నేడు ఐఏబీ
Published Mon, Oct 21 2013 3:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
సాక్షి, నెల్లూరు: ఎట్టకేలకు ఐఏబీ (సాగునీటి సలహా మండలి) సమావేశం సోమవారం ఉదయం 11:30కు కలెక్టరేట్‌లోని గోల్డెన్ జూబ్లీ సమావేశ మంది రంలో జరగనుంది. కలెక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, రైతుసంఘాల నేతలు పాల్గొననున్నారు. సోమశిల పరిధిలో పూర్తి ఆయకట్టుకు నీళ్లివ్వనున్నట్టు ఇప్పటికే ఇరిగేషన్ ఎస్‌ఈ కోటేశ్వరరావు ప్రకటించారు.
సమావేశంలో చర్చించిన అనంతరం నీటి విడుదల తేదీని వెల్లడిస్తారు. నీటి విడుదలతో పాటు ప్రధానంగా కండలేరు నుంచి ముఖ్యమంత్రి కిరణ్ సొంతజిల్లా చిత్తూరుకు 10 టీఎంసీల నీటి తరలింపునకు విడుదలైన జీఓ విషయమై సమావేశంలో లేవనెత్తనున్నారు. ఈ విషయమై ప్రతిపక్షాలు మంత్రి ఆనంను నిలదీసేందుకు సిద్ధమయ్యారు.
ఏడాదికేడాదికి వర్షాభావ పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల పరిధిలో ఒక్కపంటకు కూడా సక్రమంగా నీళ్లు దక్కే పరిస్థితి లేకుండా పోతోంది. గత ఏడా ది నీళ్లు లేక జిల్లాలోని మొత్తం 10 లక్షల ఆయకట్టుకు గాను 3 లక్షల ఎకరాలు కూడా సాగులోకి రాలేదు. ఏడాదికేడాది డెల్టా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. కర్ణాటకలో వర్షాలు కురిసి కృష్ణా జలాలు ఎప్పుడొస్తాయో తెలియని స్థితిలో అన్నదాతలు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్టు కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు నీరు తీసుకెళ్లడం రైతాంగం కడుపు కొట్టడమే అవుతుంది. దీనిపై జిల్లా రైతాంగంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఒక టీఎంసీ నీళ్లు కూడా చిత్తూరుకు ఇచ్చేది లే దని ప్రకటనలు గుప్పించి ప్రగల్భాలు పలికి నానా హం గామా చేసిన ఆనం సోదరులు ఇప్పుడు 10 టీఎంసీలు నీళ్ల తరలింపునకు జీఓ వచ్చినా నోరుమెదపక పోవడంపై ప్రజాప్రతినిధులు, రైతుసంఘాలు,ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఐఏబీ సమావేశంలో నిలదీయనున్నారు. కండలేరు పరిధిలో అధికారికంగా 2.7 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అనధికారికంగా 3 లక్షల ఎకరాలకు పైనే ఉంది. కండలేరులో పూర్తిస్థాయిలో నీరు లేనందున కొంతమేర మాత్రమే ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
దీంతో తమ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లివ్వాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేయనున్నారు. సోమశిల పరిధిలో ప్రస్తు తం జరుగుతున్న సాగునీటి ఆధునికీకరణ పనులు మందకొడిగానే కాక నాసిరకంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం, కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అక్రమాలపై ఐఏబీలో లేవనెత్తనున్నారు. అలాగే నీటి విడుదల నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని ప్రతి నిధులు, రైతుసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేయనున్నారు. మొత్తం మీద ఐఏబీ వాడీవేడిగా జరగనుంది.
Advertisement