రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విప్లవాత్మకమైన మార్పుతో జనరంజక పాలనకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలకబోతున్నారని, ఈ పాలన రాష్ట్రానికి శుభారంభం కాబోతోందని కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే, ఏపీ సివిల్ çసప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు. ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలపై శనివారం అవుకు చల్లా భవన్‌లో ‘సాక్షి’కి ఇచ్చిన విశ్లేషణ ఆయన మాటల్లోనే..
కోవెలకుంట్ల: ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఐదేళ్లలో రాష్ట్రమంతటా కొన్ని వేల చిన్న, పెద్ద సభలు పెట్టి 1,001 అపద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టినందుకు ప్రతిఫలంగా వచ్చే నెల 23న వెలువడే ప్రజాతీర్పు వైఎస్సార్‌సీపీ గెలుపు కాబోతోంది. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దంపట్టే చక్కటి సుపరిపాలన వచ్చే నెల 23 తర్వాత ఆరంభం కాబోతోంది. అది సకల జనులకు సౌలభ్యంగా ఉండే సుపరిపాలనకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. అటు మేధావులు, ఇటు సామాన్య ప్రజానీకం సైతం మెప్పు పొందే ఒక చక్కటి పాలన సుదీర్ఘకాలంగా కొనసాగనుంది. రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో అడుగడుగునా గ్రహించిన ప్రజల మనోభావాల ప్రతిరూపమే వైఎస్ జగన్ పాలనకు ఒక ఆకృతి ఆవిష్కారం అవుతుంది’.
ఎన్నికల కమిషన్‌ను తప్పుపట్టడం హాస్యాస్పదం
‘ఎన్నికలు జరిగిన రోజు నుంచి చంద్రబాబు మానసిక మార్పును గమనిస్తే చిత్ర, విచిత్ర వేషధారణలా ఉంది. ప్రపంచదేశాల్లోనే 133 కోట్ల జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశంలో భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ మచ్చలేకుండా ఎన్నికల కమిషన్ చక్కగా ఎన్నికలు నిర్వహిస్తుందని దేశ, విదేశాలు కొనియాడుతుంటే చంద్రబాబు అదే ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టడం హాస్యాస్పదం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చాంబర్‌కు వెళ్లి ఎన్నికల కమిషనర్‌పై.. అదే ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం విడ్డూరం. చాంబర్ నుంచి బయటకు వచ్చి మెట్ట మీద కూర్చోవడం ఇవన్నీ విచిత్ర వేషధారణలా కన్పిస్తున్నాయి. మరోవైపు తాను వేసిన ఓటు తన పార్టీ సింబల్‌కే పడిందో లేదో అర్థం కావడం లేదంటున్నారు.
హైటెక్నాటజీ మేధావిగా చెప్పుకునే చంద్రబాబు హైటెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఓటు వేస్తే.. వారు ఏ పార్టీ సింబల్‌కు ఓటు వేశారో వీవీప్యాడ్స్‌లో ఏడు సెకన్లు డిస్‌ప్లే అవుతున్నా.. అది కూడా గ్రహించలేకపోవడం విడ్దూరం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తప్పుపడుతున్నారు. వీవీప్యాడ్స్‌ను తప్పుపడుతున్నారు. ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. అతిపెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, చత్తీష్‌ఘడ్, రాజస్తాన్‌లో నాలుగు నెలల క్రితం ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే టెక్నాలజీతో ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ లేదా? ఎన్నికల కమిషన్ బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ అని పదే పదే అంటున్నావు.. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూసి కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధించింది’ అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
ఓడిపోతున్నట్లు ప్రజలకు సంకేతం
‘ఓడిపోతున్నానని ముందే గ్రహించి ప్రజలకు తానే ఈ రూపంలో పరోక్షంగా సంకేతం పంపుతున్నారు. వచ్చే నెల 23న వైఎస్సార్‌సీపీ విజయం సాధించబోతోందని, వైఎస్ జగన్ పాలన రాబోతోందని చంద్రబాబు నిస్పృహ, నైరాశ్యంతో రోజుకో తీరుగా ప్రవర్తిస్తుండటమే అందుకు నిదర్శనం. ఎన్ని రకాలుగా ఆలోచనలు చేసినా, దేశ, విదేశ సర్వే ఫలితాలు చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మనోభావాలను పరిగణలోకి తీసుకున్నా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి రెండు, మూడు జిల్లాలు తప్ప మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కర్నూలు జిల్లాలో ఒకటి, రెండు సీట్లు తప్ప ఎక్కడా టీడీపీకి అనుకూలంగా లేవు. వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన రాబోతోందన్నది అక్షర సత్యం’.
Comments
Please login to add a commentAdd a comment