టెక్నాలజీతో ఇన్‌సైడర్స్‌కి చెక్‌ | Sebi steps up surveillance on money laundering activities | Sakshi
Sakshi News home page

టెక్నాలజీతో ఇన్‌సైడర్స్‌కి చెక్‌

Published Wed, Aug 16 2017 12:42 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

టెక్నాలజీతో ఇన్‌సైడర్స్‌కి చెక్‌ - Sakshi

టెక్నాలజీతో ఇన్‌సైడర్స్‌కి చెక్‌

♦  సోషల్‌ మీడియాపైనా నిఘా ∙
ఇన్‌సైడర్లు, ఇన్వెస్టర్ల మధ్య లింకులపై సెబీ దృష్టి


ముంబై: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను అరికట్టే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా కొత్త వ్యూహాలు అనుసరిస్తోంది. తాజాగా ఫేస్‌బుక్, ట్వీటర్‌ వంటి సామాజిక మాధ్యమాలపైనా దృష్టి పెట్టింది. సంప్రదాయ మార్గాల్లో పట్టుబడని ఇన్‌సైడర్లు, ఇన్వెస్టర్ల మధ్య లింకులను మరింత లోతుగా పరిశీలిస్తోంది. ఇటీవల వెలుగుచూసిన కొన్ని కేసులే దీనికి ఉదాహరణ. కొన్నాళ్ల క్రితం ఒక కంపెనీ కీలక ప్రకటన చేయడానికి సరిగ్గా కొద్ది రోజుల ముందు ఒక అరవై ఐదేళ్ల మహిళ అసాధారణ స్థాయిలో ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేయడం సెబీ దృష్టికి వచ్చింది.

 ఇందులో కచ్చితంగా ఇన్‌సైడర్‌ కోణం ఉంటుందని భావించిన సెబీ.. పలు సంప్రదాయ మార్గాల్లో కేసును పరిశీలించినా సరైన ఆధారాలు చిక్కలేదు. దీంతో సామాజిక మాధ్యమాలపై దృష్టి పెట్టింది. డీల్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకరుకు, ఆమెకు సోషల్‌ మీడియాలో పరిచయం ఉన్నట్లు గుర్తించింది. ఆమె కుమార్తెను వివాహమాడే ప్రయత్నాల్లో ఉన్న బ్యాంకరు .. ఒక వివాహ పరిచయ వేదిక ద్వారా కీలకమైన కార్పొరేట్‌ సమాచారాన్ని ఆమెకు చేరవేసి ఉండొచ్చని, తద్వారా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు తెరతీశారని గుర్తించిన సెబీ తదనుగుణంగా చర్యలకు శ్రీకారం చుట్టింది.

అలాగే, ఫేస్‌బుక్‌ మాధ్యమం ద్వారా చెన్నైకి చెందిన ఒక ఇన్వెస్టరు, ఓ కంపెనీ అధికారి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన సంగతీ సెబీ కనిపెట్టింది. కంపెనీ షేరు భారీగా పెరిగే సమాచారం గల సదరు అధికారి.. ఫేస్‌బుక్‌ మాధ్యమం ద్వారా చెన్నై ఇన్వెస్టరును బినామీగా ఉపయోగించుకుని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన అంశాన్నీ నిర్ధారించింది. ఈ రెండు కేసుల్లోనూ సెబీ ఇంకా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఇక, ఈ కోవకే చెందిన  పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ కేసు విషయంలో దాదాపు 15 మంది రూ. 2.2 కోట్ల మేర అనుచిత లబ్ధి పొందినట్లు గుర్తించిన సెబీ ఆ మొత్తాన్ని జప్తునకు ఆదేశించింది.  

వాదనలు నిలబడేనా...: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడే వారిని పట్టుకునేందుకు సెబీ సోషల్‌ మీడియాను సైతం జల్లెడపడుతున్నప్పటికీ.. వాటి ఆధారంగా నేరాన్ని రుజువు చేయడం కష్టతరం కావొచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ మీడియాలో మిత్రులైనంత మాత్రాన వారు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి ఉంటారని నిర్ధారించడానికి వీలు ఉండదని వారు చెబుతున్నారు.

