ఉదయగిరి అధికార పార్టీలో టికెట్ రగడ తారా స్థాయికి చేరింది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తీరుపై పార్టీ అధిష్టానం నుంచి కేడర్ వరకు వ్యతిరేకత బలంగా ఉండడంతో ఈ దఫా అభ్యర్థి మార్పు ఖాయమని ప్రచారం బలంగా సాగుతోంది. దీంతో ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఆశావహులు బలమైన లాబీయింగ్‌తో ప్రయత్నాలు ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సీటు కోసం ఫైట్ చేస్తున్నారు. ఈ దఫా టికెట్ కూడా వేరే సామాజికవర్గానికి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారంతో రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో ఆశావహులు ఎక్కువయ్యారు. పార్టీ మండల అధ్యక్షులు కొందరు కూడా తమకు టికెట్ కేటాయిస్తే బాగా ఖర్చు పెట్టుకొని గెలుస్తామని ప్రకటించుకోవడం ఇందుకు నిదర్శనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార టీడీపీలో ఎన్నికల లొల్లి మొదలైంది. ముఖ్యంగా జిల్లాలో సిట్టింగ్ స్థానాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఈ నెలాఖరుకు ప్రకటిస్తారని పార్టీలో బలంగా ప్రచారం సాగుతోంది. దీంతో ఉదయగిరి టికెట్ రగడ తెరపైకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు 2014 ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కాంట్రాక్టర్ కావడం, ఇతర రాష్ట్రాల్లో వర్కులు ఎక్కువగా చేస్తున్న క్రమంలో నియోజకవర్గంలో స్థానికంగా అందుబాటులో ఉండరనే పేరు మొదటి నుంచి ఉంది. గడిచిన నాలుగేళ్లలో పూర్తిస్థాయిలో ఎన్నడూ ఆయన అందుబాటులో ఉండలేదు. కొన్ని నెలల క్రితం నిర్వహించిన పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకుని నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని హెచ్చరించిన జాబితాలో బొల్లినేని కూడా ఉన్నారు. దీంతో పాటు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి ఆరోపణలు తారస్థాయికి చేరాయి.
నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు పనులు మొదలుకుని మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ బోర్డులో చేసిన పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుంది. స్థానికంగా నియోజకవర్గంలో నీరు–చెట్టులో ఎక్కడా లేని విధంగా ఫైబర్ గ్రిడ్ టెక్నాలజీతో ఫైబర్ చెక్ డ్యాంల నిర్మాణం భారీగా చేశారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందని, పూర్తి నాసిరకంగా నిర్మాణాలు చేసి రూ.కోట్లు స్వాహా చేశారని ప్రభుత్వ నిఘా విభాగం విజిలెన్స్ అధికారులే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కాంట్రాక్టర్‌గా విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ బోర్డుకు సంబంధించి చేపట్టిన పనుల్లో అయితే భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం అక్కడ ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో పాటు మరికొందరిపై అక్కడి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కూడా కోర్టుకు చేరింది. వీటికితోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతిష్ట మసక బారడంతో పాటు వ్యక్తిగత పరపతి కూడా పూర్తిగా తగ్గిపోయింది. సామాజిక సమీకరణాలు సైతం బలంగా తెరపైకి వచ్చి కీలకంగా మారడంతో ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ దక్కదనే ప్రచారం అధికార పార్టీలో బలంగా సాగుతోంది.
తీవ్రమైన టికెట్ పోరు
అధికార పార్టీలో టికెట్ పోరు తారస్థాయికి చేరింది. నేతలు వ్యక్తిగతంగా జిల్లాలోని పార్టీ ముఖ్యుల ద్వారా లాబీయింగ్‌కు తెరతీశారు. జిల్లాలోని మంత్రి సహకారంతో వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి మూడునెలల క్రితం తెరపైకి వచ్చారు.పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో స్కూల్ బ్యాగుల పంపిణీతో నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. మరో వైపు కృష్ణారెడ్డి వర్గం టికెట్ తమ నేతకే దక్కుతుందని బలంగా ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కూడా టికెట్ రేసులో తెరపైకి వచ్చారు. మాజీ మంత్రి ఆదాల ప్రబాకర్‌రెడ్డి ద్వారా తన ప్రయత్నాలు బలంగా చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉండటంతో మళ్లీ టికెట్ కోసం యత్నిస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో సీఎం సొంత సామాజిక వర్గానికి రెండు టికెట్లు మాత్రమే ఇస్తారని బలంగా ప్రచారం సాగుతోంది. ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్య, కందుకూరులో మరో నేత ఉండటంతో ఉదయగిరిలో మార్పు అనివార్యమనే ప్రచారం సాగుతోంది. ఇక వీరితో పాటు మండల స్థాయి నేతలు ముగ్గురు, ఒక అధికారి కూడా ఇక్కడి టికెట్‌ను సామాజిక సమీకరణాల నేపథ్యంలో ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద డిసెంబర్ నాటికి కానీ టికెట్ పోరుకు ముగింపు రాని పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment