అమలాపురం టౌన్ : గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1463 కోట్లు ఖర్చు చేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రముఖ పంచాంగ కర్త ఉపద్రష్ట కృష్ణమూర్తి రచించిన ‘గోదావరి పుష్కర మహాత్యం’ పుస్తకాన్ని అమలాపురం కాపు కల్యాణ మండపంలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో హోంమంత్రి మాట్లాడుతూ గత గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం రూ.160 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఈ సారి పుష్కరాలకు ఉభయగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం రూ.వేలకోట్ల నిధులు కేటాయించిందన్నారు.
పుష్కర విశిష్టత అందరికీ తెలియజేయాలన్న సంకల్పంతో పంచాంగ కర్త ఉపద్రష్ట కృష్ణ మూర్తి పుష్కర మహాత్యం పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు. గోదావరి నది ప్రాముఖ్యం, పుష్కరాల్లో ఏ దానాలు చేయాలని, పాటించాల్సిన నియమాలను రచయిత ఈ పుస్తకంలో వివరించారన్నారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ గోదావరి విశిష్టత సామాన్యులకు కూడా అర్థయ్యేలా ఈ పుస్తకంలో రచించారన్నారు. వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ గత గోదావరి పుష్కరాల్లో ఉపద్రష్ట రచించిన గోదావరి మహాత్యం పుస్తకం ప్రింటింగ్ తదితర విషయాల్లో తాను దగ్గరుండి చూసుకున్నానని, ఈ గోదావరి పుష్కరాలకూ ఆయన రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు మాట్లాడుతూ పుష్కరాల్లో పాటించాల్సిన నియమాలు, పూజల గురించి ఈ పుస్తకంలో సోదాహరణగా వివరించారన్నారు. పుస్తక రచయిత కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాాణా రాష్ట్రాల్లో ఎందరో కవులు, రచయితల అభిప్రాయాలు జోడించి ఈ పుస్తకాన్ని రచించానన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, డీఎస్పీ లంక అంకయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, పట్టణ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర, మున్సిపల్ చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు, వీఆర్‌ఓల సంఘజిల్లా అధ్యక్షుడు కల్వకొలను వెంటకరమణ, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కంటిపూడి సర్వారాయుడు, కవి ఎస్.ఆర్.ఎస్.కొల్లూరి తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాలకు రూ.1463 కోట్లు
Published Mon, Jun 8 2015 12:32 AM | Last Updated on Wed, Oct 17 2018 5:47 PM
Advertisement
Advertisement