రబీకి పూర్తిగా నీళ్లందేనా?
జిల్లాలో అన్నదాతలు ప్రతి ఏటా రబీకి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మాత్రం నీరందించే స్తామంటూ ప్రకటనలు గుప్పిస్తూ ఆ తర్వాత కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నాయి. మళ్లీ రబీ సీజన్ ప్రారంభం కానుండడంతో రైతుల్లో నీటి కలవరం మొదలైంది. దీనికితోడు నత్తనడకన జరుగుతున్న డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వ అజమాయిషీ లోపించింది. దీంతో ఎన్ని రబీ సీజన్లు తాము పంటను కోల్పోవాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఐఏబీ సమావేశంలో ఎటువంటి నిర్ణయూలు వెలువడతాయోనని ఎదురుచూస్తున్నారు.
ఏలూరు : ఈ రబీ సీజన్‌కు పూర్తిస్థాయిలో టీడీపీ సర్కార్ నీరందిస్తుందా? ఇవ్వదా? అన్న ఆందోళన రైతన్నలను వేధిస్తోంది. ఈనెల ఒకటవ తేదీన జిల్లాలో జరిగిన జన్మభూమి- మా ఊరు సభలో రెండో పంటకు నీరు ఇస్తున్నాం... ఈ విషయంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ తరుణంలో సాగునీరు అందించడం, డెల్టా ఆధునీకరణ పనులు తిరిగి ప్రారంభించడం తదితర అంశాలతో కూడిన ఎజెండాతో ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఇరిగేషన్ సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సందర్భంలో జిల్లాలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తమ్మిలేరు నుంచి రబీకి సాగునీటి సరఫరా అనుమతించడం, పంటకాలం తర్వాత కాల్వలు కట్టేసే సమయం తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. నీటి సంఘాలు మనుగడలో లేని కారణంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా ఇరిగేషన్ ఎస్‌ఈ, ఇతర సంఘాలకు కూడా అధికారులే పర్సన్ ఇన్‌చార్జులుగా మూడేళ్ల కాలం నుంచి వ్యవహరిస్తున్నారు.
80 శాతం సాగునీటికే అవకాశం
జిల్లాలో ప్రతి రబీ సీజన్‌లో 4.60 లక్షల ఎకరాల వరి పంట సాగవుతుంది. ఈ ఏడాది కూడా పశ్చిమ డెల్టా కింద సాగునీటి లభ్యత తక్కువగా ఉండడంతో నూరుశాతం సాగునీరు అందించే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం రబీలో పూర్తిస్థాయిలో నీరిస్తే 42.58 టీఎంసీల నీటి నిల్వలు అవసరం. ప్రస్తుతం 34.42 టీఎంసీల లభ్యత ఉన్నట్టు అంచనా. సీలేరు నుంచి అదనంగా నీటిని గోదావరికి మళ్లించగలిగితే పంటల సాగు పూర్తి అయ్యే వీలుంది. అరుుతే సీలేరులో కూడా నీటిలభ్యత లేకపోవడంతో రబీలో 80 శాతం మాత్రం సాగుకు నీరివ్వగలమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నూరుశాతం సాగుకు అనుమతించిన పక్షంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో గోదావరి నీటినిల్వలు పడిపోతే పంట సంక్షోభంలో పడుతుంది. నాట్లు త్వరగా వేసి మార్చి 31వ తేదీలోగా సాగు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటే రబీ పంట గటెక్కే అవకాశాలున్నాయి. అరుుతే ఈ సందర్భంలో చేపల చెరువుల రైతులకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ అంశాలపై టీడీపీ పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.
డెల్టా ఆధునికీకరణపై చర్చ సాగేనా?
డెల్టా ఆధునికీకరణలో భాగంగా కాల్వలు, డ్రెయిన్ల ప్రక్షాళన 50 శాతం కూడా పూర్తికాలేదు. 2007లో రూ.1464 కోట్లతో ఈ పనులు చేపట్టగా ఇప్పటికి రూ.475.13 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. కాకరపర్రు, నర్సాపురం, బ్యాంకు కెనాల్, అత్తిలి, ఉండి కాల్వలతో పాటు యనమదుర్రు డ్రెయిన్ ఆధునికీకరణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. నాలుగున్నరేళ్ల నుంచి ప్రోగ్రెస్సివ్ కనస్ట్రక్షన్స్ లిమిటెడ్, ఐవీఆర్‌సీ కంపెనీ లిమిటెడ్ రూ.300 కోట్ల పనులను పెండింగ్‌లో ఉంచాయి. ఈ కంపెనీలపై ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు లేవు. ప్రోగ్రెస్సివ్ కనస్ట్రక్షన్ కంపెనీ రూ.130 కోట్ల పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందని, ఇది కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన కంపెనీ అని టీడీపీ ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేసినా ప్రయోజన ం శూన్యమే. గత రబీలో చేపట్టిన రూ.170 కోట్ల పనులు సైతం మందగమనంలోనే ఉన్నాయి. ఇటీవలే డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. జిల్లాలో గోదావరి, కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల్లో కొన్ని లోపాలున్నాయని, చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించి వాటిని పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. అయితే ప్రభుత్వం కొత్త పనులు ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. రబీ పంట కాలాల్లో రెండు లాంగ్ క్లోజర్లు అంటే 90 రోజులు కాలువలు మూసివేస్తే ఆధునికీకరణ పనులు పూర్తి అవుతాయని అధికారులు అంటున్నారు. ఇలా ఇస్తే రెండు సీజన్లలో రబీ పరంగా రూ.1600 కోట్ల పంట రైతులు నష్టపోతారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.