Golden Jubilee
-
అన్నపూర్ణ స్టాఫ్‌ని ఫ్యామిలీలా భావిస్తాం: నాగార్జున
‘‘రోడ్లు కూడా లేని రోజుల్లో నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్ వచ్చి, ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోని ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు... అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నూతన నటీనటులు, కొత్త డైరెక్టర్స్‌కు ఉపాధి కల్పించింది. ఎంతోమందికి ఏఎన్‌ఆర్‌గారు స్ఫూర్తి’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లయిన సందర్భంగా నాగార్జున ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడాది మొదలైంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనక మా అమ్మ అన్నపూర్ణగారు ఉన్నారనేది ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. ఈ స్టూడియోకి వచ్చినప్పుడల్లా అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనిపిస్తుంటుంది. అన్నపూర్ణ స్టాఫ్‌ని మేం ఫ్యామిలీలా భావిస్తాం. స్టూడియో ఇంత కళకళలాడుతోందంటే దానికి అన్నపూర్ణ ఫ్యామిలీనే కారణం. ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మానాన్నలు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి పాజిటివ్‌గా మాట్లాడతారు. ఆయన జీవితం పెద్ద స్ఫూర్తి అనడం హ్యాపీగా ఉంటుంది’’ అన్నారు. -
సాయికుమార్ గోల్డెన్ జూబ్లీ
‘‘కనిపించే ఈ మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా..పోలీస్...’ అనే డైలాగ్ వింటే... వెంటనే సాయికుమార్ అని ఆడియన్స్ చెప్పేస్తారు. అంటూ ‘పోలీస్ స్టోరీ’లో ఆయన తనదైన శైలిలో పవర్‌ఫుల్‌గా చెప్పి, ఆకట్టుకున్నారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సాయికుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సాయికుమార్ గురించి కొన్ని విశేషాలు...1972 అక్టోబరు 20న ‘మయసభ’ అనే నాటకంలో దుర్యోధనుడిపాత్ర కోసం తొలిసారి మేకప్ వేసుకున్నారు సాయికుమార్. ఆయన వెండితెర ప్రయాణం ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో జరిగింది. బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయికుమార్ బాలనటుడిగా చేశారు. ఈ మూవీ 1975 జనవరి 9న రిలీజైంది. గురువారంతో (జనవరి 9) వెండితెరపై సాయికుమార్ యాభైఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.ముందు డబ్బింగ్ ఆర్టిస్టుగానే కెరీర్ మొదలుపెట్టారు సాయికుమార్. ఆ తర్వాత ‘ఛాలెంజ్, కలికాలం, మేజర్ చంద్రకాంత్’ వంటి తెలుగు సినిమాల్లో నటిస్తూనే, ‘తయ్యల్క్కారన్, కావల్ గీతమ్’ వంటి తమిళ సినిమాల్లోనూ నటించారు. 1996లో సాయికుమార్ హీరోగా వచ్చిన కన్నడ చిత్రం ‘పోలీసు స్టోరీ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని సాయి కుమార్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అనువాదమై, విజయం సాధించింది. ‘పోలీసు స్టోరీ’ తర్వాత ఆయనపాతిక చిత్రాల్లోపోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇక తెలుగులో ‘అమ్మ రాజీనామా, కర్తవ్యం, అంతఃపురం, ఈశ్వర్ అల్లా, జగద్గురు ఆది శంకర, ఎవడు, పటాస్, పండుగ చేస్కో, భలే మంచి రోజు, సరైనోడు, జనతా గారేజ్, ఓం నమో వెంకటేశాయ, జై లవ కుశ, రాజా ది గ్రేట్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహర్షి, ఎస్ఆర్ కల్యాణమండపం, దసరా, సార్...’ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో సాయికుమార్ నటించారు.50 ఏళ్ల కెరీర్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన సాయికుమార్ విలన్‌గానూ నిరూపించుకున్నారు. ‘సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు..’ వంటి చిత్రాల్లో విలన్‌గా చేశారు. కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా, బుల్లితెరపై రాణిస్తున్నారు సాయికుమార్. ఇక ఆయన తమ్ముళ్లు అయ్యప్ప పి.శర్మ, పి. రవిశంకర్ డబ్బింగ్ ఆర్టిస్టులుగా, నటులుగా సినిమా రంగంలోనే రాణిస్తున్నారు. ఆయన కొడుకు ఆది సాయికుమార్ హీరోగా చేస్తున్నారు. -
మోహన్‌బాబు@50
నటుడు–నిర్మాత మంచు మోహన్‌బాబు సినీ జర్నీ గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టింది. యాభై ఏళ్ల కెరీర్లో ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో ఘనవిజయాలను చూశారు మోహన్‌బాబు. నేటితో సినీ పరిశ్రమలో హీరోగా 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాక ముందు ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేశారు. అయితే సినీ పరిశ్రమపై ఎనలేని ఆసక్తితో మద్రాస్ వెళ్లి, అవకాశాల కోసం ఎంతో శ్రమించారు మోహన్‌బాబు. అలా ఒకట్రెండు సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన మోహన్‌బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘స్వర్గం నరకం’ (1975). డా. దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబరు 22న విడుదలైన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమా విడుదలై, గురువారంతో నలభైతొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ‘స్వర్గం నరకం’తో హీరోగా వెండితెరకు పరిచయమైన మోహన్‌బాబు కెరీర్ మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రలనే పోషించారు. 1975–1990 సమయంలో విలన్‌గా విజృంభించారు. హీరోగా ‘అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. 75 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్‌బాబు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. -
ఆ రహస్యం... అందరూ తెలుసుకోవాల్సిందే!
అమితాబ్, జయబచ్చన్ల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కూతురు శ్వేతా బచ్చన్ నందా ఒక అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే అది వైరల్‌గా మారింది. తల్లిదండ్రుల వివాహబంధం గోల్డెన్ జూబ్లీలోకి ప్రవేశించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేసింది శ్వేత.‘సుదీర్ఘకాల అన్యోన్య దాంపత్యం వెనుక రహస్యం ఏమిటి?’ అని తల్లిని అడిగింది. జయ బచ్చన్ చెప్పిన జవాబు... ‘లవ్’! ‘ఏ విభేదాన్ని అయినా పక్కన పెట్టే, ఏ కష్టాన్ని అయినా తట్టుకునే శక్తి ప్రేమకు ఉంటుంది’ అని నెటిజనులు కామెంట్ చేశారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటో నేపథ్యంలో నెల వ్యవధిలోనే విడాకులు తీసుకుంటున్న నవదంపతుల నుంచి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగాలూ, ఆప్యాయతల వరకు ఎన్నో అంశాలపై నెటిజనులు లోతుగా చర్చించుకుంటున్నారు. -
అ‘పూర్వ’ విద్యార్థులే!.. 50ఏళ్ల తర్వాత మళ్లీ యూనిఫాం, టై ధరించి స్కూల్‌కు..
సాక్షి, హైదరాబాద్: అది అబిడ్స్ చిరాగ్ అలీ లేన్‌లో ఉన్న లిటిల్ ఫ్లవర్ హై స్కూల్... రెండో అంతస్తులో ఉన్న పదో తరగతి క్లాస్ రూమ్..ఆ రూమ్‌లో ఫుల్ యూనిఫామ్‌లో కూర్చున్న వారికి మాజీ తెలుగు పండిట్ నర్సింహులు క్లాస్ తీసుకుంటున్నారు... ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? యూనిఫామ్స్ వేసుకుని విద్యార్థుల టేబుల్స్‌పై కూర్చున్న వారిలో మాజీ డీజీపీ కోడె దుర్గా ప్రసాద్, సీఎం ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్, కావ్య హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ రంగారావు ఉండటమే. తరగతి గదిలో ఆనంద హేల ఈ స్కూల్లో 1972లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ రీ–యూనియన్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న పూర్వ విద్యార్థులు స్కూల్ యూనిఫామ్, టై తదితరాలు ప్రత్యేకంగా కుట్టించుకుని, ధరించి రావడంతో పాటు అప్పట్లో వీళ్లు కూర్చున తరగతి గదిలోనే గడిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, కెనడా, న్యూజిలాండ్ నుంచి పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనం కోసం ప్రత్యేకంగా వచ్చారు. వీరంతా ఆ పాఠశాల ప్రస్తుత విద్యార్థులతోనూ భేటీ అయ్యారు. 1972లో దిగిన గ్రూఫ్ ఫొటో జీవితంలో తాము సాధించిన విజయాలు, అందుకు చేసిన కృషి, ఈ పాఠశాలలో నేర్చుకున్న విద్య ప్రాముఖ్యత తదితరాలను వారికి వివరించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గుర్నాథ్రెడ్డి కూడా తమలో భాగమే అయినప్పటికీ శుక్రవారం నాటి కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని కోడె దుర్గాప్రసాద్ తెలిపారు. ఆముద్యాల సుధాకర్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించి అందరిని ఏకతాటిపైకి తెచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులు, ప్రస్తుత పాఠశాల ప్రిన్సిపాల్ రేవ్బ్రదర్ షజాన్ ఆంటోని అభినందనలు తెలిపారు. -
తమిళనాట శశికళకు మరో ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: తమిళనాడు పాలిటిక్స్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు ఎంజీఆర్ బంధువులు షాక్ ఇచ్చారు. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. దీంతో, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను రామాపురం తోటలోని పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎంజీఆర్ నివాసం ఆవరణలో నిర్వహించాలని శశికళ శిబిరం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అయితే, హఠాత్తుగా ఎంజీఆర్ బంధువులు చిన్నమ్మకు షాక్ ఇచ్చారు. రామాపురం తోటలో ఎలాంటి వేడుకలు నిర్వహించ వద్దని, తాము అనుమతి ఇవ్వబోమ ని మంగళవారం తేల్చి చెప్పారు. దీంతో మరో వేదికను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి చిన్నమ్మ మద్దతు దారులకు ఏర్పడింది. -
అందరికీ ఒక్కడే దేవుడు!
