అనంతపురం అర్బన్: ఐదేళ్ల టీడీపీ పాలన ఓటు బ్యాంకు రాజకీయం చుట్టూనే సాగింది. పేదల సంక్షేమంపై ‘పచ్చ’పాతం చూపిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఏ పథకం వర్తించాలన్నా.. టీడీపీ నేతల గడప తొక్కాల్సిందే. జన్మభూమి కమిటీల మితిమీరిన పెత్తనంతో అర్హులకు తీరని అన్యాయం జరిగింది. చివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) విషయంలోనూ పూర్తి నిర్దయగా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫారసులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి.. జిల్లా అత్యున్నత అధికారి కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం చూస్తే టీడీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో వివక్ష చూపిందో అర్థమవుతోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ పంపిన ప్రతిపాదనలు అన్నీ బుట్టదాఖలయ్యాయి. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఈ ఐదేళ్ల వ్యవధిలో 282 మంది బాధితులకు ఆర్థిక సహాయం కోసం కలెక్టర్ ద్వారా వెళ్లి ప్రతిపాదనలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం.
ప్రతిపాదనలు కచ్చితమైనవే అయినా..
బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ పంపించే ప్రతిపాదనలు వంద శాతం కచ్చితమైనవే ఉంటాయి. ఆర్థిక సహాయం కోసం బాధితుడు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకుంటారు. ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేసి నివేదిక పంపుతారు. దానిని ఆర్‌డీఓ మరోసారి పరిశీలించి సహేతుకమైనదైతే అదే విషయాన్ని పొందపరుస్తూ కలెక్టర్‌కు నివేదిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ పరిశీలించి సంబంధిత బాధితులు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయానికి అర్హులంటూ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతారు. వాస్తవంగా కలెక్టర్ పంపే ప్రతిపాదనల్లో వందశాతం కచ్చితత్వం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ ప్రతిపాదనలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో కలెక్టర్ పంపిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదనేందుకు ఏ ఒక్కరికీ ఆర్థిక సహాయం మంజూరు చేయకపోవడమే నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రజాప్రతినిధుల సిఫార్సులకే మొగ్గు
సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరులో ప్రభుత్వం అధికార పార్టీ ప్రజాప్రతనిధుల సిఫారసులకే మొగ్గు చూపింది. కలెక్టర్ సిఫారసులను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన వారికి మాత్రమే సీఎంఆర్‌ఎఫ్ కింద ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ వచ్చింది. వాస్తవానికి కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసుల్లో అధిక శాతం బోగస్ ఉన్నట్లు తెలిసింది. అధికారపార్టీకి చెందిన కార్యకర్తలకు, నాయకులు సూచించిన వారికి సిఫారసు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా పనిచేసిన వారు సీఎంఆర్‌ఎఫ్‌ని తమకు అనుకూలంగా మలుచుకొని లబ్ధిపొందినట్లు తెలిసింది. తప్పుడు బిల్లులను సృష్టించి వాటిని ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖకు జతజేసి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో కొందరు నాయకులు, ప్రజాప్రతినిధుల పీఏలు బాధితుల నుంచి కమీషన్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది.
ఆపదలోనూ పచ్చపాతమే!
Published Mon, May 6 2019 7:57 AM | Last Updated on Mon, May 6 2019 7:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment