ఐఏబీపై హై 'డ్రామా'
-
తమ్ముళ్ల కుమ్ములాట
-
ఆందోళనలో రైతులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఐఏబీ సమావేశంపై అధికార పార్టీ నాయకుల వర్గపోరు హైడ్రామాను తలపిస్తోంది. సమావేశ తేదీలు నిర్ణయించే దగ్గర నుంచి ఈ డ్రామా వింత మలుపులు తిరుగుతోంది. ఇన్‌చార్జి మంత్రి , ఓ ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూర్ సభ్యుడు ఐఏబీ మీటింగ్‌ను వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తుండగా, జిల్లా మంత్రి , మరో ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐఏబీ మీటింగ్ తేదీని నిర్ణయించడంలో జాప్యం చేస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులు చేయకుండానే బిల్లులు, ఒక పనికి మూడు బిల్లులు పెట్టి నిధులను స్వాహా చేయాలని చూసే టీడీపీ ఒక వర్గం నాయకులకు కలెక్టర్ చెక్ పెట్టారు. కాలువలకు నీటిని వదలకముందు ఓ అండ్ ఎం పనుల పేరుతో నిధులను నొక్కేయాలని చూసే మరో వర్గం ఎలాగైనా పనులు చేయించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య అసంతృప్తి రోజు రోజుకు అధికమవుతోంది. జిల్లా స్థాయి నాయకులను మంత్రులు ప్రోత్సహించడంతో వర్గపోరు బాహాటమవుతోంది.
ఉద్దేశపూర్వకంగానే డెల్టా, నాన్‌డెల్టా అంశం తెరపైకి
డెల్టా, నాన్‌డెల్టా అంశాన్ని అధికార పార్టీ నాయకులు కావాలనే తెరపైకి తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం మొదటి ప్రాధాన్యతగా పెన్నా డెల్టాప్రాంతానికి , రెండో దఫా కావలికెనాల్, నార్త్, సౌత్ కాలువల ఆయకట్టుకు, మూడో దఫాగా కనుపూరుకాలువకు ఇవ్వాల్సి ఉంది. అయితే కావాలనే సోమశిల జలాశయానికి 60 టీఎంసీల నీరుచేరిన తర్వాత జిల్లా అంతటికి అందిస్తామని తీర్మానిస్తామని అధికార పార్టీ నాయకులు చెప్పుకురావడం డ్రామాలో భాగమని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ పనుల్లోని అవినీతి ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకు టీడీపీలోని ఓ వర్గం నాయకులు ప్రయత్నిస్తుండడంతో ఐఏబీ జాప్యం జరుగుతోందని రైతులు వాదిస్తున్నారు. అక్టోబరులో ఉన్న నీటిలభ్యతను అనుసరించి ఐఏబీ సమావేశం జరపాల్సి ఉంది. అయితే ఉద్దేశపూర్వకంగా ఇరువర్గాలు కుమ్ములాడుకుంటూ రైతులను నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నీళ్లివ్వండి చాలు
ఓఅండ్‌ఎం పనులు నీటి సంఘాల యాజమాన్యాలకు వద్దు. కాలువ మరమ్మతులు ఇరిగేషన్ అధికారులతో చేయించి సకాలంలో నీళ్లివ్వాలని సర్వేపల్లి కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పడం అధికారపార్టీలోని కుమ్ములాటలను స్పష్టంగా బహిర్గతం చేసింది. ఐఏబీ సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నీటి తీరువా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఓఅండ్‌ఎం పనులకు నిధులు సమకూరే పరిస్థితి లేదు. పనులు చేయకుండానే నిధులు కొల్లగొట్టాలంటే ఉండే ఏకైక మార్గం నీరు–చెట్టు పనుల కింద ప్రతిపాదనలు పంపడమేనని రైతులు అంటున్నారు. ఐఏబీ సమావేశాన్ని జాప్యం చేసి కాలువల మరమ్మతుల పేరుతో నిధులను స్వాహాచేసేందుకు అధికారపార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా కలెక్టర్ దృష్టి సారించి ఐఏబీ నిర్వహించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.