అది 50 ఏళ్ళ క్రితం సంగతి. తెలుగునాట ఓ కాలేజీలో విభిన్న మతాల విద్యార్థుల మధ్య ఘర్షణ రేగింది. సమ్మె జరిగింది. మతవిద్వేషాల మధ్య చివరకు ఆ కాలేజీని కొంతకాలం తాత్కాలికంగా మూసేశారు. మమతలు పెంచవలసిన మతాలు, మనుషులను విడదీస్తున్న సరిగ్గా అదే సమయంలో యాదృచ్ఛికంగా ఓ సినిమా వచ్చింది. సీనియర్ క్యారెక్టర్ నటుడు నాగభూషణం స్వయంగా ఓ కీలకపాత్ర పోషిస్తూ, ఓ సినిమాను సమర్పించారు. అదే పెద్ద ఎన్టీయార్ హీరోగా చేసిన – ‘ఒకే కుటుంబం’. ఈ క్రిస్మస్తో స్వర్ణోత్సవం (రిలీజ్ తేదీ 1970 డిసెంబర్ 25) పూర్తి చేసుకున్న ప్రబోధాత్మక చిత్రం. ఎన్టీఆర్ సినీ కుటుంబం: హిందువైన రాముగా పుట్టి, అనుకోకుండా ఓ ముస్లిమ్ ఇంట రహీముగా పెరిగి, ఓ క్రైస్తవ అమ్మాయి మేరీని ప్రేమించి, పెళ్ళాడిన ఓ యువకుడి (ఎన్టీఆర్) కథ ఇది. ఆ యువకుడి కన్నతండ్రి దుర్మార్గుడైన వజ్రాల వర్తకుడు (నాగభూషణం). కుమారుడని తెలియక, హీరో మీదే యాసిడ్ దాడి చేయిస్తాడు. అలా ముఖం అందవిహీనంగా మారే హీరో పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఆ తరువాత పుట్టుకతో వికారమైన ముఖం ఉన్న హీరో పాత్ర తమిళ, తెలుగు తెరపై అనేకం వచ్చాయి. శివాజీగణేశన్ సూపర్ హిట్ ‘దైవ మగన్’ (తెలుగులో ‘కోటీశ్వరుడు’) లాంటివి అందుకు ఉదాహరణ. (చదవండి: వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్) ఆ రోజుల్లో ఎన్టీఆర్‌తో నాగభూషణానికి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ ‘ఉమ్మడి కుటుంబం’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘వరకట్నం’ లాంటి తన సొంత చిత్రాలు చాలావాటిలో పాత్రలను ఎస్వీఆర్ అందుబాటులో లేనప్పుడల్లా, నాగభూషణానికి ఇచ్చేవారని పాత సినీ పరిశీలకుల మాట. అలాగే, ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎంతో పెద్ద హీరో అయినా... సినీపరిశ్రమలోని తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సొంతంగా సినిమాలు తీసుకుంటామంటే, వారికి డేట్లిచ్చి, ప్రోత్సహించేవారు. తోటివారికి అలా చాలా సినిమాలు చేసిన ఏకైక హీరో ఆయనే. ఆ క్రమంలోనే నాగభూషణానికి ఎన్టీఆర్ ఈ ‘ఒకే కుటుంబం’ చేశారు. మంచి సినిమాల మన భీమ్ సింగ్: తమిళంలో అగ్ర దర్శకుడైన ఎ. భీమ్‌సింగ్ ఈ ‘ఒకే కుటుంబం’కి రూపకర్త. ఎన్టీఆర్ హీరోగా భీమ్‌సింగ్ దర్శకత్వంలో తొలి సినిమా ఇదే. తమిళంలో అగ్ర హీరో శివాజీ గణేశన్‌తో అనేక సూపర్ హిట్లు తీసి, హిందీలో కూడా పలు చిత్రాలు దర్శకత్వం వహించిన ఘనత భీమ్సింగ్ది. తమిళనాట ఎంతో పేరున్న భీమ్‌సింగ్ నిజానికి అచ్చంగా మన తెలుగువారే. తిరుపతి దగ్గర రాయలచెరువు ఆయన స్వస్థలం. ఏసుక్రీస్తుపై విజయచందర్ నిర్మించిన ‘కరుణామయుడు’కు కూడా దర్శకుడు భీమ్సింగే. ఆ చిత్రం తీస్తున్నప్పుడే అస్వస్థతకు గురై, భీమ్‌సింగ్ మరణించారు. 1980 – 90లలో తెలుగులో మనకు దాసరి – రాఘవేంద్రరావుల లాగా, వాళ్ళ కన్నా చాలాముందే తమిళ వెండితెరను ఇద్దరు ప్రముఖ దర్శకులు – భీమ్‌సింగ్, శ్రీధర్ ఏలారు. సూపర్ హిట్లిచ్చి, తమిళ సినీచరిత్రలో వారిద్దరూ భాగమయ్యారు. తమిళ సినీరంగం ఇప్పటికీ తలుచుకొనే ఆ ఇద్దరూ తెలుగువాళ్ళే కావడం విశేషం. దాసరి వర్సెస్ నాగభూషణం?: ‘ఒకే కుటుంబం’కి భీమ్‌సింగ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాకు ఆయన ఓ పాట కూడా రాశారు. అప్పట్లో తమిళ, హిందీ చిత్రాల బిజీతో ఉన్న భీమ్ సింగ్ కు కుదరనప్పుడు ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను దాసరే డైరెక్ట్ చేయడం విశేషం. ఆ చిత్రీకరణ సమయంలో ఏమైందో, ఏమో కానీ దర్శకుడిగా మారాలన్న ప్రయత్నంలో ఉన్న దాసరికీ, నటుడు – నిర్మాత నాగభూషణానికీ ఎక్కడో తేడా వచ్చింది. సినిమా అయిపోయినా, ఆ తరువాత కూడా వారి మధ్య ఆ పొరపొచ్చాలు సమసిపోయినట్టు లేవు. అందుకేనేమో... ఆ తరువాత దాసరి దర్శకుడై, అనేక చిత్రాలు రూపొందించినా ఆయన సినిమాల్లో నాగభూషణం కనిపించరు. ఎన్టీఆర్ సరసన లక్ష్మి నటించారీ చిత్రంలో. కాంతారావు, రాజశ్రీ మరో జంట. మతసామరస్యానికి ప్రతీకగా..: ఒక మతం ఎక్కువ, మరో మతం తక్కువ కాదంటూ... మతసామరస్యం బోధించే ఈ సినిమా కథకు తగ్గట్టుగా... టైటిల్‌కు పక్కనే గుడి, మసీదు, చర్చి శిలువ – మూడూ ఉండేలా అర్థవంతమైన డిజైన్ చేశారు ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్. ఈ సినిమాకు ప్రభుత్వం వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా అప్పట్లో కొందరు సినీ విమర్శకులు అభిప్రాయపడడం విశేషం. మూడు వేర్వేరు మతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ సినిమాలో కనిపిస్తారు. తొలి తరం అగ్ర హీరో నాగయ్య చుట్టుపక్కల అందరికీ మంచి చేసే ముస్లిమ్ పెద్ద ఇస్మాయిల్ పాత్రలో, అలాగే మరో తొలినాళ్ళ హీరో సిహెచ్. నారాయణరావు క్రైస్తవ ఫాదర్ జేమ్స్ పాత్రలో నటించారు. ఆకాశవాణిలో ‘రేడియో బావగారు’గా సుప్రసిద్ధులైన ప్రయాగ నరసింహశాస్త్రి ఈ చిత్రంలో హిందువైన శాస్త్రి పాత్రలో కనిపిస్తారు. ఎస్పీ కోదండపాడి సంగీతంలో దాశరథి రాయగా, ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ‘అందరికీ ఒక్కడే దేవుడు’ పాట ప్రబోధాత్మకంగా సాగుతుంది. ఒకప్పుడు తరచూ రేడియోల్లో వినిపించిన ‘మంచిని మరచి వంచన చేసి’ అనే పాట సమాజంలోని పరిస్థితులను స్ఫురింపజేస్తూ, 50 ఏళ్ళ తరువాత ఇవాళ్టికీ సరిగ్గా సరిపోవడం విశేషం. మిస్సయిన సెంచరీ! ‘ఒకే కుటుంబం’కి మాటలు రాసింది ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు. తెలుగుదనం ఉట్టిపడేలా రాసిన ఆయన మాటలు, మరీ ముఖ్యంగా వినోదభరితమైన విలనీ పండిస్తూ నాగభూషణం పోషించిన మార్తాండం పాత్రకు రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నాగభూషణం పక్కన ఉండే అల్లు రామలింగయ్యతో ఈ సినిమాలో ‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే’ అనే శ్లోకానికి శివుడు, విష్ణువు అంతా రూపాయిలోనే కనిపిస్తారు అంటూ చేసిన సోషల్ సెటైర్ డైలాగ్ అప్పట్లో అందరికీ తెగ నచ్చింది. అప్పట్లో జనాదరణ పొందిన ఈ చిత్రం నిజానికి శతదినోత్సవం జరుపుకోవాల్సిందే. అయితే, అప్పట్లో సినిమా వందరోజులు ఆడితే థియేటర్లలో వర్కర్లకు బోనస్ ఇచ్చే పద్ధతి ఉండేది. దాంతో, వర్కర్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని సరిగ్గా 97 రోజులకు ‘ఒకే కుటుంబం’ చిత్రాన్ని నిర్మాతలు హాలులో నుంచి తీసేయడం విచిత్రం. – రెంటాల జయదేవ -
ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ జరుపుకోనుంది. గోవాలో జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను భారీగా నిర్వహించనున్నట్టు సమాచారం. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రజనీకాంత్‌కు ‘ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ’ అనే అవార్డు ప్రదానం చేయనున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవ్దేకర్ తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాకు రజనీకాంత్ అందిస్తున్న సేవలను గుర్తించి ‘ఐఎఫ్ఎఫ్ఎఫ్ 2019’లో ఆయనకు ఈ అవార్డు అందిస్తాం’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్. ‘‘ఈ గౌరవాన్ని నాకు ప్రదానం చేస్తున్న భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ తన ట్వీటర్ ద్వారా తెలిపారు. ఈ ఉత్సవంలో ఫ్రెంచ్ నటి ఇసబెల్లా హుప్పెర్ట్కు జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నారు. నవంబర్ 20 నుంచి 28 వరకూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. -
ఆ అందం వెండితెరకెక్కి 50 ఏళ్లు
వెండితెరపై యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం ఏ నటుడి కెరీర్లో అయినా ఓ మైళురాయే. అలాంటిది ఓ నటి యాభై ఏళ్లపాటు కెరీర్ కొనసాగించటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతకు చేరువైంది అతిలోకసుందరి శ్రీదేవి. తన నాలుగో ఏటనే వెండితెర మీద మెరిసిన ఈ అందాల రాశి కొత్త సంవత్సరంలో నటిగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కి రెడీ అవుతోంది. 1967లో రిలీజ్ అయిన 'కాంధాన్ కరుణాయ్' అనే తమిళ సినిమాతో తొలిసారిగా వెండితెర మీద కనిపించింది శ్రీదేవి. నాలుగేళ్ల వయసులో కుమారస్వామి పాత్రలో నటించింది. అంతేకాదు తొలి సినిమాలోనే శివాజీ గణేషన్, జయలలిత, కేఆర్ విజయ లాంటి దిగ్గజనటులతో కలిసి నటించింది. ప్రస్తుతం శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన మామ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను 2017లో నటిగా శ్రీదేవి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ప్రెస్‌క్లబ్ క్రికెట్ టోర్నమెంట్లో సాక్షి టీవీ బోణీ
-
సూపర్ స్టార్ గోల్డెన్ జూబ్లీ!
-
మేధావుల ఒడి.. రంగంపేట బడి
కొల్చారం: ఎందరో మేధావులుగా...మరెందరినో విజ్ఞానవంతులను తీర్చిదిద్దిన కొల్చారం మండలం రంగంపేట ఉన్నత పాఠశాల స్వర్ణో త్సవాలు జరుపుకుంటోంది. ఈ పాఠశాలలో చదువుకుని నిన్ను వీడలేమంటూ.,.వీడిపోమంటూ...వెళ్లినపోయిన వారంతా 50 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరనున్నారు. పాఠశాల ఏర్పాటైన నాటి నుంచి(1964-2014) నేటి వరకు విద్యనభ్యసించిన విద్యార్థులంతా ఆదివారం జరుగనున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరుకానున్నారు. చిన్ననాటి ముచ్చట్లు నెమరువేసుకుంటూ సరదాగా గడిపేందుకు పాఠశాలనే వేదికగా చేసుకున్నారు. ఇదే సందర్భంలో ఈ పాఠశాల ఒడిలో విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే..సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక , విద్యారంగాల్లో తమ ప్రతిభను చాటుతూ మేరునగర శిఖరంగా ఆవిర్భవించిన వారు మరికొందరున్నారు. తమకు అక్షరభిక్ష పెట్టిన గురువులను సన్మానించేందుకు వారంతా తరలివస్తున్నారు. రంగంపేట ఉన్నత పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న కొంతమంది పూర్వ విద్యార్థుల గురించి మనమూ తెలుసుకుందాం. దిలీప్‌రెడ్డి, ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వ్యవసాయ కుటుంబ నుంచి వచ్చిన ఆర్.దిలీప్‌రెడ్డి తన స్వగ్రామమైన ఎనగండ్లలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని ఉన్నత విద్య కోసం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగంపేటలో పాఠశాలలో చేరారు. పాఠశాల స్థాయిలోనే సామాజిక సేవా కార్యక్రమాలలో తోటి విద్యార్థులకన్న ముందంజలో ఉండేవారు. పాఠశాలలో ఏ కార్యక్రమాలు చేపట్టిన అందరికన్న ముందుంటూ తన ప్రతిభను చాటేవారు. పాఠశాలలో జరిగే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జరిగే సభల్లో వక్తగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయుల ప్రశంసలు పొందేవారు. ఈ క్రమంలోనే 1977-78లో పదో తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువులకోసం హైదరాబాద్ నగరానికి పయణమైన దిలీప్‌రెడ్డి విద్యాభ్యాసం ముగిశాక పత్రికా రంగంలో అడుగిడినారు. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమాచార కమిషనర్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. సమాచారం హక్కుచట్టం అన్న పదానికే వన్నె తెచ్చారు. ప్రస్తుతం ‘సాక్షి’ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. రమేష్ కుమార్, రాష్ట్ర ఆప్కోడెరైక్టర్ రంగంపేట గ్రామానికి చెందిన అరిగె రమేష్‌కుమార్ ప్రాథమిక, ఉన్నత విద్యను రంగంపేట పాఠశాలలోనే అభ్యసించారు. అటు నుంచి ఉన్నత చదువులకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఆయన ఎల్ఎల్ఎం పూర్తి చేసి గ్రామానికి తిరిగివచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రజాసేవ చేయాలని లక్ష్యంగా ఉంచుకున్న పంచాయతీ వార్డు మెంబర్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం రాష్ట్ర ఆప్కో డెరైక్టర్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. కొమ్ముల శేఖర్‌గౌడ్, ఎనగండ్ల ఎనగండ్ల గ్రామానికి చెందిన శేఖర్‌గౌడ్ రంగంపేట పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈ తర్వాత ఉన్నతవిద్యాభ్యాసం పూర్తి చేసి కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అటు లెక్చరర్‌గా పనిచేస్తూనే మరుగున పడిపోతున్న జానపద కళారంగానికి జీవంపోస్తూ తన ప్రతిభతో రాష్ట్ర యువజన కళాకారునిగా ఎదిగారు. లయా కళాబృందం ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో ప్రదర్శనలిచ్చారు. కె.రాజు, రంగంపేట.. పేదకుటుంబం నుంచి వచ్చిన కంచర్ల రాజు రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడాకారునిగా ఎదిగి రంగంపేట పాఠశాల ఔన్నత్యాన్ని చాటారు. తన ప్రతిభకు పదునుపెడుతూ అందరూ మెచ్చే క్రీడాకారునిగా ఎదిగారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తూ వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బాలకిష్టారెడ్డి, సంగాయిపేట రంగంపేట పాఠశాలలో విద్యనభ్యసించిన బాలకిష్టారెడ్డి పరిపాలన అధికారిగా ఎన్నో పదవుల్లో కొనసాగారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు ఎప్పుడూ ముందుంటూ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పదవీ విరమణ పొందినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పాలెం స్వర్ణోత్సవ సౌభాగ్యం
అదొక మహా విప్లవం. అద్భుత గ్రామస్వరాజ్యం. యాభై ఏళ్ల క్రితమే ఒక మారుమూల కుగ్రామం దేశంలోనే సమగ్రాభివృద్ధిని సాధించిన ఐదు గ్రామాల్లో ఒకటిగా వెలుగొందింది. అది... పేదరికం, కరువు కాటకాలు, వలసలు, ఆకలిదప్పులు తప్ప అభివృద్ధి ఎరుగని పాలమూరు జిల్లాలోని ‘పాలెం’. ఆ అద్భుతానికి సృష్టికర్త పాలెం సుబ్బయ్యగా మన్ననలందుకున్న తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ. ఆ ఊరు సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా, వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలన్నింటిలో సమగ్ర వికాసం సాధించేలా చేసిన కృషీవలుడు. భూస్వామ్య సంస్కృతి రాజ్యమేలుతోన్న తరుణంలో పాలెం ప్రగతి కోసమే పుట్టాడేమోనన్నట్లుగా సుబ్బయ్య ఊళ్లో బడి, గుడి, కళాశాల, ఆసుపత్రి నిర్మింపజేశారు. విద్యార్ధులకు వసతి గృహాలు, ఉపాధ్యాయులకు, వైద్య సిబ్బందికి నివాస ఏర్పాట్లు చేశారు, ఆయన స్థాపించిన బడిలో, కళాశాలల్లో చదువుకుని ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యనిపుణులు, పరిపాలనా దక్షులు, అధ్యాపకులు, పరిశోధకులు, రచయితలు, కవులు, కళాకారులుగా దేశవిదేశాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఒకప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, పీవీ, జలగం, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వాళ్లెందరో ఆ ఊరిని సందర్శించి కీర్తించారు. యాభైఏళ్ల క్రితం ఇలాంటి అభివృద్ధి ఊహింపశక్యం కానిది. పాలమూరు జిల్లా నాగర్‌కర్నూలుకు సమీపంలోని బిజినేపల్లి మండలం పాలెం గ్రామం ఈ నెల 29న స్వర్ణోత్సవ వేడుకలు చేసుకుంటోంది. విద్య, వైద్య గ్రామాభ్యుదయం 1958 నాటికే సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సుబ్బయ్య వితరణతో ఊళ్లో ఆసుపత్రిని కట్టించారు. ఆ రోజుల్లో రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఒక మారుమూల పల్లెటూర్లో ఆసుపత్రి లేదు. ఆ తదుపరి వెటర్నరీని ఆసుత్రిని సైతం పూర్తి చేశారు. ఊరిలోని పురాతన వెంకటేశ్వరాలయాన్ని నిర్మించి పాలెంకు రెండవ తిరుపతి పేరు తెచ్చారు. పెద్దగా చదువుకోని సుబ్బయ్య ఆ ఊరి పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం పరితపించారు. ‘ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ’ని స్థాపించి హైస్కూలు చదవులు అందుబాటులోకి తెచ్చారు. వేంకటేశ్వరాలయం ఆదాయాన్ని పిల్లల చదువు కోసమే వెచ్చించేలా చేశారు. 1963లో శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కూడా ప్రారంభమైంది. పాలెం పిల్లలే కాదు, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ సహా అనేక ప్రాంతాలకు అది విద్యాకేంద్రమైంది. కాలేజీ భవనాలు, ప్రయోగశాలల నిర్మాణానికి, నిర్వహణకు, అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాల తదితర ఖర్చుల కోసం 16 ఎకరాల సొంత భూమిని అమ్మేశారు. ఆ కళాశాలలోని మొదటి పీయూసీ బ్యాచ్ 80 శాతం ఉత్తీర్ణతను సాధించింది. దీంతో నల్లగొండ, కర్నూలు, కడప, అనంతపురం, తదితర జిల్లాల విద్యార్ధులు కూడా పాలెం బాట పట్టారు. 1964లో సుబ్బయ్య శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్, శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలను ఒకేసారి ప్రారంభించారు. మరో 25 ఎకరాల భూమిని అమ్మేశారు. ఆ పిదప నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆ విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేశారు. సమగ్రాభివృద్ధి పథం గ్రామ సమగ్రాభివృద్ధి కోసం అహరహం శ్రమించిన సుబ్బయ్య 1960లలోనే పాలెంకు తాగు నీటి నల్లాల సౌకర్యాన్ని కల్పించారు. ఆనాడు అలాంటి సదుపాయం నగరాలు, జిల్లా, తాలూకా కేంద్రాలకే పరిమితం. 