Delta canal
-
‘నీరు’గారుతోంది...
అమలాపురం: జూన్ 1వ తేదీనాటికి సాగునీరు అందిస్తామంటూ సాగునీటి పారుదల శాఖాధికారులు గోదారి మాతకు పూజలు చేసి మరీ నీరు వదిలారు. తొమ్మిది రోజులవుతున్నా కాలువల ద్వారా గోదావరి నీరు పంట చేలకు చేరలేదు. శివారు దేవుడెరుగు.. కాలువలను ఆనుకుని ఉన్న ఆయకట్టుకు సైతం సాగునీరందడం లేదు. డెల్టా ప్రధాన పంట కాలువల లాకుల వరకు నీరు చేరలేదు. ఇందుకు అధికారులు చెప్పే కారణం.. కాలువలపై ఆధునికీకరణ, నీరు– చెట్టు పనులు జరుగుతున్నాయని. క్లోజర్ 40 రోజులున్నా పనులు చేయని అధికారులు, చివరి నిమిషంలో హడావిడిగా పనులు ఆరంభించి చేలకు నీరు చేరకుండా అడ్డకట్టు వేయడం ముందుగా నీటి విడుదల ప్రయోజనం ఏమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ధాన్యాగారం అని పేరొచ్చిందంటే అందుకు కారణం గోదావరి డెల్టా. ఉభయ గోదావరి జిల్లాల్లో 8.96 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. ఖరీఫ్, రబీలలో కలిపి ఈ రెండు డెల్టాల్లో సుమారు 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా, రెండు పంటలకు కలిపి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. గత ఏడాది రాష్ట్రమంతటా కరువు పరిస్థితులు నెలకొన్నా వ్యవసాయ వృద్ధి సాధించిందని ప్రభుత్వం ఘనతగా చెప్పుకుందంటే అందుకు గోదావరి డెల్టాలో పంటలు పండటమే. అటువంటి డెల్టా విషయంలో ప్రభుత్వం తొలి నుంచి శీతకన్ను వేస్తూనే ఉంది. ఆధునికీకరణకు అరకొరగా నిధులివ్వడమే కాదు..అవి సకాలంలో ఆరంభించకుండా పనులు ఆలస్యం చేస్తోంది. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు తమకు ముందస్తు సాగు చేసుకునేందుకు మే 15వ తేదీ నాటికి సాగునీరివ్వాలని రైతులు కోరినా జూన్ ఒకటో తేదీకి విడుదల చేస్తున్నట్టు చెబుతూ... నెలాఖరు వరకు నీరు రాకుండా చేస్తోంది. ఈ ఏడాది కూడా జూన్ ఒకటిని కాలువకు నీరు వదిలారుకాని ప్రధాన లాకుల వద్ద వాటిని బంధించి వేశారు. మధ్య డెల్టాలో లొల్ల లాకుల వద్ద నీరు నిలుపుదల చేసి పి.గన్నవరం, ముక్తేశ్వరం కాలువలకు నీరుపారకుండా చేశారు. శుక్రవారం నుంచి ఈ రెండు కాలువలకు కేవలం 50 క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని మాత్రం అమలాపురం కాలువకు తొలుత 500, తరువాత 300 క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. తూర్పు డెల్టాలోను ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక్కడ అన్ని కాలువలకు కలిపి కేవలం 350 క్యూసెక్కులే నీరు విడుదల చేశారు. కాలువలకు నీరందిస్తే అన్ని ప్రాంతాలకన్నా ఇక్కడ ముందస్తుగా సాగు మొదలవుతోంది. నీరంది ఉంటే ఇప్పటికే ఆలమూరు, అనపర్తి వ్యవసాయ సబ్ డివిజన్లలో ఇప్పటికే నారుమడులు పడేవి. ధవళేశ్వరం కాకినాడ కాలువ పరిధిలో సామర్లకోట వద్ద వంతెన పనులు జరుగుతున్నాయని కడియం లాకుల వద్ద నిలుపుదల చేశారు. దీంతో అనపర్తి, బిక్కవోలు, ద్వారపూడి మండలాల్లో కొన్ని గ్రామాలకు, సామర్లకోటతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌కు సాగునీరందే అవకాశం లేకుండా పోయింది. ధవళేశ్వరం– మండపేటకు రెండు రోజుల నుంచి అంతంతమాత్రంగా సాగునీరు విడుదల చేశారు. కోటిపల్లి బ్యాంకు కెనాల్, ఇంజరం కాలువలకు ఇంకా నీరందలేదు. ఇదే సమయంలో పశ్చిమ డెల్టాకు పూర్తిస్థాయిలో 4,500 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తుండడం గమనార్హం. సాగుసమ్మె అంటున్నా లెక్కలేదు 2011లో చేసినట్టుగా ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో సాగుసమ్మె చేస్తామని కోనసీమ రైతులు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు వారు చెప్పే కారణం సకాలంలో నీరివ్వడం లేదని. అయినా అధికారులు లెక్క చేయడం లేదు. పూర్తిస్థాయిలో నీరివ్వలేమని తెగేసి చెబుతున్నారు. మే 15 నాటికి నీరెందుకు? బ్రిటీష్ విధానంలో మే 15 నాటికి డెల్టా కాలువలకు నీరు ఇవ్వాలి. అలా చేస్తే జూన్ 15 నాటికి నాట్లు పూర్తవుతాయి. అక్టోబరు 15 నాటికి నూర్పుడలవుతాయి. అక్టోబరు 20 నుంచి నవంబరు 20 వరకు ఈశాన్య రుతుపవనాలు, వాయు గుండాలు, తుపాన్ల బారిన పంట పడకుండా ఉంటుంది. డిసెంబరు ఒకటిన రబీ ఆరంభిస్తే మార్చి 31 నాటికి పూర్తవుతుంది. దీనివల్ల రైతులు మూడో పంటగా అపరాలు సాగు చేయవచ్చు. అదనపు ఆదాయంతోపాటు చేనుకు మేలు చేసే పచ్చిరొట్ట ఎరువును అందించే అవకాశముంది. దీనిని దృష్టిలో పెట్టుకునే రైతులు మే 15 నాటికి సాగునీరు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం జూన్ ఒకటిన ఇస్తామంటూ నెలాఖరు వరకు నీరు చేలకు అందకుండా చేస్తున్నారు. దీనివల్ల గడచిన తొమ్మిదేళ్లలో (2011, 2016, 2017 మినహా) ఖరీఫ్‌ను, 2010, 2011, 2017లో రబీ పంటకు నష్టం వాటిల్లడం వల్ల రైతులు వేల కోట్ల రూపాయలు కోల్పోయారు. -
పురాతన వంతెనతో ప్రమాదమే
నిడదవోలు :నిడదవోలు మండలం సమిశ్రగూడెం వద్ద పశ్చిమడెల్టా ప్రధాన కాలువపై బ్రిటీష్ హయాంలో 1932లో నిర్మించిన పురాతన వంతెన ప్రమాదకరంగా ఉందని నిపుణులు తేల్చిచెప్పారు. దీంతో ఈ నెల 9 నుంచి ఆ వంతెనపై 10 టన్నులకు మించిన భారీ వాహనాల రాకపోకలను అధికారులు నిషేధం విధించారు. భారీ వాహనాలను అనుమతించేది లేదని ఆర్అండ్బీ కొవ్వూరు డీఈఈ ఎ.శ్రీకాంత్ స్పష్టం చేశారు. వంతెనపై పది టన్నుల లోడు వాహనాలను మాత్రమే వెళ్లాలని, 24 కిలోమీటర్ల వేగం మించి రాకపోకలు సాగించరాదని తెలిపారు. ఇదే వంతెనకు కూతవేటు దూరంలో ఉన్న గడ్డర్ బ్రిడ్జి ఇటీవల కుప్పకూలింది. ఈ రెండు వంతెనలూ ఒకేసారి నిర్మించారు. దీంతో సమిశ్రగూడెం వంతెనపై ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇదే అంశంపై మార్చి 20న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దానికి స్పందించిన ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ పి.సుబ్బారావు తన సిబ్బందితో మార్చి 24న సమిశ్రగూడెం వంతెనను పరిశీలించారు. మార్చి 31న హైదరాబాద్ నుంచి స్రైయోరంట్ సంస్థకు చెందిన నలుగురు బృందం కూడా వచ్చి వంతెనను పరిశీలించి వంతెన ప్రమాదకరంగా ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వివిధ శాఖల అధికారుల సమీక్ష పురాతన వంతెన రక్షణపై గురువారం రాత్రి నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆర్అండ్ బీ, ఆర్టీసీ, అగ్ని మాపక అధికారులు, లారీ యూనియన్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిపుణులు తేల్చి చెప్పిన ఆంశాల ప్రకారం ఆర్అండ్బీ అధికారులు వంతెన సామర్థ్యం, లోడు నియంత్రణ అంశాలను వివరించారు. భారీ వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు ఐరన్ గడ్డర్ స్టాపర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సులకూ అనుమతి నిల్ 10 టన్నులకు మించి బరువున్న వాహనాలు వెళితే ప్రమాదమని అధికారులుతేల్చడంతో ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణించలేని పరిస్థితి. దీంతో ఆర్టీసీ సర్వీసులను కూడా వంతెనపై నిషేధించారు. బస్సుల దారి మళ్లింపుపై ఆర్టీసీ అధికారులు సమీక్షిస్తున్నారు. -
అసాధ్యమని తెలిసినా..అదే పల్లవి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : డెల్టా కాలువలను మార్చి 31నాటికి మూసివేయడం అసాధ్యమని తెలిసి కూడా అధికారులు పాత పల్లవే పాడుతున్నారు. డెల్టాలో రబీ వరిసాగులో అసాధారణ జాప్యం జరిగినందున డెల్టా కాలువలకు ఏప్రిల్ 15 తరువాతా నీరు ఇవ్వాలి. ఇది తెలిసీ మూసివేతకు మార్చి 31 గడువు పెట్టడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సోమవారం రాత్రి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కాలువల మూసివేత గడువుపై తుది నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది కాకినాడలో జరిగిన ఇరిగేషన్ ఎడ్వయిజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో మార్చి 31 నాటికి కాలువలు మూసివేయాలని, దీనికితగ్గట్టుగా రబీని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డిసెంబరు నెలాఖరుకు నాట్లు పూర్తికాని చేలల్లో వరి కాకుండా స్వల్పకాలిక, ఆరుతడి పంటలు చేపట్టేలా రైతులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే సకాలంలో నీరందించడంలో ఇరిగేషన్ శాఖాధికారులు, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారు. తూర్పు, మధ్య డెల్టాల్లోని శివారుకు నీరందక సాగు ఆలస్యమైంది. తూర్పు డెల్టాలోని కాకినాడ, కరప, మధ్యడెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు సబ్ డివిజన్లలోని శివారు ఆయకట్టులో సంక్రాంతి తరువాత, ఫిబ్రవరి మొదటి వారంలో నాట్లు పడ్డాయి. ఈ ప్రాంతంలో చేలు ఇంకా పాలుపోసుకునే దశకు రావాలంటే మరో 20, 30 రోజులు పడుతుంది. ఇక్కడ వరి కోతలు ఏప్రిల్ నెలాఖరు వరకూ పూర్తి కావు. వీటికి ఏప్రిల్ 15 వరకూ నీరందించాలి. దీనిని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు.అయినా కలెక్టర్ సమీక్షా సమావేశంలో వారు నోరు మెదపలేదు. మార్చి నెలాఖరుకు కాలువలు మూసివేయాలని నిర్ణయించారు. మరోసారి క్షేత్రస్థాయిలో సాగు పరిస్థితిని పరిశీ లించి, తుది నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్చి 31తో కాలువల మూసివేత : కలెక్టర్ మరమ్మతుల కోసం మార్చి 31 నుంచి గోదావరి డెల్టా కాలువలు మూసివేస్తున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కాలువల మరమ్మతులపై ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సోమవారం రాత్రి ఆయన సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్‌కు మార్చి 31 వరకూ, వచ్చే ఖరీఫ్‌కు జూన్ 15 నుంచి నీరందించాలని, మూసివేత సమయంలో కాలువల ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల అధికారులకు కలెక్టర్ సూచించారు. కాలువల మరమ్మతులను నిర్ణీతవ్యవధిలో పూర్తి చేయాలని, దీనికి రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని అన్నారు. కాలువలు మూసివేసే సమయంలో పంటలకు నష్టం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖ ధవళ్వేశరం సర్కిల్ ఎస్ఈ పి.సుగుణాకరరావు మాట్లాడుతూ, ఆధునికీకరణ పనులు చేపట్టడానికి క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉన్నా, ఆ పరిస్థితి లేనందున కాలువలు మూసివేసే సమయంలో దశలవారీగా మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. పాత కట్టడాలు పాడవకుండా కాలువలు మరమ్మతులు చేపట్టాలని సూచించారని చెప్పారు.