– వాడీవేడిగా ఐఏబీ సమావేశం
– శ్రీశైలం నీటిమట్టంపై చర్చ
– సాగర్‌కు నీటి విడుదలపై ఎమ్మెల్యేల ఆగ్రహం
– కృష్ణా జలాల్లో సీమ వాటాపై చర్చకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పట్టు
– సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించిన కలెక్టర్
– ఎమ్మెల్యేలు, రైతు సంఘాల మండిపాటు
కర్నూలు సిటీ:
ఆయకట్టుకు సాగునీటి కేటాయింపులు, వాటానీటి విడుదల, కృష్ణా, తుంగభద్ర జలాల్లో రావాల్సిన వాటా తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఐఏబీ సమావేశం ఆద్యంతం ఎమ్మెల్యేలు, సభ్యుల ఆగ్రహావేశాల మధ్య సాగింది. శ్రీశైలంలో నీటి చేరికలు మొదలైన వెంటనే సాగర్‌కు నీటి విడుదలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ గేయానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి రైతు సంఘాల నేతలు మద్దతు, అ«ధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం గొంతు కలపడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఐఏబీ చైర్మన్, కలెక్టర్ సీహెచ్.విజయమెహన్, ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, ఐజయ్య, గౌరు చరితా రెడ్డి, ఎస్వీ మెహన్‌రెడ్డి, భూమానాగిరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, జయ నాగేశ్వరరెడ్డి, కడప జిల్లా మైదుకూరు, కమలాపురం ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీం«ద్రానాథ్‌రెడ్డి, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ చైర్మన్‌లు కూమార్ గౌడు, జనార ్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు.. గత తీర్మానాలపై సమావేశాన్ని మొదలు పెట్టారు. బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని గోరుకల్లు, ఆవుకు రిజర్వాయర్ల ప్రస్థావనఅజెండాలో లేకపోవడంపై ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. అజెండాలో లేకుండా మీటింగ్‌కు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. తెలుగుగంగా నుంచి కడప జిల్లాకు రావాల్సిన వాటా? ఈ ఏడాది నీటి కేటాయింపుతోపాటు కాల్వ లైనింగ్ పూర్తి చేయకపోవడంపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు.
874 అడుగుల నీటిమట్టంపై తీర్మానం..
శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి చేరికలు ప్రారంభమైన మరుక్షణమే ఈ ప్రాంతంలోనీ తాగునీటి అవసరాలను కాదని సాగర్‌కు నీరెలా తీసుకపోతారంటూ ఎమ్మెల్సీ గేయానంద్ అధికారులను నిలదీశారు. కనీస నీటిమట్టానికి సంబంధించి 69, 107 జీఓలపై వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆయన చర్చకు పట్టుబట్టారు. అది సర్కారు నిర్ణయమని ఎస్‌ఈ పేర్కొనడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రతిపక్షంతో గొంతు కలిపారు. శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టం మెయిన్‌టెన్ చేయడంతోపాటు ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు 874 అడుగులకుపైగా ఉంటేనే సాగర్‌కు నీటిని విడుదల చేయాలని తీర్మానించారు. కృష్ణా జలాల్లో సీమకు వాటా మేరకు నీరివ్వాలని, తెలుగుగంగ నుంచి కడప జిల్లా బ్రహ్మసాగర్‌కు 12 టీఎంసీలు విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా వెలుగోడులో నీటి మట్టం పెరిగిన వెంటనే నీటిని పెంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.
పట్టిసీమపై ఉన్న శ్రద్ధ.. సీమ ప్రాజెక్టులపై ఏదీ..
కృష్ణాడెల్టాకు గోదావరి జలాలు తెచ్చేందుకు చేపట్టిన పట్టిసీమను ఏడాదిలోగా పూర్తి చేస్తే...రాయల సీమ ప్రాజెక్టులు చేపట్టి దశాబ్దాలు గడుస్తున్నా జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు సర్కారుపై ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు లబ్ధీ చేకూర్చేందుకే ఇలాచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పందిస్తూ పార్టీలకు అతీతంగా సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ప్రతిపక్ష పాత్రలో అధికార పక్షం
ఐఏబీ సమావేశంలో ఆయకట్టు సమస్యలపై అధికాపార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ అసమర్థత, అధికారుల నిర్లక్ష్యంపై దుమ్మెత్తిపోశారు. ఇంకెన్నాళ్లు రైతులతో ఆడుకుంటారంటూ మండిపడ్డారు. ఎస్సార్‌బీసీకి నీరిస్తామని మంత్రి ఇటీవలే ప్రకటించడంతో రైతులు నారుమళ్లు పోసుకున్నారని, ఇప్పటికీ ప్రధాన కాల్వకు నీరు విడుదల చేసే పరిస్థితి లేకపోతే మీరెందుకంటూ ఎమ్మెల్యే బీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీ బోర్డు అధికారులను ఐఏబీకి పిలవకపోవడం, ప్రాజెక్టు కమిటీలు, నీటి సంఘాల గురించి పట్టించుకోకపోవడంపై ఎల్లెల్సీ చైర్మన్ కుమార్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యలోనే వెళ్లిపోయిన కలెక్టర్
సాగునీటి కాల్వలకు నీటి విడుదల షెడ్యూల్, కేటాయింపులపై చర్చించి తీసుకునేందుకు ఉద్దేశించిన ఐఏబీ సమావేశం పూర్తికాకుండానే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఉందంటూ కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యేలు, రైతు సంఘాల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ డౌన్...డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఇంజనీర్లతో వాదనకు దిగారు.