IAB
-
ఐఏబీపై హై 'డ్రామా'
తమ్ముళ్ల కుమ్ములాట ఆందోళనలో రైతులు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఐఏబీ సమావేశంపై అధికార పార్టీ నాయకుల వర్గపోరు హైడ్రామాను తలపిస్తోంది. సమావేశ తేదీలు నిర్ణయించే దగ్గర నుంచి ఈ డ్రామా వింత మలుపులు తిరుగుతోంది. ఇన్చార్జి మంత్రి , ఓ ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూర్ సభ్యుడు ఐఏబీ మీటింగ్‌ను వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తుండగా, జిల్లా మంత్రి , మరో ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐఏబీ మీటింగ్ తేదీని నిర్ణయించడంలో జాప్యం చేస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులు చేయకుండానే బిల్లులు, ఒక పనికి మూడు బిల్లులు పెట్టి నిధులను స్వాహా చేయాలని చూసే టీడీపీ ఒక వర్గం నాయకులకు కలెక్టర్ చెక్ పెట్టారు. కాలువలకు నీటిని వదలకముందు ఓ అండ్ ఎం పనుల పేరుతో నిధులను నొక్కేయాలని చూసే మరో వర్గం ఎలాగైనా పనులు చేయించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య అసంతృప్తి రోజు రోజుకు అధికమవుతోంది. జిల్లా స్థాయి నాయకులను మంత్రులు ప్రోత్సహించడంతో వర్గపోరు బాహాటమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే డెల్టా, నాన్‌డెల్టా అంశం తెరపైకి డెల్టా, నాన్‌డెల్టా అంశాన్ని అధికార పార్టీ నాయకులు కావాలనే తెరపైకి తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం మొదటి ప్రాధాన్యతగా పెన్నా డెల్టాప్రాంతానికి , రెండో దఫా కావలికెనాల్, నార్త్, సౌత్ కాలువల ఆయకట్టుకు, మూడో దఫాగా కనుపూరుకాలువకు ఇవ్వాల్సి ఉంది. అయితే కావాలనే సోమశిల జలాశయానికి 60 టీఎంసీల నీరుచేరిన తర్వాత జిల్లా అంతటికి అందిస్తామని తీర్మానిస్తామని అధికార పార్టీ నాయకులు చెప్పుకురావడం డ్రామాలో భాగమని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ పనుల్లోని అవినీతి ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకు టీడీపీలోని ఓ వర్గం నాయకులు ప్రయత్నిస్తుండడంతో ఐఏబీ జాప్యం జరుగుతోందని రైతులు వాదిస్తున్నారు. అక్టోబరులో ఉన్న నీటిలభ్యతను అనుసరించి ఐఏబీ సమావేశం జరపాల్సి ఉంది. అయితే ఉద్దేశపూర్వకంగా ఇరువర్గాలు కుమ్ములాడుకుంటూ రైతులను నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లివ్వండి చాలు ఓఅండ్ఎం పనులు నీటి సంఘాల యాజమాన్యాలకు వద్దు. కాలువ మరమ్మతులు ఇరిగేషన్ అధికారులతో చేయించి సకాలంలో నీళ్లివ్వాలని సర్వేపల్లి కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పడం అధికారపార్టీలోని కుమ్ములాటలను స్పష్టంగా బహిర్గతం చేసింది. ఐఏబీ సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నీటి తీరువా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఓఅండ్ఎం పనులకు నిధులు సమకూరే పరిస్థితి లేదు. పనులు చేయకుండానే నిధులు కొల్లగొట్టాలంటే ఉండే ఏకైక మార్గం నీరు–చెట్టు పనుల కింద ప్రతిపాదనలు పంపడమేనని రైతులు అంటున్నారు. ఐఏబీ సమావేశాన్ని జాప్యం చేసి కాలువల మరమ్మతుల పేరుతో నిధులను స్వాహాచేసేందుకు అధికారపార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా కలెక్టర్ దృష్టి సారించి ఐఏబీ నిర్వహించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
రేగుతున్న నీటి'మంటలు'
సోమిరెడ్డి ఆగ్రహం ఐఏబీపై రాజకీయం 20న కార్యాలయ దిగ్భందనం నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సకాలంలో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సిన నాయకులు ఆధిపత్య పోరుతో రైతులకు అన్యాయం చేయడాన్ని జిల్లా రైతులు జీర్ణించుకోలేకున్నారు. ఐఏబీ సమావేశం తేదీని నిర్ణయించడంలో రెండువర్గాలైన టీడీపీ నాయకులపై రైతులు మండిపడుతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి , ఎమ్మెల్సీలు ప్రకటించిన ఐఏబీ సమావేశం తేదీని రాజకీయ కారణాలతో వాయిదా వేశారు. ఆ తర్వాత మంత్రి నారాయణ 20వ తేదీన సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం ఇరిగేషన్ కార్యాలయంలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం నిర్వహణతీరు, రైతు నాయకులు, నీటి యాజమాన్య సంఘాల నాయకుల మధ్య జరిగిన వాగ్వాదం టీడీపీ నాయకులకు కొత్త తలనొప్పులు తెచ్చాయి. ఈ క్రమంలో