సాక్షి, అమరావతి: మెగా సీడ్ పార్క్ అంటూ చంద్రబాబునాయుడు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర అధికారంలో ఉన్నా ప్రాజెక్టుకు పైసా కూడా విదల్చలేదు. ఆయన వేసిన వేల శంకుస్థాపన శిలాఫలకాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోయింది. అయినా ఏనాడూ నోరుమెదపని రామోజీరావు ఈ పార్కును జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విషప్రచారానికి ఒడిగట్టారు. ఓ అబద్ధాల కథనాన్ని ఈనాడు అచ్చేసింది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్న చేయి పట్టుకొని నడిపిస్తున్న ప్రభుత్వంపై బురదజల్లుతూ ఈ కథనం వండివార్చింది. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.
సాధారణంగా పంటల సాగు కోసం బ్రీడర్ సీడ్ నుంచి ఉత్పత్తి చేసిన ఫౌండేషన్ సీడ్‌ను రైతులకు ఇచ్చి వారి ద్వారా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా విత్తనోత్పత్తి చేస్తుంటారు. ఇలా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తికి రాష్ట్రంలో తొమ్మిది సీడ్ ఫామ్స్ ఉన్నాయి. వీటి ద్వారా 70 వేల క్వింటాళ్ల ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేస్తారు. ఈ సీడ్‌ను రైతులకు అందజేసి అవసరమైన విత్తనాన్ని తయారు చేస్తారు. ఏటా 10 లక్షల క్వింటాళ్ల వరి, వేరుశనగ, కందులు, శనగలు, చిరు ధాన్యాల విత్తనాలను తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు.
ఇలా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేసే ఫామ్స్‌లో కర్నూలు జిల్లా తంగడంచ సీడ్ ఫామ్ ఒకటి. 630 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సీడ్ ఫామ్‌లో స్థానికంగా డిమాండ్ ఉన్న కందులు, శనగల ఫౌండేషన్ సీడ్‌ను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో రూ.670 కోట్లతో మెగా సీడ్ పార్కు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. పైసా విదల్చకుండానే 2017 అక్టోబర్‌లో హడావుడిగా శంకుస్థాపన చేశారు.
ఆ తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ దీనిని పట్టించుకోలేదు. అయితే ఈ తంగడంచలోని సీడ్ పార్కును వివిధ పంటల హైబ్రిడ్ సీడ్ మూల విత్తన ఉత్పత్తి క్షేత్రంగా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈ పార్కు కోసం 2018లోనే అప్పటి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందంటూ ఓ పెద్ద అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. నిజంగా ని«ధులు కేటాయించి ఉంటే శంకుస్థాపన చేసిన తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్న బాబు ఎందుకు గాలికొదిలేశారో రామోజీకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment