Janambhoomi program
-
ఆపదలోనూ పచ్చపాతమే!
అనంతపురం అర్బన్: ఐదేళ్ల టీడీపీ పాలన ఓటు బ్యాంకు రాజకీయం చుట్టూనే సాగింది. పేదల సంక్షేమంపై ‘పచ్చ’పాతం చూపిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఏ పథకం వర్తించాలన్నా.. టీడీపీ నేతల గడప తొక్కాల్సిందే. జన్మభూమి కమిటీల మితిమీరిన పెత్తనంతో అర్హులకు తీరని అన్యాయం జరిగింది. చివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) విషయంలోనూ పూర్తి నిర్దయగా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫారసులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి.. జిల్లా అత్యున్నత అధికారి కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం చూస్తే టీడీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో వివక్ష చూపిందో అర్థమవుతోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ పంపిన ప్రతిపాదనలు అన్నీ బుట్టదాఖలయ్యాయి. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఈ ఐదేళ్ల వ్యవధిలో 282 మంది బాధితులకు ఆర్థిక సహాయం కోసం కలెక్టర్ ద్వారా వెళ్లి ప్రతిపాదనలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రతిపాదనలు కచ్చితమైనవే అయినా.. బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ పంపించే ప్రతిపాదనలు వంద శాతం కచ్చితమైనవే ఉంటాయి. ఆర్థిక సహాయం కోసం బాధితుడు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకుంటారు. ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేసి నివేదిక పంపుతారు. దానిని ఆర్డీఓ మరోసారి పరిశీలించి సహేతుకమైనదైతే అదే విషయాన్ని పొందపరుస్తూ కలెక్టర్‌కు నివేదిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ పరిశీలించి సంబంధిత బాధితులు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయానికి అర్హులంటూ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతారు. వాస్తవంగా కలెక్టర్ పంపే ప్రతిపాదనల్లో వందశాతం కచ్చితత్వం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ ప్రతిపాదనలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో కలెక్టర్ పంపిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదనేందుకు ఏ ఒక్కరికీ ఆర్థిక సహాయం మంజూరు చేయకపోవడమే నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజాప్రతినిధుల సిఫార్సులకే మొగ్గు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరులో ప్రభుత్వం అధికార పార్టీ ప్రజాప్రతనిధుల సిఫారసులకే మొగ్గు చూపింది. కలెక్టర్ సిఫారసులను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన వారికి మాత్రమే సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ వచ్చింది. వాస్తవానికి కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసుల్లో అధిక శాతం బోగస్ ఉన్నట్లు తెలిసింది. అధికారపార్టీకి చెందిన కార్యకర్తలకు, నాయకులు సూచించిన వారికి సిఫారసు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా పనిచేసిన వారు సీఎంఆర్ఎఫ్ని తమకు అనుకూలంగా మలుచుకొని లబ్ధిపొందినట్లు తెలిసింది. తప్పుడు బిల్లులను సృష్టించి వాటిని ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖకు జతజేసి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో కొందరు నాయకులు, ప్రజాప్రతినిధుల పీఏలు బాధితుల నుంచి కమీషన్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. -
రబీకి పూర్తిగా నీళ్లందేనా?
జిల్లాలో అన్నదాతలు ప్రతి ఏటా రబీకి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మాత్రం నీరందించే స్తామంటూ ప్రకటనలు గుప్పిస్తూ ఆ తర్వాత కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నాయి. మళ్లీ రబీ సీజన్ ప్రారంభం కానుండడంతో రైతుల్లో నీటి కలవరం మొదలైంది. దీనికితోడు నత్తనడకన జరుగుతున్న డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వ అజమాయిషీ లోపించింది. దీంతో ఎన్ని రబీ సీజన్లు తాము పంటను కోల్పోవాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఐఏబీ సమావేశంలో ఎటువంటి నిర్ణయూలు వెలువడతాయోనని ఎదురుచూస్తున్నారు. ఏలూరు : ఈ రబీ సీజన్‌కు పూర్తిస్థాయిలో టీడీపీ సర్కార్ నీరందిస్తుందా? ఇవ్వదా? అన్న ఆందోళన రైతన్నలను వేధిస్తోంది. ఈనెల ఒకటవ తేదీన జిల్లాలో జరిగిన జన్మభూమి- మా ఊరు సభలో రెండో పంటకు నీరు ఇస్తున్నాం... ఈ విషయంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ తరుణంలో సాగునీరు అందించడం, డెల్టా ఆధునీకరణ పనులు తిరిగి ప్రారంభించడం తదితర అంశాలతో కూడిన ఎజెండాతో ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఇరిగేషన్ సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సందర్భంలో జిల్లాలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తమ్మిలేరు నుంచి రబీకి సాగునీటి సరఫరా అనుమతించడం, పంటకాలం తర్వాత కాల్వలు కట్టేసే సమయం తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. నీటి సంఘాలు మనుగడలో లేని కారణంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా ఇరిగేషన్ ఎస్ఈ, ఇతర సంఘాలకు కూడా అధికారులే పర్సన్ ఇన్చార్జులుగా మూడేళ్ల కాలం నుంచి వ్యవహరిస్తున్నారు. 80 శాతం సాగునీటికే అవకాశం జిల్లాలో ప్రతి రబీ సీజన్లో 4.60 లక్షల ఎకరాల వరి పంట సాగవుతుంది. ఈ ఏడాది కూడా పశ్చిమ డెల్టా కింద సాగునీటి లభ్యత తక్కువగా ఉండడంతో నూరుశాతం సాగునీరు అందించే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం రబీలో పూర్తిస్థాయిలో నీరిస్తే 42.58 టీఎంసీల నీటి నిల్వలు అవసరం. ప్రస్తుతం 34.42 టీఎంసీల లభ్యత ఉన్నట్టు అంచనా. సీలేరు నుంచి అదనంగా నీటిని గోదావరికి మళ్లించగలిగితే పంటల సాగు పూర్తి అయ్యే వీలుంది. అరుుతే సీలేరులో కూడా నీటిలభ్యత లేకపోవడంతో రబీలో 80 శాతం మాత్రం సాగుకు నీరివ్వగలమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నూరుశాతం సాగుకు అనుమతించిన పక్షంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో గోదావరి నీటినిల్వలు పడిపోతే పంట సంక్షోభంలో పడుతుంది. నాట్లు త్వరగా వేసి మార్చి 31వ తేదీలోగా సాగు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటే రబీ పంట గటెక్కే అవకాశాలున్నాయి. అరుుతే ఈ సందర్భంలో చేపల చెరువుల రైతులకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ అంశాలపై టీడీపీ పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. డెల్టా ఆధునికీకరణపై చర్చ సాగేనా? డెల్టా ఆధునికీకరణలో భాగంగా కాల్వలు, డ్రెయిన్ల ప్రక్షాళన 50 శాతం కూడా పూర్తికాలేదు. 2007లో రూ.1464 కోట్లతో ఈ పనులు చేపట్టగా ఇప్పటికి రూ.475.13 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. కాకరపర్రు, నర్సాపురం, బ్యాంకు కెనాల్, అత్తిలి, ఉండి కాల్వలతో పాటు యనమదుర్రు డ్రెయిన్ ఆధునికీకరణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. నాలుగున్నరేళ్ల నుంచి ప్రోగ్రెస్సివ్ కనస్ట్రక్షన్స్ లిమిటెడ్, ఐవీఆర్సీ కంపెనీ లిమిటెడ్ రూ.300 కోట్ల పనులను పెండింగ్‌లో ఉంచాయి. ఈ కంపెనీలపై ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు లేవు. ప్రోగ్రెస్సివ్ కనస్ట్రక్షన్ కంపెనీ రూ.130 కోట్ల పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందని, ఇది కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన కంపెనీ అని టీడీపీ ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేసినా ప్రయోజన ం శూన్యమే. గత రబీలో చేపట్టిన రూ.170 కోట్ల పనులు సైతం మందగమనంలోనే ఉన్నాయి. ఇటీవలే డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. జిల్లాలో గోదావరి, కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల్లో కొన్ని లోపాలున్నాయని, చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించి వాటిని పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. అయితే ప్రభుత్వం కొత్త పనులు ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. రబీ పంట కాలాల్లో రెండు లాంగ్ క్లోజర్లు అంటే 90 రోజులు కాలువలు మూసివేస్తే ఆధునికీకరణ పనులు పూర్తి అవుతాయని అధికారులు అంటున్నారు. ఇలా ఇస్తే రెండు సీజన్లలో రబీ పరంగా రూ.1600 కోట్ల పంట రైతులు నష్టపోతారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
‘ఖర్మ’భూమి!
వంగర: మండల పరిధిలోని కొండచాకరాపల్లిలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారిం ది. గ్రామంలోని వైఎస్ఆర్ సీపీ అభిమానుల పింఛన్లతోపాటు అర్హులైన వృద్ధు లు, వితంతువుల పింఛన్లను పంచాయతీ కార్యదర్శి సహకారంతో స్థానిక టీడీపీ నాయకులు తొలగించారని బాధిత లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కార్యదర్శి జగ్దల్ కాలర్ పట్టుకుని లబ్ధిదారులు లాక్కొని వెళ్లడంతో రభస మొదలైంది. ఒక్కొక్కరుగా గుమిగూడి వర్గాలుగా విడిపోయి తమ పింఛన్లను పార్టీ కక్షతో తొలగించారని జెడ్పీటీసీ సభ్యుడు బొత్స వాసుదేవరావునాయుడు, ఎంపీటీసీ ప్రతినిధి బెవర రమేష్‌లను స్థానిక సర్పంచ్ ప్రతినిధి పారిశర్ల రామకృష్ణ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గొడవతో సభాప్రాంగణమంతా దద్దరిల్లింది. ఈ దశలో ఎస్ఐ కె.శాంతారామ్, పోలీస్ సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావునాయుడు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగదని, పార్టీలకు అతీతంగా పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిం చారు. అనంత రం పలువురికి పింఛను సొమ్మును పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మీసాల విజ య్‌భాస్కర్, సూపరింటెండెంట్ జి.కాశీవిశ్వనాథంతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కొత్తకోటలో... లావేరు : మండలంలోని కొత్తకోట పంచాయతీలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అర్హుల పింఛన్లను ఎందుకు తొలగించారంటూ అధికారులను వైఎస్ఆర్ సీపీ నాయకులు, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రొక్కం బాలకృష్ణ నిలదీశారు. కేవలం తమ పార్టీ అభిమానుల పింఛన్లనే రద్దు చేశారని ఆరోపించారు. దీనిపై టీడీపీ నాయకులు శ్రీరామమూర్తి, సాంబశివరావు కలుగజేసుకుని పింఛన్ల రద్దులో రాజకీయ కారణాలంటూ ఏమీ లేవని చెప్పగా, అందులో ఓ వ్యక్తి మాత్రం అంతా మేము చెప్పినట్లే అన్నీ జరుగుతుందని, ఏంచేసుకుంటారో చేసుకోండంటూ రెచ్చగొట్టారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత వరకు వెళ్లింది. దీంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కళావెంకటరావు గుర్రాలపాలెంలో జన్మభూమి ఉందంటూ అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఘర్షణ చెలరేగింది. అయితే కొందరు పెద్దలు ఇరువర్గాలవారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. -
‘నేను బతికే ఉన్నా’
ఐ.పోలవరం :రికార్డుల్లో చనిపోయినట్టు చూపించి పింఛను తొలగించడంతో ‘నేను బతికున్నాను’ అంటూ జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఓ మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులను మొరపెట్టుకుంది. ఐ.పోలవరం గ్రామంలో గురువారం జరిగిన ‘జన్మభూమి’ గ్రామసభలో ఈ సంఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పాటి సత్యవతి చనిపోయినట్టుగా అధికారులు రికార్డుల్లో చూపించి ఆమె పింఛను తొలగించారు. సత్యవతి భర్త సుబ్బారావు అనారోగ్యంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ 2010 మార్చి 23న మరణించాడు. ఈ మేరకు మరణ ధ్రువీకరణ పత్రాన్ని అప్పట్లో ఆమె అధికారుల వద్ద తీసుకుంది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా ఆమె వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ప్రభుత్వం గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పింఛను లబ్ధిదారుల సర్వే నిర్వహించింది. ఆ కమిటీ సభ్యులకు కూడా తన ఆవేదనను వెళ్లగక్కి, వితంతు పింఛను మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. ఆమె చనిపోయినట్టుగా రికార్డుల్లో ఉందని గుర్తించారు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి, పింఛను మంజూరు చేయలేమని దరఖాస్తును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ‘జన్మభూమి’ గ్రామసభలో ఆమె అధికారులు, ప్రజాప్రతినిధుల ముందు తన ఆవేదన వెళ్లగక్కింది. దీనిపై ఎమ్మెల్యే బుచ్చిబాబు, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్.. ఎంపీడీఓ, తహశీల్దార్, పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. ఆమె బతికుండగా చనిపోయినట్టు ఎలా నమోదు చేశారంటూ ప్రశ్నించారు. ఎంపీడీఓ అప్పారావు సమాధానమిస్తూ రికార్డుల నమోదులో తప్పిదం జరిగిందంటూ చెప్పారు. దీంతో ఎమ్మెల్యే , జెడ్పీటీసీ సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పిదాల వల్ల ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. ఇటువంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రికార్డులు సరిచేసి పింఛను అందేలా చర్యలు తీసుకొంటామని సత్యవతికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.