పెన్నాడెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డికి టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తలంటారు. సాక్షాత్తు మంత్రి కొల్లు రవీంద్ర ముందు చోటుచేసుకున్న ఈ సంఘటనతో టీడీపీ ఇరువర్గాల నాయకులు నోళ్లు వెళ్లబెట్టారు. పెన్నా డెల్టా సంగతి చూసుకోకుండా, డెల్టా, నాన్ డెల్టాలకు నీటి విషయం నీ కెందుకని ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని సోమిరెడ్డి ప్రశ్నించారు రైతుల ఆగ్రహానికి గురికావద్దని సూచించారు. అధికారం ఉన్న పార్టీలోనే పొంతన లేని నిర్ణయాలు తీసుకుంటే రైతుల్లో చులకనభావం ఏర్పడుతుందని, రైతుల వ్యతిరేకతకు గురికావద్దని హితవు పలికారు. గత ఐఏబీ సమావేశం విషయంలో జరిగిన గందరగోళం దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన మైలేజీ రాకపోవడంపై ఎమ్మెల్సీసోమిరెడ్డి విలేకరుల ముందే ఎర్రంరెడ్డిపై విరుచుకుపటం అక్కడున్న వారిని విస్మయపరిచింది. నీరు లేదన్న సాకుతో.. సోమశిల జలాశయంలో నీరు లేదన్న సాకుతో ఐఏబీ మీటింగ్ జరపకుండా చూడాలని అధికారపార్టీలో ఓ వర్గం ప్రయత్నిస్తోంది. మరో వర్గం మంత్రి చెప్పినట్లుగా మీటింగ్ ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో గతంలో జరిగిన విధంగానే రైతులకు అన్యాయం జరుగుతుందని రైతుసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియమనిబంధనల ప్రకారం అక్టోబరు నెలలో నీళ్లున్నా లేకున్నా ఐఏబీ మీటింగ్ జరపాలన్న విషయాన్ని రైతులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం మంత్రి నారాయణ ప్రకటించినట్లుగా 20వ తేదీన ఐఏబీ మీటింగ్‌ను నిర్వహించకుంటే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతుసంక్షేమ సంఘ నాయకులు హెచ్చరిస్తున్నారు. వర్గపోరులో రైతులకు అన్యాయం జరిగే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మంత్రులు,ఎమ్మెల్సీల నిర్ణయాలకే విలువ లేకుండా పోతే రైతులు నీటి కోసం రోడ్లెక్కక తప్పదని వారి వాదన. కేవలం ఓ అండ్ ఎం. నీరు-చెట్టు నిధులు స్వాహా చేసేందుకే అధికారపార్టీ నాయకులు ఉత్సాహం చూపడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు నీటిని సకాలంలో అందించాలని వారు కోరుతున్నారు. -
ఆద్యంతం ఆగ్రహావేశం
– వాడీవేడిగా ఐఏబీ సమావేశం – శ్రీశైలం నీటిమట్టంపై చర్చ – సాగర్‌కు నీటి విడుదలపై ఎమ్మెల్యేల ఆగ్రహం – కృష్ణా జలాల్లో సీమ వాటాపై చర్చకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల పట్టు – సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించిన కలెక్టర్ – ఎమ్మెల్యేలు, రైతు సంఘాల మండిపాటు కర్నూలు సిటీ: ఆయకట్టుకు సాగునీటి కేటాయింపులు, వాటానీటి విడుదల, కృష్ణా, తుంగభద్ర జలాల్లో రావాల్సిన వాటా తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఐఏబీ సమావేశం ఆద్యంతం ఎమ్మెల్యేలు, సభ్యుల ఆగ్రహావేశాల మధ్య సాగింది. శ్రీశైలంలో నీటి చేరికలు మొదలైన వెంటనే సాగర్‌కు నీటి విడుదలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ గేయానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి రైతు సంఘాల నేతలు మద్దతు, అ«ధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం గొంతు కలపడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఐఏబీ చైర్మన్, కలెక్టర్ సీహెచ్.విజయమెహన్, ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, ఐజయ్య, గౌరు చరితా రెడ్డి, ఎస్వీ మెహన్‌రెడ్డి, భూమానాగిరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, జయ నాగేశ్వరరెడ్డి, కడప జిల్లా మైదుకూరు, కమలాపురం ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీం«ద్రానాథ్రెడ్డి, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ చైర్మన్లు కూమార్ గౌడు, జనార ్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎస్ఈ చంద్రశేఖర్‌రావు.. గత తీర్మానాలపై సమావేశాన్ని మొదలు పెట్టారు. బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని గోరుకల్లు, ఆవుకు రిజర్వాయర్ల ప్రస్థావనఅజెండాలో లేకపోవడంపై ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. అజెండాలో లేకుండా మీటింగ్‌కు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. తెలుగుగంగా నుంచి కడప జిల్లాకు రావాల్సిన వాటా? ఈ ఏడాది నీటి కేటాయింపుతోపాటు కాల్వ లైనింగ్ పూర్తి చేయకపోవడంపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. 874 అడుగుల నీటిమట్టంపై తీర్మానం.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి చేరికలు ప్రారంభమైన మరుక్షణమే ఈ ప్రాంతంలోనీ తాగునీటి అవసరాలను కాదని సాగర్‌కు నీరెలా తీసుకపోతారంటూ ఎమ్మెల్సీ గేయానంద్ అధికారులను నిలదీశారు. కనీస నీటిమట్టానికి సంబంధించి 69, 107 జీఓలపై వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆయన చర్చకు పట్టుబట్టారు. అది సర్కారు నిర్ణయమని ఎస్ఈ పేర్కొనడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రతిపక్షంతో గొంతు కలిపారు. శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టం మెయిన్‌టెన్ చేయడంతోపాటు ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు 874 అడుగులకుపైగా ఉంటేనే సాగర్‌కు నీటిని విడుదల చేయాలని తీర్మానించారు. కృష్ణా జలాల్లో సీమకు వాటా మేరకు నీరివ్వాలని, తెలుగుగంగ నుంచి కడప జిల్లా బ్రహ్మసాగర్‌కు 12 టీఎంసీలు విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా వెలుగోడులో నీటి మట్టం పెరిగిన వెంటనే నీటిని పెంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. పట్టిసీమపై ఉన్న శ్రద్ధ.. సీమ ప్రాజెక్టులపై ఏదీ.. కృష్ణాడెల్టాకు గోదావరి జలాలు తెచ్చేందుకు చేపట్టిన పట్టిసీమను ఏడాదిలోగా పూర్తి చేస్తే...రాయల సీమ ప్రాజెక్టులు చేపట్టి దశాబ్దాలు గడుస్తున్నా జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు సర్కారుపై ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు లబ్ధీ చేకూర్చేందుకే ఇలాచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పందిస్తూ పార్టీలకు అతీతంగా సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రతిపక్ష పాత్రలో అధికార పక్షం ఐఏబీ సమావేశంలో ఆయకట్టు సమస్యలపై అధికాపార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ అసమర్థత, అధికారుల నిర్లక్ష్యంపై దుమ్మెత్తిపోశారు. ఇంకెన్నాళ్లు రైతులతో ఆడుకుంటారంటూ మండిపడ్డారు. ఎస్సార్బీసీకి నీరిస్తామని మంత్రి ఇటీవలే ప్రకటించడంతో రైతులు నారుమళ్లు పోసుకున్నారని, ఇప్పటికీ ప్రధాన కాల్వకు నీరు విడుదల చేసే పరిస్థితి లేకపోతే మీరెందుకంటూ ఎమ్మెల్యే బీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీ బోర్డు అధికారులను ఐఏబీకి పిలవకపోవడం, ప్రాజెక్టు కమిటీలు, నీటి సంఘాల గురించి పట్టించుకోకపోవడంపై ఎల్లెల్సీ చైర్మన్ కుమార్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలోనే వెళ్లిపోయిన కలెక్టర్ సాగునీటి కాల్వలకు నీటి విడుదల షెడ్యూల్, కేటాయింపులపై చర్చించి తీసుకునేందుకు ఉద్దేశించిన ఐఏబీ సమావేశం పూర్తికాకుండానే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఉందంటూ కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యేలు, రైతు సంఘాల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ డౌన్...డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఇంజనీర్లతో వాదనకు దిగారు. -
అసాధ్యమని తెలిసినా..అదే పల్లవి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : డెల్టా కాలువలను మార్చి 31నాటికి మూసివేయడం అసాధ్యమని తెలిసి కూడా అధికారులు పాత పల్లవే పాడుతున్నారు. డెల్టాలో రబీ వరిసాగులో అసాధారణ జాప్యం జరిగినందున డెల్టా కాలువలకు ఏప్రిల్ 15 తరువాతా నీరు ఇవ్వాలి. ఇది తెలిసీ మూసివేతకు మార్చి 31 గడువు పెట్టడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సోమవారం రాత్రి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కాలువల మూసివేత గడువుపై తుది నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది కాకినాడలో జరిగిన ఇరిగేషన్ ఎడ్వయిజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో మార్చి 31 నాటికి కాలువలు మూసివేయాలని, దీనికితగ్గట్టుగా రబీని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డిసెంబరు నెలాఖరుకు నాట్లు పూర్తికాని చేలల్లో వరి కాకుండా స్వల్పకాలిక, ఆరుతడి పంటలు చేపట్టేలా రైతులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే