సాక్షి ప్రతినిధి, కాకినాడ : డెల్టా కాలువలను మార్చి 31నాటికి మూసివేయడం అసాధ్యమని తెలిసి కూడా అధికారులు పాత పల్లవే పాడుతున్నారు. డెల్టాలో రబీ వరిసాగులో అసాధారణ జాప్యం జరిగినందున డెల్టా కాలువలకు ఏప్రిల్ 15 తరువాతా నీరు ఇవ్వాలి. ఇది తెలిసీ మూసివేతకు మార్చి 31 గడువు పెట్టడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కాలువల మూసివేత గడువుపై తుది నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది కాకినాడలో జరిగిన ఇరిగేషన్ ఎడ్వయిజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో మార్చి 31 నాటికి కాలువలు మూసివేయాలని, దీనికితగ్గట్టుగా రబీని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డిసెంబరు నెలాఖరుకు నాట్లు పూర్తికాని చేలల్లో వరి కాకుండా స్వల్పకాలిక, ఆరుతడి పంటలు చేపట్టేలా రైతులను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
అయితే సకాలంలో నీరందించడంలో ఇరిగేషన్ శాఖాధికారులు, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారు. తూర్పు, మధ్య డెల్టాల్లోని శివారుకు నీరందక సాగు ఆలస్యమైంది. తూర్పు డెల్టాలోని కాకినాడ, కరప, మధ్యడెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు సబ్ డివిజన్లలోని శివారు ఆయకట్టులో సంక్రాంతి తరువాత, ఫిబ్రవరి మొదటి వారంలో నాట్లు పడ్డాయి. ఈ ప్రాంతంలో చేలు ఇంకా పాలుపోసుకునే దశకు రావాలంటే మరో 20, 30 రోజులు పడుతుంది. ఇక్కడ వరి కోతలు ఏప్రిల్ నెలాఖరు వరకూ పూర్తి కావు. వీటికి ఏప్రిల్ 15 వరకూ నీరందించాలి. దీనిని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు.అయినా కలెక్టర్ సమీక్షా సమావేశంలో వారు నోరు మెదపలేదు. మార్చి నెలాఖరుకు కాలువలు మూసివేయాలని నిర్ణయించారు. మరోసారి క్షేత్రస్థాయిలో సాగు పరిస్థితిని పరిశీ లించి, తుది నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మార్చి 31తో కాలువల మూసివేత : కలెక్టర్
మరమ్మతుల కోసం మార్చి 31 నుంచి గోదావరి డెల్టా కాలువలు మూసివేస్తున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కాలువల మరమ్మతులపై ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సోమవారం రాత్రి ఆయన సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్‌కు మార్చి 31 వరకూ, వచ్చే ఖరీఫ్‌కు జూన్ 15 నుంచి నీరందించాలని, మూసివేత సమయంలో కాలువల ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల అధికారులకు కలెక్టర్ సూచించారు.
కాలువల మరమ్మతులను నిర్ణీతవ్యవధిలో పూర్తి చేయాలని, దీనికి రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని అన్నారు. కాలువలు మూసివేసే సమయంలో పంటలకు నష్టం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖ ధవళ్వేశరం సర్కిల్ ఎస్‌ఈ పి.సుగుణాకరరావు మాట్లాడుతూ, ఆధునికీకరణ పనులు చేపట్టడానికి క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉన్నా, ఆ పరిస్థితి లేనందున కాలువలు మూసివేసే సమయంలో దశలవారీగా మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. పాత కట్టడాలు పాడవకుండా కాలువలు మరమ్మతులు చేపట్టాలని సూచించారని చెప్పారు.
అసాధ్యమని తెలిసినా..అదే పల్లవి
Published Tue, Feb 24 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement