‘నీరు’గారుతోంది... | No Water in for delta canals | Sakshi
Sakshi News home page

‘నీరు’గారుతోంది...

Published Sun, Jun 10 2018 9:06 AM | Last Updated on Sun, Jun 10 2018 9:06 AM

No Water in for delta canals - Sakshi

అమలాపురం: జూన్‌ 1వ తేదీనాటికి సాగునీరు అందిస్తామంటూ సాగునీటి పారుదల శాఖాధికారులు గోదారి మాతకు పూజలు చేసి మరీ నీరు వదిలారు. తొమ్మిది రోజులవుతున్నా కాలువల ద్వారా గోదావరి నీరు పంట చేలకు చేరలేదు. శివారు దేవుడెరుగు.. కాలువలను ఆనుకుని ఉన్న ఆయకట్టుకు సైతం సాగునీరందడం లేదు. డెల్టా ప్రధాన పంట కాలువల లాకుల వరకు నీరు చేరలేదు. ఇందుకు అధికారులు చెప్పే కారణం.. కాలువలపై ఆధునికీకరణ, నీరు– చెట్టు పనులు జరుగుతున్నాయని. క్లోజర్‌ 40 రోజులున్నా పనులు చేయని అధికారులు, చివరి నిమిషంలో హడావిడిగా పనులు ఆరంభించి చేలకు నీరు చేరకుండా అడ్డకట్టు వేయడం ముందుగా నీటి విడుదల ప్రయోజనం ఏమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రానికి ధాన్యాగారం అని పేరొచ్చిందంటే అందుకు కారణం గోదావరి డెల్టా. ఉభయ గోదావరి జిల్లాల్లో 8.96 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. ఖరీఫ్, రబీలలో కలిపి ఈ రెండు డెల్టాల్లో సుమారు 49 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా, రెండు పంటలకు కలిపి 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. గత ఏడాది రాష్ట్రమంతటా కరువు పరిస్థితులు నెలకొన్నా వ్యవసాయ వృద్ధి సాధించిందని ప్రభుత్వం ఘనతగా చెప్పుకుందంటే అందుకు గోదావరి డెల్టాలో పంటలు పండటమే. అటువంటి డెల్టా విషయంలో ప్రభుత్వం తొలి నుంచి శీతకన్ను వేస్తూనే ఉంది. 

ఆధునికీకరణకు అరకొరగా నిధులివ్వడమే కాదు..అవి సకాలంలో ఆరంభించకుండా పనులు ఆలస్యం చేస్తోంది. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు తమకు ముందస్తు సాగు చేసుకునేందుకు మే 15వ తేదీ నాటికి సాగునీరివ్వాలని రైతులు కోరినా జూన్‌ ఒకటో తేదీకి విడుదల చేస్తున్నట్టు చెబుతూ... నెలాఖరు వరకు నీరు రాకుండా చేస్తోంది. ఈ ఏడాది కూడా జూన్‌ ఒకటిని కాలువకు నీరు వదిలారుకాని ప్రధాన లాకుల వద్ద వాటిని బంధించి వేశారు. మధ్య డెల్టాలో లొల్ల లాకుల వద్ద నీరు నిలుపుదల చేసి పి.గన్నవరం, ముక్తేశ్వరం కాలువలకు నీరుపారకుండా చేశారు. శుక్రవారం నుంచి ఈ రెండు కాలువలకు కేవలం 50 క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని మాత్రం అమలాపురం కాలువకు తొలుత 500, తరువాత 300 క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు.

తూర్పు డెల్టాలోను ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక్కడ అన్ని కాలువలకు కలిపి కేవలం 350 క్యూసెక్కులే నీరు విడుదల చేశారు. కాలువలకు నీరందిస్తే అన్ని ప్రాంతాలకన్నా ఇక్కడ ముందస్తుగా సాగు మొదలవుతోంది. నీరంది ఉంటే ఇప్పటికే ఆలమూరు, అనపర్తి వ్యవసాయ సబ్‌ డివిజన్లలో ఇప్పటికే నారుమడులు పడేవి. ధవళేశ్వరం కాకినాడ కాలువ పరిధిలో సామర్లకోట వద్ద వంతెన పనులు జరుగుతున్నాయని కడియం లాకుల వద్ద నిలుపుదల చేశారు. దీంతో అనపర్తి, బిక్కవోలు, ద్వారపూడి మండలాల్లో కొన్ని గ్రామాలకు, సామర్లకోటతోపాటు పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌కు సాగునీరందే అవకాశం లేకుండా పోయింది. ధవళేశ్వరం– మండపేటకు రెండు రోజుల నుంచి అంతంతమాత్రంగా సాగునీరు విడుదల చేశారు. కోటిపల్లి బ్యాంకు కెనాల్, ఇంజరం కాలువలకు ఇంకా నీరందలేదు. ఇదే సమయంలో పశ్చిమ డెల్టాకు పూర్తిస్థాయిలో 4,500 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తుండడం గమనార్హం.

సాగుసమ్మె అంటున్నా లెక్కలేదు
2011లో చేసినట్టుగా ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో సాగుసమ్మె చేస్తామని కోనసీమ రైతులు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు వారు చెప్పే కారణం సకాలంలో నీరివ్వడం లేదని. అయినా అధికారులు లెక్క చేయడం లేదు. పూర్తిస్థాయిలో నీరివ్వలేమని తెగేసి చెబుతున్నారు. 

మే 15 నాటికి నీరెందుకు?
బ్రిటీష్‌ విధానంలో మే 15 నాటికి డెల్టా కాలువలకు నీరు ఇవ్వాలి. అలా చేస్తే జూన్‌ 15 నాటికి నాట్లు పూర్తవుతాయి. అక్టోబరు 15 నాటికి నూర్పుడలవుతాయి. అక్టోబరు 20 నుంచి నవంబరు 20 వరకు ఈశాన్య రుతుపవనాలు, వాయు గుండాలు, తుపాన్ల బారిన పంట పడకుండా ఉంటుంది. డిసెంబరు ఒకటిన రబీ ఆరంభిస్తే మార్చి 31 నాటికి పూర్తవుతుంది. దీనివల్ల రైతులు మూడో పంటగా అపరాలు సాగు చేయవచ్చు. అదనపు ఆదాయంతోపాటు చేనుకు మేలు చేసే పచ్చిరొట్ట ఎరువును అందించే అవకాశముంది. దీనిని దృష్టిలో పెట్టుకునే రైతులు మే 15 నాటికి సాగునీరు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు మాత్రం జూన్‌ ఒకటిన ఇస్తామంటూ నెలాఖరు వరకు నీరు చేలకు అందకుండా చేస్తున్నారు. దీనివల్ల గడచిన తొమ్మిదేళ్లలో (2011, 2016, 2017 మినహా) ఖరీఫ్‌ను, 2010, 2011, 2017లో రబీ పంటకు నష్టం వాటిల్లడం వల్ల రైతులు వేల కోట్ల రూపాయలు కోల్పోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement