ఆయకట్టంతటికీ అనుమతి
ఖరీఫ్‌లో దిగుబడులు రాక, రబీ ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్న డెల్టా రైతులకు శుభవార్త. రబీలో జిల్లాలోని మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలని ఐఏబీ తీర్మానించింది. అయితే మార్చి 31 నాటికి సాగు పూర్తి కావాలని నిర్ణయించింది. నీటి లభ్యతను బట్టి ఆయకట్టు కుదింపు అనివార్యమన్న అధికారుల మాటను ప్రజాప్రతినిధులు తిరస్కరించారు.
కాకినాడ/ అమలాపురం :సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం కలెక్టరేట్‌లో ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన శుక్రవారం జరిగింది. శాసనమండలిలో విప్ కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు), జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు హరిబాబు, ఎస్‌ఈ సుగుణాకరరావు, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, నీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఎస్‌ఈ సుగుణాకరరావు గోదావరిలో నీటి లభ్యతను వివరించారు. రబీకి సుమారు 83 టీఎంసీలు (ఒక టీఎంసీ 10,830 ఎకరాలు) అవసరం కాగా, కేవలం 67 టీఎంసీలే అందుబాటులో ఉంటుందన్నారు. కేవలం 80 శాతం ఆయకట్టుకు మాత్రమే నీరిస్తామని, దీని వల్ల జిల్లాలోని తూర్పు, మధ్యడెల్టాల్లో 87,313 ఎకరాల్లో సాగు ఉండదని చెప్పారు. జోన్లవారీగా ఆయకట్టును ఎంపిక (శుక్రవారం సంచికలో ‘30 శాతం మూనకు దూరం!’ శీర్షికన వచ్చిన కథనంలో అధికారుల యోచన ఇదేనని ‘సాక్షి’ పేర్కొంది) చేస్తామన్నారు. అయితే అభ్యంతరం తెలిపిన ప్రజాప్రతినిధులు మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలన్నారు. 16 టీఎంసీల లోటు భర్తీకి అవసరమైన చర్యల్ని వివరిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి నిధులమంజూరుకు కృషి చేస్తామన్నారు.
పాత లెక్కలు మానండి : వరుపుల, చిర్ల
పాతకాలం నాటి లెక్కలు మాని కొత్త లెక్కలు వేస్తే మొత్తం ఆయకట్టుకు నీరివ్వొచ్చని వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ప్రత్తిపాడు, కొత్తపేట ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా రైతులు ఖరీఫ్‌లో నష్టపోయినందున గోదావరి డెల్టా, ఏలేరు,