పారిశ్రామిక హబ్‌.. అంతా బుస్‌ | The Establishment Of Industry In The District Is Limited To The Foundation | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక హబ్‌.. అంతా బుస్‌

Published Wed, Mar 13 2019 11:49 AM | Last Updated on Wed, Mar 13 2019 11:49 AM

The Establishment Of Industry In The District Is Limited To The Foundation - Sakshi

 సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  ‘జైన్‌ ఇరిగేషన్, జైరాజ్‌ ఇస్పాత్, గుజరాత్‌ అంబుజా, రాంకో సిమెంట్‌.. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి.. నిరుద్యోగ సమస్య తీరినట్టే.. ఎంతో మందికి ఉపాధి దొరికినట్టే.. జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతా..’ ఐదేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ఇదే మాట. పుణ్య కాలం గడిచిపోయింది. జిల్లాలో పరిశ్రమల స్థాపన శంకుస్థాపనలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం హడావుడే తప్పా ఒక్క ఫ్యాక్టరీ లేదు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదు. పునాదిరాళ్ల దశలోనే పరిశ్రమలన్నీ సమాధి అవుతున్నాయి. స్థానిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కరువై చిన్న చిన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి.  
 
నీరున్నా.. గనులున్నా.. భూములున్నా జిల్లాలో పరిశ్రమల జాడ లేదు. హబ్‌ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం ఊదరగొడుతున్నా పరిశ్రమలు వచ్చిందీ లేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించిందీ లేదు. 2014 ఆగస్టు 15 స్వాతంత్య్ర  వేడుకల్లో కర్నూలులో పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు జిల్లాను పరిశ్రమల హబ్‌గా మార్చి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఆ మేరకు ఓర్వకల్‌లో మెగా ఇండస్ట్రియల్‌ హబ్, కొలిమిగుండ్లలో సిమెంట్‌ ఇండస్ట్రీ హబ్‌లకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వేలాది ఎకరాలను కేటాయించారు. పంటలు పండే భూములను రైతుల నుంచి తీసుకున్న సర్కార్‌ పరిశ్రమలను స్థాపించడంలో విఫలమైంది. 2016 ఆగస్టు 17న ఓర్వకల్‌ ఇండస్ట్రీయల్‌ హబ్‌కు, అదేరోజు జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో కర్నూలు మెగా అల్ట్రా ఫుడ్‌ పార్కుకు  శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కొలిమిగుండ్ల సిమెంట్‌ ఇండస్ట్రీయల్‌ హబ్‌కు శంకుస్థాపన చేశారు.  

అంబుజా పాయె..  
ఓర్వకల్‌ ఇండస్ట్రీయల్‌ హబ్‌కు దాదాపు 13 వేల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్‌కు అప్పగించారు. అయితే మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. తంగడంచె సమీపంలో గుజరాత్‌ అంబుజా, జైన్‌ ఇరిగేషన్‌ ఫుడ్‌ పార్కులకు సీఎం చంద్రబాబునాయుడు 2017లో వేర్వేరు రోజుల్లో శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే ఇక్కడ పరిశ్రమ స్థాపనకు సదుపాయాలు లేవని గుజరాత్‌ అంబుజా పరిశ్రమ కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చి వెళ్లిపోయింది. జైన్‌ ఇరిగేషన్‌ పరిశ్రమ మాత్రం ప్రాథమిక స్టేజీని దాటి ముందుకు రావడం లేదు. ఓర్వకల్‌ ఇండస్ట్రీయల్‌ హబ్‌లో జైరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ కంపెనీకి సీఎం శంకుస్థాపన చేయగా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అలాగే ఇక్కడ స్థాపించాల్సిన డీఆర్‌డీఓ రక్షణ రంగ శిక్షణ కేంద్రం, ఎన్‌ఎఫ్‌సీతోపాటు పలు సంస్థలు మౌలిక వసతులు లేకపోవడంతో  స్థాపనకు ముందుకు రాలేదు.

సిమెంటు ఫ్యాక్టరీలు ఏవి..?
కొలిమిగుండ్ల పరిసర ప్రాంతాల్లో సిమెంట్‌ ఉత్పత్తికి అవసరమైన వనరులు ఉండటంతో సిమెంట్‌ ఇండస్ట్రీయల్‌ హబ్‌కు చర్యలు తీసుకున్నారు. రాంకో, ప్రిజమ్, అల్ట్రాటెక్‌ సంస్థలు సిమెంట్‌ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయి. అయితే ఇక్కడ కూడా నీటి వసతి లేకపోవడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు లభిస్తాయన్న ఆశతో ఉన్న యాజమాన్యాలు ఒక్కసారిగా మనసు మార్చుకున్నాయి. మూడింటిలో రాంకో మాత్రమే పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చింది. దీంతో 2018 డిసెంబర్‌ 14వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు అమరావతి నుంచి వీసీ ద్వారా శంకుస్థాపన చేశారు. మిగిలిన ప్రిజమ్, అల్ట్రాటెక్‌ వెనకడుగు వేశాయి. రైల్వే సైడింగ్, రోడ్డు రవాణా పనులను ర్యాంకో సొంతంగా చేపట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమ కూడా స్థాపనకు ఉత్సాహం చూపలేదు. అయితే ప్రభుత్వం రంగ ప్రవేశం చేసి ఇచ్చిన హామీ మేరకు రాంకోను బలవంతంగా ఒప్పించి శంకుస్థాపనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. 

ఎంఎస్‌ఎంఈ పార్కులు హామీలకే పరిమితం  
ప్రతి నిమోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ (మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పార్కుల కోసం స్థలాల సేకరణ చేయాలని మూడేళ్ల క్రితం ఆదేశాలు ఇచ్చారు. అయితే అతి కష్టం మీద ఇటీవల నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల్లో మూడు పార్కుల కోసం 148.31 ఎకరాలను సేకరించి ఆంధ్రప్రదేశ్‌ మౌలికాభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ)కు అప్పగించారు. మిగతా 11 నియోజకవర్గాల్లో భూములను గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ప్రభుత్వ కాలం ముగియడంతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు వచ్చిన మూడు పార్కుల్లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపకపోవడంతో అవి కూడా మధ్యలోనే నిలిచి పోయాయి.   

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం  
కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎంతో అనువైన ఖనిజాలు ఉన్నాయి. అయితే వాటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలి. ఓర్వకల్, కొలిమిగుండ్లలో ఇండస్ట్రీయల్‌ హబ్‌లు ఏర్పాటు చేసినా నీటి వసతి లేదు. అందువల్లనే పరిశ్రమలు తరలి రావడం లేదు. ముచ్చుమర్రి నుంచి 1.41 టీఎంసీల నీటి కోసం ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. 
 – జి.రామకృష్ణ, ఫ్యాప్సియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు   

నిరుద్యోగులను మోసం చేశారు 
2014 ఆగస్టు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఓర్వకల్‌లో ఇండస్ట్రియల్‌ హబ్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన ప్రతిసారి ఒక్కో పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఒక్కదానికి పునాది పడలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు.   
– మహేంద్ర, కర్నూలు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement