
మేధావుల ఒడి.. రంగంపేట బడి
కొల్చారం: ఎందరో మేధావులుగా...మరెందరినో విజ్ఞానవంతులను తీర్చిదిద్దిన కొల్చారం మండలం రంగంపేట ఉన్నత పాఠశాల స్వర్ణో త్సవాలు జరుపుకుంటోంది. ఈ పాఠశాలలో చదువుకుని నిన్ను వీడలేమంటూ.,.వీడిపోమంటూ...వెళ్లినపోయిన వారంతా 50 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరనున్నారు. పాఠశాల ఏర్పాటైన నాటి నుంచి(1964-2014) నేటి వరకు విద్యనభ్యసించిన విద్యార్థులంతా ఆదివారం జరుగనున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరుకానున్నారు.
చిన్ననాటి ముచ్చట్లు నెమరువేసుకుంటూ సరదాగా గడిపేందుకు పాఠశాలనే వేదికగా చేసుకున్నారు. ఇదే సందర్భంలో ఈ పాఠశాల ఒడిలో విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే..సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక , విద్యారంగాల్లో తమ ప్రతిభను చాటుతూ మేరునగర శిఖరంగా ఆవిర్భవించిన వారు మరికొందరున్నారు. తమకు అక్షరభిక్ష పెట్టిన గురువులను సన్మానించేందుకు వారంతా తరలివస్తున్నారు. రంగంపేట ఉన్నత పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న కొంతమంది పూర్వ విద్యార్థుల గురించి మనమూ తెలుసుకుందాం.
దిలీప్‌రెడ్డి, ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
వ్యవసాయ కుటుంబ నుంచి వచ్చిన ఆర్.దిలీప్‌రెడ్డి తన స్వగ్రామమైన ఎనగండ్లలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని ఉన్నత విద్య కోసం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగంపేటలో పాఠశాలలో చేరారు. పాఠశాల స్థాయిలోనే సామాజిక సేవా కార్యక్రమాలలో తోటి విద్యార్థులకన్న ముందంజలో ఉండేవారు. పాఠశాలలో ఏ కార్యక్రమాలు చేపట్టిన అందరికన్న ముందుంటూ తన ప్రతిభను చాటేవారు.
పాఠశాలలో జరిగే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జరిగే సభల్లో వక్తగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయుల ప్రశంసలు పొందేవారు. ఈ క్రమంలోనే 1977-78లో పదో తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువులకోసం హైదరాబాద్ నగరానికి పయణమైన దిలీప్‌రెడ్డి విద్యాభ్యాసం ముగిశాక పత్రికా రంగంలో అడుగిడినారు. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమాచార కమిషనర్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. సమాచారం హక్కుచట్టం అన్న పదానికే వన్నె తెచ్చారు. ప్రస్తుతం ‘సాక్షి’ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
రమేష్ కుమార్, రాష్ట్ర ఆప్‌కోడెరైక్టర్
రంగంపేట గ్రామానికి చెందిన అరిగె రమేష్‌కుమార్ ప్రాథమిక, ఉన్నత విద్యను రంగంపేట పాఠశాలలోనే అభ్యసించారు. అటు నుంచి ఉన్నత చదువులకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఆయన ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి గ్రామానికి తిరిగివచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రజాసేవ చేయాలని లక్ష్యంగా ఉంచుకున్న పంచాయతీ వార్డు మెంబర్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం రాష్ట్ర ఆప్‌కో డెరైక్టర్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.
కొమ్ముల శేఖర్‌గౌడ్, ఎనగండ్ల
ఎనగండ్ల గ్రామానికి చెందిన శేఖర్‌గౌడ్ రంగంపేట పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈ తర్వాత ఉన్నతవిద్యాభ్యాసం పూర్తి చేసి కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అటు లెక్చరర్‌గా పనిచేస్తూనే మరుగున పడిపోతున్న జానపద కళారంగానికి జీవంపోస్తూ తన ప్రతిభతో రాష్ట్ర యువజన కళాకారునిగా ఎదిగారు. లయా కళాబృందం ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో ప్రదర్శనలిచ్చారు.
కె.రాజు, రంగంపేట..
పేదకుటుంబం నుంచి వచ్చిన కంచర్ల రాజు రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడాకారునిగా ఎదిగి రంగంపేట పాఠశాల ఔన్నత్యాన్ని చాటారు. తన ప్రతిభకు పదునుపెడుతూ అందరూ మెచ్చే క్రీడాకారునిగా ఎదిగారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తూ వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
బాలకిష్టారెడ్డి, సంగాయిపేట
రంగంపేట పాఠశాలలో విద్యనభ్యసించిన బాలకిష్టారెడ్డి పరిపాలన అధికారిగా ఎన్నో పదవుల్లో కొనసాగారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు ఎప్పుడూ ముందుంటూ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పదవీ విరమణ పొందినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.