సకాలంలో నీరందించడంలో ఇరిగేషన్ శాఖాధికారులు, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారు. తూర్పు, మధ్య డెల్టాల్లోని శివారుకు నీరందక సాగు ఆలస్యమైంది. తూర్పు డెల్టాలోని కాకినాడ, కరప, మధ్యడెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు సబ్ డివిజన్లలోని శివారు ఆయకట్టులో సంక్రాంతి తరువాత, ఫిబ్రవరి మొదటి వారంలో నాట్లు పడ్డాయి. ఈ ప్రాంతంలో చేలు ఇంకా పాలుపోసుకునే దశకు రావాలంటే మరో 20, 30 రోజులు పడుతుంది. ఇక్కడ వరి కోతలు ఏప్రిల్ నెలాఖరు వరకూ పూర్తి కావు. వీటికి ఏప్రిల్ 15 వరకూ నీరందించాలి. దీనిని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు.అయినా కలెక్టర్ సమీక్షా సమావేశంలో వారు నోరు మెదపలేదు. మార్చి నెలాఖరుకు కాలువలు మూసివేయాలని నిర్ణయించారు. మరోసారి క్షేత్రస్థాయిలో సాగు పరిస్థితిని పరిశీ లించి, తుది నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్చి 31తో కాలువల మూసివేత : కలెక్టర్ మరమ్మతుల కోసం మార్చి 31 నుంచి గోదావరి డెల్టా కాలువలు మూసివేస్తున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కాలువల మరమ్మతులపై ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సోమవారం రాత్రి ఆయన సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్‌కు మార్చి 31 వరకూ, వచ్చే ఖరీఫ్‌కు జూన్ 15 నుంచి నీరందించాలని, మూసివేత సమయంలో కాలువల ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల అధికారులకు కలెక్టర్ సూచించారు. కాలువల మరమ్మతులను నిర్ణీతవ్యవధిలో పూర్తి చేయాలని, దీనికి రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని అన్నారు. కాలువలు మూసివేసే సమయంలో పంటలకు నష్టం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖ ధవళ్వేశరం సర్కిల్ ఎస్ఈ పి.సుగుణాకరరావు మాట్లాడుతూ, ఆధునికీకరణ పనులు చేపట్టడానికి క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉన్నా, ఆ పరిస్థితి లేనందున కాలువలు మూసివేసే సమయంలో దశలవారీగా మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. పాత కట్టడాలు పాడవకుండా కాలువలు మరమ్మతులు చేపట్టాలని సూచించారని చెప్పారు. -
రబీకి పూర్తిగా నీళ్లందేనా?
జిల్లాలో అన్నదాతలు ప్రతి ఏటా రబీకి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మాత్రం నీరందించే స్తామంటూ ప్రకటనలు గుప్పిస్తూ ఆ తర్వాత కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నాయి. మళ్లీ రబీ సీజన్ ప్రారంభం కానుండడంతో రైతుల్లో నీటి కలవరం మొదలైంది. దీనికితోడు నత్తనడకన జరుగుతున్న డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వ అజమాయిషీ లోపించింది. దీంతో ఎన్ని రబీ సీజన్లు తాము పంటను కోల్పోవాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఐఏబీ సమావేశంలో ఎటువంటి నిర్ణయూలు వెలువడతాయోనని ఎదురుచూస్తున్నారు. ఏలూరు : ఈ రబీ సీజన్‌కు పూర్తిస్థాయిలో టీడీపీ సర్కార్ నీరందిస్తుందా? ఇవ్వదా? అన్న ఆందోళన రైతన్నలను వేధిస్తోంది. ఈనెల ఒకటవ తేదీన జిల్లాలో జరిగిన జన్మభూమి- మా ఊరు సభలో రెండో పంటకు నీరు ఇస్తున్నాం... ఈ విషయంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ తరుణంలో సాగునీరు అందించడం, డెల్టా ఆధునీకరణ పనులు తిరిగి ప్రారంభించడం తదితర అంశాలతో కూడిన ఎజెండాతో ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఇరిగేషన్ సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సందర్భంలో జిల్లాలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తమ్మిలేరు నుంచి రబీకి సాగునీటి సరఫరా అనుమతించడం, పంటకాలం తర్వాత కాల్వలు కట్టేసే సమయం తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. నీటి సంఘాలు మనుగడలో లేని కారణంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా ఇరిగేషన్ ఎస్ఈ, ఇతర సంఘాలకు కూడా అధికారులే పర్సన్ ఇన్చార్జులుగా మూడేళ్ల కాలం నుంచి వ్యవహరిస్తున్నారు. 