no water to crops
-
సాగునీటి పంపిణీలో మాటలు తప్ప చేతలు లేవు..!
సాక్షి, తెర్లాం(శ్రీకాకుళం): సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువను మాత్రం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పిల్ల కాలువలు మంజూరయ్యాయని, వాటిని తవ్వేందుకు రైతుల నుంచి భూములు సేకరిస్తున్నామని అధికారులు పదేపదే చెప్పడమే మిగులుతుందే తప్ప ఇప్పటివరకు పిల్ల కాలువల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారుతున్నాయి’. ఇదీ పరిస్థితి.. నియోజకవర్గంలోని తెర్లాం, బాడంగి, బొబ్బిలి మండలాలను కలుపుతూ తోటపల్లి ప్రధాన కుడికాలువను నిర్మించారు. ఈ కాలువ కింద సుమారు 30 వేల ఎకరాల వరకు మూడు మండలాలకు చెందిన భూములు ఉన్నాయి. వీటిలో తెర్లాం మండలంలోని తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద 10 వేల ఎకరాల భూములు ఉండగా, కేవలం మూడు పిల్ల కాలువల ద్వారా 4 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. మిగిలిన భూములకు చుక్క సాగునీరు కూడా అందడం లేదని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంతంతమాత్రంగా పిల్ల కాలువల నిర్మాణం... నియోజకవర్గంలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల మీదుగా వెళ్తున్న తోటపల్లి ప్రధాన కుడి కాలువకు సంబంధించి బొబ్బిలి, బాడంగి మండలాలకు సంబంధించి ఇంతవరకు పిల్ల కాలువలను ఏర్పాటు చేయలేదు. తెర్లాం మండలంలో 27 కిలో మీటర్ల పరిధిలో తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉండగా కేవలం మూడు పిల్లకాలువలను ఏర్పాటు చేసి, 4వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. తమ పొలాల మీదుగా, గ్రామాల మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉన్నా తమకు ఎటువంటి ప్రయోజనం లేకపోతుందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటలు తప్ప చేతల్లేవ్.. తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువలు ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు పదేపదే ప్రకటిస్తున్నా, అది కార్యరూపం దాల్చడంలేదు. బొబ్బిలి, తెర్లాం మండలాల్లో కొత్తగా పిల్ల కాలువల ఏర్పాటుకు అవసరమైన భూములు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఎటువంటి ఫలితం లేదని రైతులు అంటున్నారు. ఇబ్బంది పడుతున్నాం.. తమ గ్రామం మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ వెళ్తోంది. మా గ్రామానికి పక్క గ్రామం వరకు పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. మా గ్రామానికి చుక్క నీరు కూడా రావడంలేదు. దీంతో తమ భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. పిల్ల కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. –జమ్మల పెంటయ్య, రైతు, సతివాడ, తెర్లాం మండలం. అధికారుల దృష్టికి తీసుకువెళతా.. తోటపల్లి ప్రధాన కుడి కాలువ నుంచి పిల్ల కాలువల ఏర్పాటుకు భూసేకరణ చేయాల్సి ఉంది. తోటపల్లి ఫేజ్–1కు సంబంధించి పిల్ల కాలువలు ఎక్కడెక్కడ ప్రతిపాదనలు చేశారో తెలియదు. ఫేజ్–2కు సంబంధించి పిల్ల కాలువ నిర్మాణ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతా. – దొర, తోటపల్లి ప్రాజెక్టు ఫేజ్–2 ఏఈ, తెర్లాం. -
‘నీరు’గారుతోంది...
అమలాపురం: జూన్ 1వ తేదీనాటికి సాగునీరు అందిస్తామంటూ సాగునీటి పారుదల శాఖాధికారులు గోదారి మాతకు పూజలు చేసి మరీ నీరు వదిలారు. తొమ్మిది రోజులవుతున్నా కాలువల ద్వారా గోదావరి నీరు పంట చేలకు చేరలేదు. శివారు దేవుడెరుగు.. కాలువలను ఆనుకుని ఉన్న ఆయకట్టుకు సైతం సాగునీరందడం లేదు. డెల్టా ప్రధాన పంట కాలువల లాకుల వరకు నీరు చేరలేదు. ఇందుకు అధికారులు చెప్పే కారణం.. కాలువలపై ఆధునికీకరణ, నీరు– చెట్టు పనులు జరుగుతున్నాయని. క్లోజర్ 40 రోజులున్నా పనులు చేయని అధికారులు, చివరి నిమిషంలో హడావిడిగా పనులు ఆరంభించి చేలకు నీరు చేరకుండా అడ్డకట్టు వేయడం ముందుగా నీటి విడుదల ప్రయోజనం ఏమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ధాన్యాగారం అని పేరొచ్చిందంటే అందుకు కారణం గోదావరి డెల్టా. ఉభయ గోదావరి జిల్లాల్లో 8.96 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. ఖరీఫ్, రబీలలో కలిపి ఈ రెండు డెల్టాల్లో సుమారు 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా, రెండు పంటలకు కలిపి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. గత ఏడాది రాష్ట్రమంతటా కరువు పరిస్థితులు నెలకొన్నా వ్యవసాయ వృద్ధి సాధించిందని ప్రభుత్వం ఘనతగా చెప్పుకుందంటే అందుకు గోదావరి డెల్టాలో పంటలు పండటమే. అటువంటి డెల్టా విషయంలో ప్రభుత్వం తొలి నుంచి శీతకన్ను వేస్తూనే ఉంది. ఆధునికీకరణకు అరకొరగా నిధులివ్వడమే కాదు..అవి సకాలంలో ఆరంభించకుండా పనులు ఆలస్యం చేస్తోంది. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు తమకు ముందస్తు సాగు చేసుకునేందుకు మే 15వ తేదీ నాటికి సాగునీరివ్వాలని రైతులు కోరినా జూన్ ఒకటో తేదీకి విడుదల చేస్తున్నట్టు చెబుతూ... నెలాఖరు వరకు నీరు రాకుండా చేస్తోంది. ఈ ఏడాది కూడా జూన్ ఒకటిని కాలువకు నీరు వదిలారుకాని ప్రధాన లాకుల వద్ద వాటిని బంధించి వేశారు. మధ్య డెల్టాలో లొల్ల లాకుల వద్ద నీరు నిలుపుదల చేసి పి.గన్నవరం, ముక్తేశ్వరం కాలువలకు నీరుపారకుండా చేశారు. శుక్రవారం నుంచి ఈ రెండు కాలువలకు కేవలం 50 క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని మాత్రం అమలాపురం కాలువకు తొలుత 500, తరువాత 300 క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. తూర్పు డెల్టాలోను ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక్కడ అన్ని కాలువలకు కలిపి కేవలం 350 క్యూసెక్కులే నీరు విడుదల చేశారు. కాలువలకు నీరందిస్తే అన్ని ప్రాంతాలకన్నా ఇక్కడ ముందస్తుగా సాగు మొదలవుతోంది. నీరంది ఉంటే ఇప్పటికే ఆలమూరు, అనపర్తి వ్యవసాయ సబ్ డివిజన్లలో ఇప్పటికే నారుమడులు పడేవి. ధవళేశ్వరం కాకినాడ కాలువ పరిధిలో సామర్లకోట వద్ద వంతెన పనులు జరుగుతున్నాయని కడియం లాకుల వద్ద నిలుపుదల చేశారు. దీంతో అనపర్తి, బిక్కవోలు, ద్వారపూడి మండలాల్లో కొన్ని గ్రామాలకు, సామర్లకోటతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌కు సాగునీరందే అవకాశం లేకుండా పోయింది. ధవళేశ్వరం– మండపేటకు రెండు రోజుల నుంచి అంతంతమాత్రంగా సాగునీరు విడుదల చేశారు. కోటిపల్లి బ్యాంకు కెనాల్, ఇంజరం కాలువలకు ఇంకా నీరందలేదు. ఇదే సమయంలో పశ్చిమ డెల్టాకు పూర్తిస్థాయిలో 4,500 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తుండడం గమనార్హం. సాగుసమ్మె అంటున్నా లెక్కలేదు 2011లో చేసినట్టుగా ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో సాగుసమ్మె చేస్తామని కోనసీమ రైతులు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు వారు చెప్పే కారణం సకాలంలో నీరివ్వడం లేదని. అయినా అధికారులు లెక్క చేయడం లేదు. పూర్తిస్థాయిలో నీరివ్వలేమని తెగేసి చెబుతున్నారు. మే 15 నాటికి నీరెందుకు? బ్రిటీష్ విధానంలో మే 15 నాటికి డెల్టా కాలువలకు నీరు ఇవ్వాలి. అలా చేస్తే జూన్ 15 నాటికి నాట్లు పూర్తవుతాయి. అక్టోబరు 15 నాటికి నూర్పుడలవుతాయి. అక్టోబరు 20 నుంచి నవంబరు 20 వరకు ఈశాన్య రుతుపవనాలు, వాయు గుండాలు, తుపాన్ల బారిన పంట పడకుండా ఉంటుంది. డిసెంబరు ఒకటిన రబీ ఆరంభిస్తే మార్చి 31 నాటికి పూర్తవుతుంది. దీనివల్ల రైతులు మూడో పంటగా అపరాలు సాగు చేయవచ్చు. అదనపు ఆదాయంతోపాటు చేనుకు మేలు చేసే పచ్చిరొట్ట ఎరువును అందించే అవకాశముంది. దీనిని దృష్టిలో పెట్టుకునే రైతులు మే 15 నాటికి సాగునీరు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం జూన్ ఒకటిన ఇస్తామంటూ నెలాఖరు వరకు నీరు చేలకు అందకుండా చేస్తున్నారు. దీనివల్ల గడచిన తొమ్మిదేళ్లలో (2011, 2016, 2017 మినహా) ఖరీఫ్‌ను, 2010, 2011, 2017లో రబీ పంటకు నష్టం వాటిల్లడం వల్ల రైతులు వేల కోట్ల రూపాయలు కోల్పోయారు. -
ఎత్తికోతల పథకాలు
‘ఒక్క ఎకరానూ ఎండనివ్వం. సాగునీరు సమృద్ధిగా అందిస్తాం’ అంటూ కోతలు కోస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేస్తోంది. ఫలితంగా ఏ ఎత్తిపోతల నుంచీ నిర్దేశించిన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించలేని దుస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలకు గుండెకోత తప్పడం లేదు. పొరుగు జిల్లాకు నీరు తరలించడం కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రూ.1300 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం జిల్లాలోని పథకాలపై సీతకన్ను వేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. కొవ్వూరు : కాలం చెల్లిన విద్యుత్ మోటార్లు, పంపు సెట్లు, పూడిపోయిన కాలువలతో జిల్లాలోని ఎత్తిపోతల పథకాలు అస్తవ్యస్తంగా మారాయి. సామర్థ్యం మేరకు పనిచేయడం లేదు. సగం ఆయకట్టుకీ సాగునీరు అందించలేని దుస్థితిలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గోదావరి నదితోపాటు వాగులు, కాలువలపై 28 ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి ద్వారా 54,247 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. అయితే ఈ పథకాలు మరమ్మతులకు గురయ్యాయి. సామర్థ్యం మేరకు పనిచేయడం లేదు. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. నాలుగు దశాల క్రితం నిర్మించిన పథకాలకూ మరమ్మతులు చేయించడం లేదు. నిధులు విడుదల చేసినా.. జాప్యం రైతులు పోరుతుండడంతో ఎట్టకేలకు నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎనిమిది పథకాల మరమ్మతులకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. తాళ్లపూడి మండలంలోని 5,800 ఎకరాలకు నీరందించే వేగేశ్వరపురం ఎత్తిపోతల ప«థకానికి గరిష్టంగా రూ.8.32 కోట్లు కేటాయించింది. ఈ పథకం పనులకు టెండర్ల ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.750 ఎకరాలకు నీరందించే పోలవరం ప«థకానికి, అప్పారావు చానల్‌పై ఉన్న బ్రాహ్మణగూడెం పథకానికి రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులకుS సంబంధించి ఇంకా పరిపాలనా ఆమోదం రాలేదని అధికారులు చెబుతున్నారు. పెదతాడేపల్లి, ఆరుళ్ల పథకాలకు రూ.20 లక్షలతోనూ, నిడదవోలు పథకానికి రూ.25 లక్షలతోనూ మరమ్మతులు చేసేందుకు మాత్రం టెండర్లు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. బుట్టాయిగూడెం మండలంలో గాడిద బోరు–1,2 పథకాల మరమ్మతు పనులకు రూ.38 లక్షలు మంజూర య్యాయి. ఈ పనుల టెండర్ల ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాలేదు. టెండర్ల ప్రక్రియ అంతా హైదరాబాద్‌లో ఏపీఎస్ఐడీసీ సంస్థ చేపట్టడం వల్ల జాప్యం జరుగుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పథకాల మూత జిల్లాలో పోలవరం, తాళ్ళపూడి, కొవ్వూరు మండలాల్లో గోదావరి నది పొడవునా పది ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటిల్లో పోలవరం ముంపు ప్రాంతంలో 1,050 ఎకరాలకు నీరందించే వాడపల్లి, చీడూరు, శివగిరి పథకాలు పూర్తిగా మూతపడ్డాయి. మరో వెయ్యి ఎకరాలకు నీరందించే తూటిగుంట, సింగన్నపల్లి అవసాన దశలో ఉన్నాయి. మిగిలిన ఐదు ప«థకాలు గూటాల, పైడిమెట్ట, వేగేశ్వరపురం, కుమారదేవం, కడెమ్మ ఎత్తిపోతల పథకాల ద్వారా 16,190 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా.. కేవలం 7వేల ఎకరాలకు నీరందుతోంది. అదే రబీ సాగులో అయితే 6,580 ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నారు. వీటిలో కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.1.75 కోట్లతో ఆధునికీకరించారు. వేగేశ్వరపురం పథకం మోటార్లు, పంపులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాలువలు చాలా చోట్ల పూడుకుపోయాయి. నిధులు మంజూరైనా పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. పైడిమెట్ట ఎత్తిపోతల పథకం సబ్ పైపులైన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే తప్ప పూర్తిస్థాయి ఆయకుట్టుకు నీరందని దుస్థితి. ఆరికిరేవులను విస్మరించిన ప్రభుత్వం రూ.15.19 కోట్లతో 2006 మార్చి 20న ప్రారంభమైన ఈ పథకం నిర్మాణ పనులు ఈ ఏడాదిలో పూర్తికావాల్సి ఉంది. ఇప్పటికి తొంభై శాతం పనులు పూర్తయినా అసంపూర్తిగా ఉంది. దీనిని పూర్తి చేస్తే మూడు మండలాల పరిధిలో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ పథకాన్ని మంజూరు చేశారు. ఆయన మృతి చెందే సమయానికి తొంభై శాతం పనులు పూర్తయ్యాయి. రైతుల అభ్యంతరాలతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. అనంతరం వచ్చిన పాలకులు చొరవ చూపకపోవడంతో ఎనిమిదేళ్లుగా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే రూ.12.5కోట్లు వెచ్చించినా పథకం నిరుపయోగంగా పడి ఉంది. ప్రధాన పైపులైన్ పనులు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ పనులు పూర్తి చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసినా ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వేగేశ్వరపురం పనులు త్వరగా పూర్తిచేయాలి వేగశ్వరపురం పథకం కింద సాగుచేస్తున్న రైతులు నీళ్లు అందక అవస్థలు పడుతున్నారు. ఈ పథకం మరమ్మతులకు నిధులు మంజూరు చేసినా టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీనిని పూర్తిచేసి పనులు వెంటనే మొదలు పెట్టాలి. ఖరీఫ్ సీజన్ ముగిసిన Ðð ంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. –కైగాల రాంబాబు, వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షుడు టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు జిల్లాలో ఎనిమిది ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. మూడు పథకాలకు ఇటీవలే టెండర్లు పూర్తయ్యాయి. వేగేశ్వరపురం ప«థకం టెండర్ల ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. మిగిలిన పథకాలూ టెండర్ల దశలో ఉన్నాయి. వచ్చే నెల నుంచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. –ఈ.పూర్ణచంద్రరావు, ఈఈ, ఏపీఎస్ఐడీసీ