Mega Seed Park
-
Fact Check: అది బాబు వదిలేసిన పార్కే..
సాక్షి, అమరావతి: మెగా సీడ్ పార్క్ అంటూ చంద్రబాబునాయుడు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర అధికారంలో ఉన్నా ప్రాజెక్టుకు పైసా కూడా విదల్చలేదు. ఆయన వేసిన వేల శంకుస్థాపన శిలాఫలకాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోయింది. అయినా ఏనాడూ నోరుమెదపని రామోజీరావు ఈ పార్కును జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విషప్రచారానికి ఒడిగట్టారు. ఓ అబద్ధాల కథనాన్ని ఈనాడు అచ్చేసింది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్న చేయి పట్టుకొని నడిపిస్తున్న ప్రభుత్వంపై బురదజల్లుతూ ఈ కథనం వండివార్చింది. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. సాధారణంగా పంటల సాగు కోసం బ్రీడర్ సీడ్ నుంచి ఉత్పత్తి చేసిన ఫౌండేషన్ సీడ్‌ను రైతులకు ఇచ్చి వారి ద్వారా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా విత్తనోత్పత్తి చేస్తుంటారు. ఇలా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తికి రాష్ట్రంలో తొమ్మిది సీడ్ ఫామ్స్ ఉన్నాయి. వీటి ద్వారా 70 వేల క్వింటాళ్ల ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేస్తారు. ఈ సీడ్‌ను రైతులకు అందజేసి అవసరమైన విత్తనాన్ని తయారు చేస్తారు. ఏటా 10 లక్షల క్వింటాళ్ల వరి, వేరుశనగ, కందులు, శనగలు, చిరు ధాన్యాల విత్తనాలను తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. ఇలా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేసే ఫామ్స్‌లో కర్నూలు జిల్లా తంగడంచ సీడ్ ఫామ్ ఒకటి. 630 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సీడ్ ఫామ్‌లో స్థానికంగా డిమాండ్ ఉన్న కందులు, శనగల ఫౌండేషన్ సీడ్‌ను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో రూ.670 కోట్లతో మెగా సీడ్ పార్కు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. పైసా విదల్చకుండానే 2017 అక్టోబర్‌లో హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ దీనిని పట్టించుకోలేదు. అయితే ఈ తంగడంచలోని సీడ్ పార్కును వివిధ పంటల హైబ్రిడ్ సీడ్ మూల విత్తన ఉత్పత్తి క్షేత్రంగా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈ పార్కు కోసం 2018లోనే అప్పటి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందంటూ ఓ పెద్ద అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. నిజంగా ని«ధులు కేటాయించి ఉంటే శంకుస్థాపన చేసిన తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్న బాబు ఎందుకు గాలికొదిలేశారో రామోజీకే తెలియాలి. -
పారిశ్రామిక హబ్.. అంతా బుస్
సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘జైన్ ఇరిగేషన్, జైరాజ్ ఇస్పాత్, గుజరాత్ అంబుజా, రాంకో సిమెంట్.. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి.. నిరుద్యోగ సమస్య తీరినట్టే.. ఎంతో మందికి ఉపాధి దొరికినట్టే.. జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతా..’ ఐదేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ఇదే మాట. పుణ్య కాలం గడిచిపోయింది. జిల్లాలో పరిశ్రమల స్థాపన శంకుస్థాపనలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం హడావుడే తప్పా ఒక్క ఫ్యాక్టరీ లేదు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదు. పునాదిరాళ్ల దశలోనే పరిశ్రమలన్నీ సమాధి అవుతున్నాయి. స్థానిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కరువై చిన్న చిన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నీరున్నా.. గనులున్నా.. భూములున్నా జిల్లాలో పరిశ్రమల జాడ లేదు. హబ్‌ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం ఊదరగొడుతున్నా పరిశ్రమలు వచ్చిందీ లేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించిందీ లేదు. 2014 ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకల్లో కర్నూలులో పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు జిల్లాను పరిశ్రమల హబ్‌గా మార్చి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఓర్వకల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్, కొలిమిగుండ్లలో సిమెంట్ ఇండస్ట్రీ హబ్‌లకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వేలాది ఎకరాలను కేటాయించారు. పంటలు పండే భూములను రైతుల నుంచి తీసుకున్న సర్కార్ పరిశ్రమలను స్థాపించడంలో విఫలమైంది. 