80 శాతం సాగునీటికే అవకాశం జిల్లాలో ప్రతి రబీ సీజన్లో 4.60 లక్షల ఎకరాల వరి పంట సాగవుతుంది. ఈ ఏడాది కూడా పశ్చిమ డెల్టా కింద సాగునీటి లభ్యత తక్కువగా ఉండడంతో నూరుశాతం సాగునీరు అందించే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం రబీలో పూర్తిస్థాయిలో నీరిస్తే 42.58 టీఎంసీల నీటి నిల్వలు అవసరం. ప్రస్తుతం 34.42 టీఎంసీల లభ్యత ఉన్నట్టు అంచనా. సీలేరు నుంచి అదనంగా నీటిని గోదావరికి మళ్లించగలిగితే పంటల సాగు పూర్తి అయ్యే వీలుంది. అరుుతే సీలేరులో కూడా నీటిలభ్యత లేకపోవడంతో రబీలో 80 శాతం మాత్రం సాగుకు నీరివ్వగలమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నూరుశాతం సాగుకు అనుమతించిన పక్షంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో గోదావరి నీటినిల్వలు పడిపోతే పంట సంక్షోభంలో పడుతుంది. నాట్లు త్వరగా వేసి మార్చి 31వ తేదీలోగా సాగు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటే రబీ పంట గటెక్కే అవకాశాలున్నాయి. అరుుతే ఈ సందర్భంలో చేపల చెరువుల రైతులకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ అంశాలపై టీడీపీ పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. డెల్టా ఆధునికీకరణపై చర్చ సాగేనా? డెల్టా ఆధునికీకరణలో భాగంగా కాల్వలు, డ్రెయిన్ల ప్రక్షాళన 50 శాతం కూడా పూర్తికాలేదు. 2007లో రూ.1464 కోట్లతో ఈ పనులు చేపట్టగా ఇప్పటికి రూ.475.13 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. కాకరపర్రు, నర్సాపురం, బ్యాంకు కెనాల్, అత్తిలి, ఉండి కాల్వలతో పాటు యనమదుర్రు డ్రెయిన్ ఆధునికీకరణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. నాలుగున్నరేళ్ల నుంచి ప్రోగ్రెస్సివ్ కనస్ట్రక్షన్స్ లిమిటెడ్, ఐవీఆర్సీ కంపెనీ లిమిటెడ్ రూ.300 కోట్ల పనులను పెండింగ్‌లో ఉంచాయి. ఈ కంపెనీలపై ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు లేవు. ప్రోగ్రెస్సివ్ కనస్ట్రక్షన్ కంపెనీ రూ.130 కోట్ల పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందని, ఇది కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన కంపెనీ అని టీడీపీ ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేసినా ప్రయోజన ం శూన్యమే. గత రబీలో చేపట్టిన రూ.170 కోట్ల పనులు సైతం మందగమనంలోనే ఉన్నాయి. ఇటీవలే డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. జిల్లాలో గోదావరి, కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల్లో కొన్ని లోపాలున్నాయని, చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించి వాటిని పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. అయితే ప్రభుత్వం కొత్త పనులు ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. రబీ పంట కాలాల్లో రెండు లాంగ్ క్లోజర్లు అంటే 90 రోజులు కాలువలు మూసివేస్తే ఆధునికీకరణ పనులు పూర్తి అవుతాయని అధికారులు అంటున్నారు. ఇలా ఇస్తే రెండు సీజన్లలో రబీ పరంగా రూ.1600 కోట్ల పంట రైతులు నష్టపోతారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
ఆయకట్టంతటికీ అనుమతి
ఖరీఫ్‌లో దిగుబడులు రాక, రబీ ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్న డెల్టా రైతులకు శుభవార్త. రబీలో జిల్లాలోని మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలని ఐఏబీ తీర్మానించింది. అయితే మార్చి 31 నాటికి సాగు పూర్తి కావాలని నిర్ణయించింది. నీటి లభ్యతను బట్టి ఆయకట్టు కుదింపు అనివార్యమన్న అధికారుల మాటను ప్రజాప్రతినిధులు తిరస్కరించారు. కాకినాడ/ అమలాపురం :సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన శుక్రవారం జరిగింది. శాసనమండలిలో విప్ కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు), జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు హరిబాబు, ఎస్ఈ సుగుణాకరరావు, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, నీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఎస్ఈ సుగుణాకరరావు గోదావరిలో నీటి లభ్యతను వివరించారు. రబీకి సుమారు 83 టీఎంసీలు (ఒక టీఎంసీ 10,830 ఎకరాలు) అవసరం కాగా, కేవలం 67 టీఎంసీలే అందుబాటులో ఉంటుందన్నారు. కేవలం 80 శాతం ఆయకట్టుకు మాత్రమే నీరిస్తామని, దీని వల్ల జిల్లాలోని తూర్పు, మధ్యడెల్టాల్లో 87,313 ఎకరాల్లో సాగు ఉండదని చెప్పారు. జోన్లవారీగా ఆయకట్టును ఎంపిక (శుక్రవారం సంచికలో ‘30 శాతం మూనకు దూరం!’ శీర్షికన వచ్చిన కథనంలో అధికారుల యోచన ఇదేనని ‘సాక్షి’ పేర్కొంది) చేస్తామన్నారు. అయితే అభ్యంతరం తెలిపిన ప్రజాప్రతినిధులు మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలన్నారు. 16 టీఎంసీల లోటు భర్తీకి అవసరమైన చర్యల్ని వివరిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి నిధులమంజూరుకు కృషి చేస్తామన్నారు. పాత లెక్కలు మానండి : వరుపుల, చిర్ల పాతకాలం నాటి లెక్కలు మాని కొత్త లెక్కలు వేస్తే మొత్తం ఆయకట్టుకు నీరివ్వొచ్చని వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ప్రత్తిపాడు, కొత్తపేట ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా రైతులు ఖరీఫ్‌లో నష్టపోయినందున గోదావరి డెల్టా, ఏలేరు, -
సీఎంపై ఒత్తిడి తెద్దాం
- కోటా మేరకు నీటి కోసం అవసరమైతే ప్రధానిని కలవాలని నిర్ణయం - వాడివేడిగా సాగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానం - పీబీసీకి ఏటా అన్యాయమేనని వైఎస్ఆర్ జిల్లా ప్రజాప్రతినిధుల ఆవేదన - చిత్రావతి డ్యాం పగులగొడితేనే తమకు నీరొస్తుందన్న ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి - మీడియా దృష్టిని ఆకర్షించేందుకు అలా మాట్లాడొద్దంటూ చీఫ్‌విప్ కాలవ చురక సాక్షి, అనంతపురం : రాయలసీమ పరిధిలోని అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలను మెరుగు పరుచు కునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. తుంగభద్ర జలాశయం, అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా పథకం ద్వారా కోటా మేరకు నీటిని తీసుకువచ్చే విషయంపై సీఎం చంద్రబాబు నాయుడును కలిసేందుకు తీర్మానం చేశారు. అవసరమైతే ప్రధాన మంత్రినీ కలుద్దామని నిర్ణయించారు. ఆగస్టు 18 నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎంతో చర్చించేందుకు హెచ్ఎల్సీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలంతా పార్టీలకు అతీతంగా కదలి రావాలని నిర్ణయించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్య రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం (ఐఏబీ)లో మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు మాట్లాడారు. పీబీసీకి ప్రతి సంవత్సరమూ అన్యాయమే వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, మైలవరం ప్రాంతాలకు ఇస్తున్న కోటాలో అన్యాయం జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతాలకు సాగునీరు రావడం లేదని, ఫలితంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మైలవరం రిజర్వాయర్‌కు ఇచ్చే కోటాను పెన్నానది ద్వారా ఇవ్వడం వల్ల ఒక్క చుక్క కూడా నీరు అందడంలేదన్నారు. ఆ నీటిని కూడా పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కే విడుదల చేయాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం చెపుతూ.. సిస్టంను మార్చకూడదని, ఎప్పటిలాగే పెన్నా నది మీదుగానే నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. ‘పేరుకే సీబీఆర్ (చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ఉంది.. మాకేం లాభం లేదు.. గడిచిన పదేళ్లుగా పీబీసీకి చుక్క నీరు రావడం లేదు.. ఫలితంగా పీబీసీ పరిధిలోని చీని, నిమ్మ చెట్లు ఎండిపోతున్నాయి.. అసలు సీబీఆర్ ఎందుకు.. దాన్ని పగులగొడితేనే మాకు న్యాయం జరుగుతుంద’ంటూ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కలుగచేసుకుని.. ‘సతీష్ రెడ్డి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు అలా మాట్లాడుతున్నాడు. ఈ పద్ధతి ఏమీ బాగోలేదు. నేను రాయదుర్గం ఎమ్మెల్యేను. నేను ఎగువ ప్రాంతంలో ఉన్నాను. మా ప్రాంతం నుంచే నీళ్లు కిందకు రావాలి. మేము సర్దుకుపోతున్నాము. ఇక్కడ ఎవరూ మీ నీళ్లు తాగడం లేదు. నీటి లభ్యత తక్కువగా ఉంటోంది. అసలు హెచ్ఎల్సీకి నిర్ణయించిన మేరకు కోటా రావడం లేదు. నీళ్లు.. మాకు.. మీకు అని గొడవపడితే ఏం లాభం? అందరం కలసి సీఎం వద్దకు వెళ్లి హెచ్ఎల్సీకీ కేటాయింపులు పెంచుకోవడానికి కృషి చేద్దాం.. అప్పుడు అందరం సమానంగా నీటిని వినియోగించుకోవచ్చు’ అని అన్నారు. ‘చిత్రావతికి 50 శాతం నీళ్లు వచ్చినా నీళ్లు కిందకు వదలరు.. అడిగితే ఉన్నవి తాగునీటికి అని చెబుతారు.. చివరకు మాకు నీళ్లు లేకుండా చేస్తారు.. పదేళ్లుగా మా రాత ఇంతేలే అని మా రైతులు మదనపడుతున్నారు. అసలు సీబీఆర్ నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు ఎన్ని టీఎంసీలు ఇస్తారో తేల్చి చెప్పండి ’అరి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడిగారు. ఈ సారి కూడా చిత్రావతికి తొలుత నీటిని విడుదల చేస్తామని, హెచ్ఎల్సీ ఎస్ఈ వాణినాథ్రెడ్డి సమావేశంలో సూచించారు. ఈ సందర్భంగా ‘అన్ని ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బంది ఉంది.. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిత్రావతికి నీటిని విడుదల చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. అలా కాదని చిత్రావతికి మాత్రమే నీరు విడుదల చేస్తే ఒప్పుకునేది లేదు’ అని జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు పేర్కొన్నారు. తుంగభద్ర నుంచి వచ్చే నీటి కోటా ఏమాత్రం సరిపోదు.. హంద్రీ-నీవా నుంచి పది టీఎంసీల కృష్ణా జలాలు జిల్లాకు తీసుకువస్తే.. జిల్లా అవసరాలు తీరుతాయంటూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఐఏబీ దృష్టికి తీసుకువచ్చారు. హంద్రీ-నీవా కాలువ నుంచి రాంపురం వద్ద స్లూయిస్ ఏర్పాటు చేస్తే పీఏబీఆర్‌కు హంద్రీ-నీవా నీటిని తీసుకురావచ్చన్నారు. గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ) ఆయకట్టు కింద ఉన్న వరి పంట పూర్తిగా ఎండిపోతోందని, జీబీసీకి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. ఇంతలో కలుగజేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి.. ‘నీ నియోజకవర్గంలోని కొనకొండ్ల సమీపంలో నిర్మిస్తున్న వంతెన వద్ద ఉన్న పైపులు హంద్రీ-నీవా నీటిని ముందుకు పోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి.. మొదట నీవు ప్రజలతో మాట్లాడి వాటిని తొలగిస్తే.. పది టీఎంసీలు కాదు.. 15 టీఎంసీలు తీసుకువస్తామ’ని సూచించారు. స్పందించిన విశ్వేశ్వరరెడ్డి మీరు నాతో కలసి వస్తే తప్పకుండా ప్రజలను ఒప్పిస్తానని, మా ప్రాంత ప్రజలకు కావాల్సింది సాగు, తాగు నీరు అని అన్నారు. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి మాట్లాడుతూ.. పీఏబీఆర్ కుడి కాలువ నుంచి రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలోని 49 చెరువులకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఇంతలో ‘ఆవులు.. ఆవులు కొట్లాడితే దూడలకు కాళ్లు విరుగుతాయన్నట్లు.. లావోళ్లు.. లావోళ్లు కొట్లాడుకుంటూ శింగనమల నియోజకవర్గాన్ని మరిచిపోతున్నారు. పీబీసీ, సీబీఆర్‌కు నీరు వెళ్లాలంటే శింగనమల నియోజకవర్గం మీదుగానే వెళ్లాలి.. అలాంటిది మా నియోజకవర్గంలో చెరువుల గురించి ఏ ఒక్కరూ మాట్లాడడడం లేదు. ఇది బాధాకరం. మొదట శింగనమల చెరువుతో పాటు బుక్కరాయసముద్రం చెరువుకు నీళ్లిచ్చిన తరువాత మిగతా నీళ్లు మీరు తీసుకుపోండి’ అంటూ ఎమ్మెల్సీ శమంతకమని డిమాండ్ చేయగా, విప్ యామిని బాల సైతం అందుకు మద్దతు పలికారు. హంద్రీ-నీవా కాలువ పనుల్లో భాగంగా 162.5 కిలోమీటరు వద్ద కాలువ కాంట్రాక్టు పనులు సీఎం రమేష్ చేస్తున్నారని, ఆ పనులు ముందుకు సాగడం లేదని, అవి త్వరగా పూర్తయితే జిల్లాకు 15 టీఎంసీల కృష్ణా జలాలు తీసుకువచ్చే అవకాశం ఉందని హంద్రీ-నీవా డీఈ ఐఏబీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ.. ‘మొదటి దశ పనులు సరిగా చేయలేదు. రెండో దశ పనులు పూర్తి చేయాలంటే రూ.1500 కోట్లు కావాలి. వాటిని తీసుకువచ్చి హంద్రీ-నీవాను పూర్తి చేసే సంకల్పం మీకుందా’ అంటూ టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. హంద్రీ-నీవా పనులు పూర్తి చేయడంలో మీ వైఫల్యాలు చాలా ఉన్నాయి.. వాటిని ఒప్పుకోకుండా కాంట్రాక్టర్ల మీద నెపం నెడితే ఎలా అంటూ కాలవ శ్రీనివాసులు హంద్రీ-నీవా డీఈకి చురకలంటించారు. కాగా దక్షిణ ప్రాంతంలో ఉన్న మా రైతుల పరిస్థితిని కాస్త గమనించండి.. హంద్రీ-నీవా పనులు త్వరగా పూర్తి చేసి దక్షిణ ప్రాంతంలో ఉన్న మడకశిర ప్రాంతానికి నీళ్లు ఇవ్వండి అంటూ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఐఏబీ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే ఉన్నం మద్దతు పలికారు. ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు నీటిని విడుదల చేసే సమయంలో ఎక్కువ శాతం అక్రమ అయకట్టు దారులు నీటిని తీసుకెళ్తున్నారని, దీనిని అరికట్టాలని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే జయరాం సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ఈరన్న, మెట్టు గోవిందరెడ్డి, జెడ్పీ చైర్మన్ చమన్‌సాహెబ్ పాల్గొన్నారు. -