1971-72 సంవత్సరంలో హరిజనుల కోసం ఆయన కట్టించిన 60 పక్కా ఇళ్లకు నాటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు ప్రారంభోత్సవం చేశారు. పాలెం అభివృద్ధిని కళ్లారా చూసి పీవీ ముగ్ధుడయ్యారు. సుబ్బయ్యను ఎమ్మెల్సీ పదవి చేపట్టాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. 1967లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ పాలెంలో ఏర్పాటైంది. రైతులకు చౌకగా రుణపరపతి సౌకర్యాలు విస్తరించాయి. సుబ్బయ్య కృషి ఫలితంగా 1969లో పాలెంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఏర్పాటైంది. అక్కడి శాస్త్రవేత్తల పరిశోధనల కోసం ఆయన తన 20 ఎకరాల భూమిని ఇచ్చేశారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా పాలెంలో పౌల్ట్రీ, పాడి పరిశ్రమలు కూడా అప్పట్లోనే ఏర్పడ్డాయి. మహిళల కోసం కుటీర, చిన్న తరహా పరిశ్రమలు సైతం రూపుదిద్దుకున్నాయి. జిల్లాలోనే మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ పాలెంలోనే ఏర్పాటైంది. ఊరు ఎదిగిన కొద్దీ ఆయన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. ప్రజల సేవ కోసమే పుట్టానని భావించిన సుబ్బయ్య బతికినంత కాలం ప్రజా సేవలోనే గడిపారు. ఏ రాజకీయ పదవులు, సామాజిక హోదాలు ఆశించక సామాన్యునిగానే బతుకుతూ అనితర సాధ్యమైన సేవలను అందించారు. గ్రామాభివృద్ధి కోసం సర్వస్వం ధారపోసిన సుబ్బయ్య చివరకు అనేక కష్టాలను అనుభవించారు. ఏమైతేనేం ఆయన స్వప్నం పాలెం సర్వోతోముఖాభివద్ధిని తన జీవిత కాలంలోనే సాకారం చేసుకోగలిగారు. పగిడిపాల ఆంజనేయులు (డిసెంబర్ 29న పాలెం స్వర్ణోత్సవాలు) -
దేశ ప్రగతిలో రైల్వేలు కీలకం
గుత్తి, న్యూస్‌లైన్: దేశ ప్రగతిలో రైల్వేలు కీలకమని గుత్తి రైల్వే డీజిల్‌షెడ్ సీనియర్ డీఎంఈ శ్రీనివాస్ అన్నారు. రైల్వే ఇన్స్టిట్యూట్ మైదానంలో ఆదివారం ఆయన బెలూన్లను ఎగురవేసి గుత్తి రైల్వే లోకో డీజిల్ షెడ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వేలు ప్రజా జీవితంతో పెనవేసుకుపోయాయన్నారు. డీజిల్షెడ్గా అవతరించి 50 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమన్నారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికుల కృషి, ప్రజల సహాయ సహకారాలతోనే డీజిల్‌షెడ్ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం రైల్వే ఇన్స్టిట్యూట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మోటార్స్ (హీరో షోరూమ్), శ్రీకరం మోటార్స్ స్టాల్స్‌ను ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు లీలా శ్రీనివాస్‌తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎస్బీహెచ్, ఫాస్ట్‌ఫుడ్, బేకరీ, హైదరాబాద్ శారీస్, ధర్మవరం పట్టు చీరలు, కిచెన్ వేర్స్, యమహా, టీవీఎస్, తదితర స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన భరత నాట్యం, కూచిపుడి, కథక్ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు చేసిన డాన్స్‌లు అలరించాయి. అంతకు ముందు రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, వివిధ యూనియన్ల నాయకులు సీనియర్ డీఎంఈ శ్రీనివాస్‌కు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రైల్వే యూనియన్ల నాయకులు రాజమోహన్‌రెడ్డి, నారాయణ, రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్, చినబాబు, పలువురు ఉన్నతాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
అంతరిక్షంపై మన విజయానికి స్వర్ణోత్సవం