2016 ఆగస్టు 17న ఓర్వకల్ ఇండస్ట్రీయల్ హబ్‌కు, అదేరోజు జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో కర్నూలు మెగా అల్ట్రా ఫుడ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కొలిమిగుండ్ల సిమెంట్ ఇండస్ట్రీయల్ హబ్‌కు శంకుస్థాపన చేశారు. అంబుజా పాయె.. ఓర్వకల్ ఇండస్ట్రీయల్ హబ్‌కు దాదాపు 13 వేల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్‌కు అప్పగించారు. అయితే మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. తంగడంచె సమీపంలో గుజరాత్ అంబుజా, జైన్ ఇరిగేషన్ ఫుడ్ పార్కులకు సీఎం చంద్రబాబునాయుడు 2017లో వేర్వేరు రోజుల్లో శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే ఇక్కడ పరిశ్రమ స్థాపనకు సదుపాయాలు లేవని గుజరాత్ అంబుజా పరిశ్రమ కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చి వెళ్లిపోయింది. జైన్ ఇరిగేషన్ పరిశ్రమ మాత్రం ప్రాథమిక స్టేజీని దాటి ముందుకు రావడం లేదు. ఓర్వకల్ ఇండస్ట్రీయల్ హబ్‌లో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీకి సీఎం శంకుస్థాపన చేయగా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అలాగే ఇక్కడ స్థాపించాల్సిన డీఆర్డీఓ రక్షణ రంగ శిక్షణ కేంద్రం, ఎన్ఎఫ్సీతోపాటు పలు సంస్థలు మౌలిక వసతులు లేకపోవడంతో స్థాపనకు ముందుకు రాలేదు. సిమెంటు ఫ్యాక్టరీలు ఏవి..? కొలిమిగుండ్ల పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన వనరులు ఉండటంతో సిమెంట్ ఇండస్ట్రీయల్ హబ్‌కు చర్యలు తీసుకున్నారు. రాంకో, ప్రిజమ్, అల్ట్రాటెక్ సంస్థలు సిమెంట్ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయి. అయితే ఇక్కడ కూడా నీటి వసతి లేకపోవడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు లభిస్తాయన్న ఆశతో ఉన్న యాజమాన్యాలు ఒక్కసారిగా మనసు మార్చుకున్నాయి. మూడింటిలో రాంకో మాత్రమే పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చింది. దీంతో 2018 డిసెంబర్ 14వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు అమరావతి నుంచి వీసీ ద్వారా శంకుస్థాపన చేశారు. మిగిలిన ప్రిజమ్, అల్ట్రాటెక్ వెనకడుగు వేశాయి. రైల్వే సైడింగ్, రోడ్డు రవాణా పనులను ర్యాంకో సొంతంగా చేపట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమ కూడా స్థాపనకు ఉత్సాహం చూపలేదు. అయితే ప్రభుత్వం రంగ ప్రవేశం చేసి ఇచ్చిన హామీ మేరకు రాంకోను బలవంతంగా ఒప్పించి శంకుస్థాపనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఎంఎస్ఎంఈ పార్కులు హామీలకే పరిమితం ప్రతి నిమోజకవర్గంలో ఎంఎస్ఎంఈ (మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్) పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పార్కుల కోసం స్థలాల సేకరణ చేయాలని మూడేళ్ల క్రితం ఆదేశాలు ఇచ్చారు. అయితే అతి కష్టం మీద ఇటీవల నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల్లో మూడు పార్కుల కోసం 148.31 ఎకరాలను సేకరించి ఆంధ్రప్రదేశ్ మౌలికాభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ)కు అప్పగించారు. మిగతా 11 నియోజకవర్గాల్లో భూములను గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ప్రభుత్వ కాలం ముగియడంతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు వచ్చిన మూడు పార్కుల్లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపకపోవడంతో అవి కూడా మధ్యలోనే నిలిచి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎంతో అనువైన ఖనిజాలు ఉన్నాయి. అయితే వాటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలి. ఓర్వకల్, కొలిమిగుండ్లలో ఇండస్ట్రీయల్ హబ్‌లు ఏర్పాటు చేసినా నీటి వసతి లేదు. అందువల్లనే పరిశ్రమలు తరలి రావడం లేదు. ముచ్చుమర్రి నుంచి 1.41 టీఎంసీల నీటి కోసం ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. – జి.రామకృష్ణ, ఫ్యాప్సియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరుద్యోగులను మోసం చేశారు 2014 ఆగస్టు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఓర్వకల్లో ఇండస్ట్రియల్ హబ్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన ప్రతిసారి ఒక్కో పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఒక్కదానికి పునాది పడలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు. – మహేంద్ర, కర్నూలు -
తంగడంచెలో మెగా సీడ్ పార్క్
- అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ సాంకేతిక సహకారం - ఒకటి, రెండు నెలల్లో సీఎం చేతులు మీదుగా శుంకుస్థాపనకు చర్యలు - వ్యవసాయశాఖ కమిషనర్ హరి జవహర్లాల్ కర్నూలు(అగ్రికల్చర్): జూపాడుబంగ్లా మండలం తంగడంచ ఫామ్‌లో ఆసియాలోనే అతిపెద్ద మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరి జవహార్‌లాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన సోమవారం తంగడంచెకు వెల్లి అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ ప్రతినిధులతో కలసి భూములను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీడ్ పార్క్‌ను అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ సాంకేతిక సహకారంతో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఒకటి, రెండు నెలల్లో ప్రాథమిక పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుమీదుగా శంకు స్థాపన చేస్తామన్నారు. ప్రస్తుతం తంగడంచెలో 805 ఎకరాల భూములు ఉన్నాయని, సీడ్ పార్క్‌కు ఎంత అవసరమైతే అంత ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విత్తనోత్పత్తి, పరిశోధన, శిక్షణ, సీడ్ సర్టిపికేషన్ కార్పోరేషన్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాఖ తదితర వన్ని ఇందులో ఉంటాయన్నారు. ఆయన వెంట నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ గోపాల్‌రెడ్డి, డీడీఏ పీపీ మల్లికార్జునరావు, ఏడీఏలు రమణారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, కర్నూలు ఏఓ అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు. -
రాష్ట్రంలో మెగా సీడ్ పార్కు
- సుముఖత వ్యక్తం చేసిన ఐయోవా స్టేట్ యూనివర్సిటీ - వర్సిటీ డీన్‌తో సమావేశమైన చంద్రబాబు బృందం సాక్షి, అమరావతి: ఐయోవా స్టేట్ యూనివర్సిటీ ఏపీలో మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి దశ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐయోవా స్టేట్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ వెండీ వింటర్ స్టీన్ అంకురార్పణ చేసినట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం నాలుగోరోజు అమెరికా పర్యటన వివరాలను తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి బృందం నాలుగోరోజు ఐయోవా స్టేట్ యూనివర్సిటీని సందర్శించింది. విత్తనాభివృద్ధి, పరిశోధనా రంగంలో సహకారం అందించేందుకు యూనివర్సిటీ అంగీకరించింది. రాష్ట్రంలో మెగా సీడ్ పార్కు నెలకొల్పాలని ముఖ్యమంత్రి కోరగా ఇందుకు యూనివర్సిటీ సుముఖత వ్యక్తం చేసింది. అంతకుముందు ఐయోవా రాష్ట్ర వ్యవసాయ మంత్రి బిల్ నోర్తి, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్‌న్ అధ్యక్షుడు కెన్నెత్ క్విన్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. తెలుగువారంతా బాహుబలులే: ఐయోవా పర్యటన తర్వాత శాన్ హుజ్ వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడ ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని, తెలుగుజాతి ప్రపంచానికే ఆదర్శం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ శాన్ హుజ్ మేయర్ సామ్ లికార్డో, కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా, సెనెటర్ బాబ్ వెల్ కౌస్కీ, అసెంబ్లీ సభ్యులు కాన్సాన్, ఆస్ కల్రాలను సీఎం కలిశారు. సిలికానాంధ్రలో అమరావతి భాషా శాస్త్ర పీఠం: సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో మిలియన్ డాలర్లతో అమరావతి భాషా శాస్త్ర కేంద్రం (Amaravathi chool of Linf uirticrChair) ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ’మనబడి’ దశాబ్ది వేడుకల లోగోను ఆవిష్కరించారు. భారతీయ కళలైన కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యాలలో ఎంఏ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్స్‌లు అందించే తొలి అమెరికా విశ్వవిద్యాలయం సిలికానాంధ్రను ఆయన శనివారం ఉదయం సందర్శించారు. భాష, సంస్కృతి పరిరక్షణకు యూనివర్సిటీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. సిలికానాంధ్ర అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి సీఎంను సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు.