పాఠశాల ఆవరణలో గ్రూప్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: అది అబిడ్స్ చిరాగ్ అలీ లేన్‌లో ఉన్న లిటిల్ ఫ్లవర్ హై స్కూల్... రెండో అంతస్తులో ఉన్న పదో తరగతి క్లాస్ రూమ్..ఆ రూమ్‌లో ఫుల్ యూనిఫామ్‌లో కూర్చున్న వారికి మాజీ తెలుగు పండిట్ నర్సింహులు క్లాస్ తీసుకుంటున్నారు... ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? యూనిఫామ్స్ వేసుకుని విద్యార్థుల టేబుల్స్‌పై కూర్చున్న వారిలో మాజీ డీజీపీ కోడె దుర్గా ప్రసాద్, సీఎం ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్, కావ్య హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ రంగారావు ఉండటమే.
తరగతి గదిలో ఆనంద హేల
ఈ స్కూల్‌లో 1972లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ రీ–యూనియన్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న పూర్వ విద్యార్థులు స్కూల్ యూనిఫామ్, టై తదితరాలు ప్రత్యేకంగా కుట్టించుకుని, ధరించి రావడంతో పాటు అప్పట్లో వీళ్లు కూర్చున తరగతి గదిలోనే గడిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, కెనడా, న్యూజిలాండ్ నుంచి పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనం కోసం ప్రత్యేకంగా వచ్చారు. వీరంతా ఆ పాఠశాల ప్రస్తుత విద్యార్థులతోనూ భేటీ అయ్యారు.
1972లో దిగిన గ్రూఫ్ ఫొటో
జీవితంలో తాము సాధించిన విజయాలు, అందుకు చేసిన కృషి, ఈ పాఠశాలలో నేర్చుకున్న విద్య ప్రాముఖ్యత తదితరాలను వారికి వివరించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గుర్నాథ్‌రెడ్డి కూడా తమలో భాగమే అయినప్పటికీ శుక్రవారం నాటి కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని కోడె దుర్గాప్రసాద్ తెలిపారు. ఆముద్యాల సుధాకర్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించి అందరిని ఏకతాటిపైకి తెచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులు, ప్రస్తుత పాఠశాల ప్రిన్సిపాల్ రేవ్‌బ్రదర్ షజాన్ ఆంటోని అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment