్రశ్నార్థకమే!
- అనధికారికంగా ప్రాజెక్టు గడువు పెంచుతున్న ప్రభుత్వం
- 2012కే పూర్తి కావాల్సింది..2015 నాటికి గడువుపెంపు?
- ఉపకాలువల పనులు చేపట్టని కాంట్రాక్టర్లు
బి.కొత్తకోట: హంద్రీ-నీవా సుజలస్రవంతి సాగు, తాగునీటి ప్రాజెక్టు పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ప్రాధాన్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఈ ప్రాజెక్టును ఎత్తివేసి రూ.755కోట్లతో 5టీఎంసీలతో తాగునీటి పథకంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. రాయలసీమ వరప్రసాదిని అయిన ఈ ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి రెండుదశల్లో చేపట్టి పనులు ప్రారంభించారు.
ఆయన హయాంలో 2005లో ప్రారంభమైన పనులను 2012నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యం నిర్దేశించారు. దీనికి తగినంత నిధులిచ్చారు. శరవేగంగా పనులు జరిగాయి. ఆయన మరణానంతరం పనుల్లో జాప్యంతో, ప్రాజెక్టు గడువును 2013 డిసెంబర్‌కు పెంచారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పనులు పూర్తిచేసేందుకు గడువును 2015 డిసెంబర్‌కు పెంచే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో పనుల వేగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపే పరిస్థితులున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల పూర్తికి కనీస ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించకపోయినా.. ఆ దిశగా అడుగులు కనిపించడంలేదు.
రెండో దశకు రూ.3,729కోట్ల ఖర్చు
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సాగే రెండోదశతో రూ.4,076 కోట్లతో 4.70లక్షల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు నిర్ణయించారు. ఇందులో ఇంతవరకూ పనులకోసం రూ.2,892 కోట్లు ఖర్చుచేశారు. ఇదికాక జాతీయ రహదారుపై బ్రిడ్జిల నిర్మాణం, భూసేకరణ, విద్యుత్‌కోసం ట్రాన్స్‌కోకు, అటవీశాఖకు డిపాజిట్ చేసిన నిధులతో కలుపుకుని రూ.3,729.52 కోట్లు వ్యయం చేశారు. ఇంకా రూ.1,184 కోట్ల పనులు పూర్తి చేయాల్సివుంది.
గడువు పెంచడమే?
రెండోదశ ప్రాజెక్టు పనులను 2012 డిసెంబర్‌కు పూర్తిచేయాలనీ వైఎస్.రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఆయన తర్వాత 2013 డిసెంబర్‌కు పెంచారు. ఇప్పుడు మళ్లీ 2015 డిసెంబర్ నాటికి పెంచుతున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనప్పటికీ చేపట్టిన పనులను 2015కు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు గడువు పెంచినట్టు అధికారులు చెబుతున్నారు. అవసరమైన నిధులు కేటాయించకపోతే పనుల్లో వేగం ఉండదు. ఇంతకంటే ఎక్కువ జాప్యం జరుగుతుంది. దీనివల్లే గడువుపెంచితే నిధుల కేటాయింపు సమస్య ఉండదని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. కాగా రెండు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఆగిపోయిన పనులు ప్రారంభం కావాల్సివుంది. ఎత్తిపోతల పథకాల పనులు సాగుతుండగా, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు ఇంకా మొదలుకానే లేదు. ప్రధానంగా గత ఆర్థిక సంవత్సరంలో రెండోదశ పనులు పూర్తిగా పడకేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుపూర్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందా లేదా అన్నది బడ్జెట్ కేటాయింపుల్లో తేలిపోనుంది.
ఉపకాలువల ఊసేలేదు
ప్రాజెక్టులో భాగమైన ఉపకాలువల పనులు ఇంతవరకూ పూర్తిస్థాయిలో చేపట్టలేదు. కొన్ని ప్యాకేజీల్లో మాత్రమే ఈ పనులు చేపట్టారు. కాలువల పనులకు ఎకరాకు రూ.4,700తో కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం రూ.10,500కు పెంచాలని కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఎకరాకు రూ.5,800 పెంచే నిర్ణయం గతప్రభుత్వం తీసుకోకపోవడంతో ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. దీంతో పనులు ప్రారంభంకాలేదు. దీనికి అవసరమైన భూసేకరణ చర్యల్లోనూ జాప్యం జరుగుతూ వస్తోంది.
కోరేదొకటీ.. ఇచ్చేదొకటీ..
వైఎస్ హయాంలో కేటాయింపులు వెయ్యికోట్లు దాటింది. ఆయన తర్వాత 2010-11లో రూ.640కోట్లు కేటాయించారు. 2011-12లో రూ.1,764 కోట్లు కోరితే రూ.695 కోట్లు ఇచ్చారు. 2012-13లో రూ.1,637 కోట్లడిగితే రూ.698, 2013-14లో రూ.1,251కోట్లు కావాలని కోరితే రూ.416కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టుకు ప్రాణంపోసిన వైఎస్ హయాంలో నిధులు భారీగా ఇచ్చారు. 2007-08లో రూ.925కోట్లు, 2008-09లో రూ.1,165కోట్లు, 2009-10లో రూ.1,000కోట్ల నిధులిచ్చారు. వీటిలో ప్రారంభంలో తొలిదశకు అధిక నిధులు ఖర్చుచేయడంతో 90 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15కు రెండోదశకు రూ.750కోట్లు కలుపుకుని మొత్తం ప్రాజెక్టుకు రూ.900.80కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఎంత నిధులు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. నిధుల కేటాయింపును బట్టి పనుల వేగవంతం ఆధారపడివుంది.
కమిటీ గడువిచ్చింది
రెండోదశ పనులకు ప్రాజెక్టుల రాష్ట్ర కమిటీ గడువు ఇచ్చింది. 2015 డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేసేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కోసం గడువు పెంచలేదు. దీనిపై ఆదేశాలు కూడాలేవు. ప్రస్తుతం పనుల్లో వేగం పెంచడం కోసం చర్యలు తీసుకుంటున్నాం.
-పీ.కృష్ణ, ప్రాజెక్టు ఎస్‌ఈ, మదనపల్లె