మన దేశం ఒక విశిష్టమైన గుర్తింపు సాధించింది. మొట్టమొదటి రాకెట్ ప్రయోగం చేసి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1963 నవంబర్ 21వ తేదీన అమెరికాలో తయారైన రాకెట్‌ను తొలిసారిగా కేరళలోని తిరువనంతపురం సమీపంలోగల తుంబ అనే చిన్న తీరప్రాంత గ్రామం నుంచి అంతరిక్షంలోకి పంపారు. ఇప్పుడు ఏకంగా అంగారకుడిని జయించే దిశగా భారత అంతరిక్ష కార్యక్రమం దూసుకెళ్తోంది. ఎక్కువగా తాడిచెట్లతో ఉండే ఈ గ్రామం ఆధునిక భారతదేశ సంస్కృతికి కొంత దూరంగానే ఉంటుంది. కానీ, మొదటి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన చరిత్రను మాత్రం సుస్థిరం చేసుకుంది. తర్వాతికాలంలో ఈ ప్రయోగ కేంద్రాన్ని తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ (టీఈఆర్ఎల్ఎస్) అని, ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ (వీఎస్ఎస్సీ) అని పిలవసాగారు. ఇదే అప్పటినుంచి ఇస్రోకు చాలా ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ సారాభాయ్ కొంతమంది యువ శాస్త్రవేత్తలను చేరదీసి, వారిని అమెరికా పంపి, అక్కడ సౌండింగ్ రాకెట్ల ప్రయోగంలో శిక్షణ ఇప్పించారు. అలా తొలుత శిక్షణ పొందినవారిలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తదితరులు కూడా ఉన్నారు. దక్షిణ కేరళలోని తుంబ ప్రాంతం గుండా భూమధ్యరేఖ వెళ్తుండటం వల్ల ఈ ప్రాంతం రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అంతరిక్ష కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాతే శ్రీహరికోటను కూడా అనువైన ప్రాంతంగా గుర్తించి, దాన్ని అభివృద్ధి చేశారు. -
నేడు ఐఏబీ
సాక్షి, నెల్లూరు: ఎట్టకేలకు ఐఏబీ (సాగునీటి సలహా మండలి) సమావేశం సోమవారం ఉదయం 11:30కు కలెక్టరేట్లోని గోల్డెన్ జూబ్లీ సమావేశ మంది రంలో జరగనుంది. కలెక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, రైతుసంఘాల నేతలు పాల్గొననున్నారు. సోమశిల పరిధిలో పూర్తి ఆయకట్టుకు నీళ్లివ్వనున్నట్టు ఇప్పటికే ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు ప్రకటించారు. సమావేశంలో చర్చించిన అనంతరం నీటి విడుదల తేదీని వెల్లడిస్తారు. నీటి విడుదలతో పాటు ప్రధానంగా కండలేరు నుంచి ముఖ్యమంత్రి కిరణ్ సొంతజిల్లా చిత్తూరుకు 10 టీఎంసీల నీటి తరలింపునకు విడుదలైన జీఓ విషయమై సమావేశంలో లేవనెత్తనున్నారు. ఈ విషయమై ప్రతిపక్షాలు మంత్రి ఆనంను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఏడాదికేడాదికి వర్షాభావ పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల పరిధిలో ఒక్కపంటకు కూడా సక్రమంగా నీళ్లు దక్కే పరిస్థితి లేకుండా పోతోంది. గత ఏడా ది నీళ్లు లేక జిల్లాలోని మొత్తం 10 లక్షల ఆయకట్టుకు గాను 3 లక్షల ఎకరాలు కూడా సాగులోకి రాలేదు. ఏడాదికేడాది డెల్టా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. కర్ణాటకలో వర్షాలు కురిసి కృష్ణా జలాలు ఎప్పుడొస్తాయో తెలియని స్థితిలో అన్నదాతలు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్టు కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు నీరు తీసుకెళ్లడం రైతాంగం కడుపు కొట్టడమే అవుతుంది. దీనిపై జిల్లా రైతాంగంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఒక టీఎంసీ నీళ్లు కూడా చిత్తూరుకు ఇచ్చేది లే దని ప్రకటనలు గుప్పించి ప్రగల్భాలు పలికి నానా హం గామా చేసిన ఆనం సోదరులు ఇప్పుడు 10 టీఎంసీలు నీళ్ల తరలింపునకు జీఓ వచ్చినా నోరుమెదపక పోవడంపై ప్రజాప్రతినిధులు, రైతుసంఘాలు,ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఐఏబీ సమావేశంలో నిలదీయనున్నారు. కండలేరు పరిధిలో అధికారికంగా 2.7 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అనధికారికంగా 3 లక్షల ఎకరాలకు పైనే ఉంది. కండలేరులో పూర్తిస్థాయిలో నీరు లేనందున కొంతమేర మాత్రమే ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో తమ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లివ్వాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేయనున్నారు. సోమశిల పరిధిలో ప్రస్తు తం జరుగుతున్న సాగునీటి ఆధునికీకరణ పనులు మందకొడిగానే కాక నాసిరకంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం, కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అక్రమాలపై ఐఏబీలో లేవనెత్తనున్నారు. అలాగే నీటి విడుదల నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని ప్రతి నిధులు, రైతుసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేయనున్నారు. మొత్తం మీద ఐఏబీ వాడీవేడిగా జరగనుంది.