బెంగళూరు: ఇన్‌సైడర్ ట్రేడింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అంతర్జాతీయ అడ్వైజరీ బోర్డు సూచించింది. ఇందులో భాగంగా ఈ నేరాలకు పాల్పడే వారి పరువు తీసే విధంగా కఠినమైన చర్యలు (నేమింగ్, షేమింగ్) తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అంతర్జాతీయ అడ్వైజరీ బోర్డు సూచించింది.
ఇలాంటి కేసుల్లో ఎలాంటి సెటిల్‌మెంట్‌కి అంగీకరించరాదని, భారీ పెనాల్టీలు విధించాలని పేర్కొంది. భారీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులను సెబీ వెబ్‌సైట్లో ప్రత్యేక సెక్షన్‌లో పొందుపర్చాలని తెలిపింది. అలాగే, ఇన్‌సైడర్ ట్రేడింగ్ మోసాల్లో నష్టపోయిన బాధితులకు తగు స్థాయిలో పరిహారం లభించేలా నిబంధనలు రూపొందించాలని బోర్డు తెలిపింది. అన్ని కేసులకూ ఒకే ఫార్ములా రీతిలో కాకుండా ఆయా సందర్భాలను బట్టి పరిహారం పరిమాణాన్ని నిర్ణయించాలని అభిప్రాయపడింది. రెండు రోజుల పాటు జరిగిన సమావేశం అనంతరం ఐఏబీ ఈ మేరకు సూచనలు చేసింది.