ఇన్సైడర్ల పరువు తీయాలి
బెంగళూరు: ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అంతర్జాతీయ అడ్వైజరీ బోర్డు సూచించింది. ఇందులో భాగంగా ఈ నేరాలకు పాల్పడే వారి పరువు తీసే విధంగా కఠినమైన చర్యలు (నేమింగ్, షేమింగ్) తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అంతర్జాతీయ అడ్వైజరీ బోర్డు సూచించింది. ఇలాంటి కేసుల్లో ఎలాంటి సెటిల్మెంట్కి అంగీకరించరాదని, భారీ పెనాల్టీలు విధించాలని పేర్కొంది. భారీ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులను సెబీ వెబ్సైట్లో ప్రత్యేక సెక్షన్లో పొందుపర్చాలని తెలిపింది. అలాగే, ఇన్సైడర్ ట్రేడింగ్ మోసాల్లో నష్టపోయిన బాధితులకు తగు స్థాయిలో పరిహారం లభించేలా నిబంధనలు రూపొందించాలని బోర్డు తెలిపింది. అన్ని కేసులకూ ఒకే ఫార్ములా రీతిలో కాకుండా ఆయా సందర్భాలను బట్టి పరిహారం పరిమాణాన్ని నిర్ణయించాలని అభిప్రాయపడింది. రెండు రోజుల పాటు జరిగిన సమావేశం అనంతరం ఐఏబీ ఈ మేరకు సూచనలు చేసింది. -
నేడు ఐఏబీ
సాక్షి, నెల్లూరు: ఎట్టకేలకు ఐఏబీ (సాగునీటి సలహా మండలి) సమావేశం సోమవారం ఉదయం 11:30కు కలెక్టరేట్లోని గోల్డెన్ జూబ్లీ సమావేశ మంది రంలో జరగనుంది. కలెక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, రైతుసంఘాల నేతలు పాల్గొననున్నారు. సోమశిల పరిధిలో పూర్తి ఆయకట్టుకు నీళ్లివ్వనున్నట్టు ఇప్పటికే ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు ప్రకటించారు. సమావేశంలో చర్చించిన అనంతరం నీటి విడుదల తేదీని వెల్లడిస్తారు. నీటి విడుదలతో పాటు ప్రధానంగా కండలేరు నుంచి ముఖ్యమంత్రి కిరణ్ సొంతజిల్లా చిత్తూరుకు 10 టీఎంసీల నీటి తరలింపునకు విడుదలైన జీఓ విషయమై సమావేశంలో లేవనెత్తనున్నారు. ఈ విషయమై ప్రతిపక్షాలు మంత్రి ఆనంను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఏడాదికేడాదికి వర్షాభావ పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల పరిధిలో ఒక్కపంటకు కూడా సక్రమంగా నీళ్లు దక్కే పరిస్థితి లేకుండా పోతోంది. గత ఏడా ది నీళ్లు లేక జిల్లాలోని మొత్తం 10 లక్షల ఆయకట్టుకు గాను 3 లక్షల ఎకరాలు కూడా సాగులోకి రాలేదు. ఏడాదికేడాది డెల్టా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. కర్ణాటకలో వర్షాలు కురిసి కృష్ణా జలాలు ఎప్పుడొస్తాయో తెలియని స్థితిలో అన్నదాతలు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్టు కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు నీరు తీసుకెళ్లడం రైతాంగం కడుపు కొట్టడమే అవుతుంది. దీనిపై జిల్లా రైతాంగంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఒక టీఎంసీ నీళ్లు కూడా చిత్తూరుకు ఇచ్చేది లే దని ప్రకటనలు గుప్పించి ప్రగల్భాలు పలికి నానా హం గామా చేసిన ఆనం సోదరులు ఇప్పుడు 10 టీఎంసీలు నీళ్ల తరలింపునకు జీఓ వచ్చినా నోరుమెదపక పోవడంపై ప్రజాప్రతినిధులు, రైతుసంఘాలు,ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఐఏబీ సమావేశంలో నిలదీయనున్నారు. కండలేరు పరిధిలో అధికారికంగా 2.7 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అనధికారికంగా 3 లక్షల ఎకరాలకు పైనే ఉంది. కండలేరులో పూర్తిస్థాయిలో నీరు లేనందున కొంతమేర మాత్రమే ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో తమ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లివ్వాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేయనున్నారు. సోమశిల పరిధిలో ప్రస్తు తం జరుగుతున్న సాగునీటి ఆధునికీకరణ పనులు మందకొడిగానే కాక నాసిరకంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం, కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అక్రమాలపై ఐఏబీలో లేవనెత్తనున్నారు. అలాగే నీటి విడుదల నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని ప్రతి నిధులు, రైతుసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేయనున్నారు. మొత్తం మీద ఐఏబీ వాడీవేడిగా జరగనుంది.