ఇందుకోసం మరింత బలమైన సాక్ష్యాధారాలు అవసరమవుతాయని, లేదంటే నిందితులు అప్పీలుకు వెళ్లిన పక్షంలో సెబీ వాదనలు వీగిపోవచ్చని అంటున్నారు. ఇక, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలపై చాటింగ్, కాల్‌ రికార్డులు కూడా సెబీకి అందుబాటులో ఉండవు. మిగతా యూజర్ల తరహాలోనే బహిరంగంగా కనిపించే సమాచారం పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్‌సైడర్‌ ట్రేడర్లు ఎటువంటి ఆధారాలు లభించకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారనేది న్యాయనిపుణుల అభిప్రాయం.   

వినూత్న వ్యూహాలు...
ఇన్‌సైడర్‌ సమాచారంతో చట్టవిరుద్ధమైన మార్గాల్లో  స్టాక్‌మార్కెట్ల నుంచి ప్రయోజనం పొందుతున్న వారిని గుర్తించే క్రమంలో సోషల్‌ మీడియాను క్షుణ్నంగా పరిశీలించేందుకు సెబీ.. టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తోంది. చట్టాలను ఉల్లంఘించేవాళ్లు చాలా తెలివిగా సంప్రదాయ మాధ్యమాల్లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడతారని, అందుకే సెబీ ఈ తరహా వినూత్న వ్యూహాలను అమలు చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. చాలా మటుకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసుల్లో లావాదేవీలు ఇన్‌సైడర్‌ లేదా వారికి సన్నిహితులు కాకుండా పూర్తిగా అపరిచితుల పేర్ల మీద జరుగుతూ ఉంటాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటివి గుర్తించేందుకే సెబీ కూడా అసాధారణ వ్యూహాలు అమలు చేస్తోందని అధికారులు తెలిపారు.  

స్టాక్‌ మార్కెట్లో నల్లధనంపై సెబీ ఉక్కుపాదం!
అనుమానిత సంస్థలు, బ్రోకర్లపై నిఘా
రికార్డుల తనిఖీలు ఇతర దర్యాప్తు
సంస్థలకు సహకారం


న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లను నల్లధన ప్రవాహానికి వేదిక చేసుకోకుండా నివారించే చర్యల్ని నియంత్రణ సంస్థ సెబీ ముమ్మరం చేసింది. అనుమానిత సంస్థలు, బ్రోకర్లపై దృష్టి సారించింది. అంతేకాదు, ఈ విషయంలో ఇతర నియంత్రణ సంస్థలు, దర్యాప్తు సంస్థలతో సహకారాన్ని ముమ్మరం కూడా చేసింది. చాలా షేర్లలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలకు సంబంధించి ఆదాయపన్ను శాఖ నుంచి 2016–17లో తమ దృష్టికి వచ్చిన కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉందని సెబీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

దర్యాప్తు కోసం మొత్తం 245కేసులను తీసుకోగా, వాటిలో 155 కేసుల్లో దర్యా ప్తు పూర్తయినట్టు తెలిపింది. 2015–16లో మొత్తం కేసులు 133గా ఉండగా, 123 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసినట్టు వివరించింది. ఐటీ, ఇతర పరికరాల సాయంతో దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్టు పేర్కొంది. నిఘా చర్యల్లో భాగంగా స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు, డిపాజిటరీలతో గతేడాది భేటీ కూడా నిర్వహించినట్టు తెలిపింది. పన్ను ఎగవేతకు స్టాక్‌ ఎక్సే్చంజ్‌లను దుర్వినియోగం చేసుకున్న కేసుల్లో అనుమానిత బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లపై తనిఖీలను ముమ్మరం చేసినట్టు పేర్కొంది.

వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్ల ఖాతా పుస్తకాలు, ఇతర పత్రాలను తనిఖీ చేసినట్టు వివరించింది. మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లను ఇన్వెస్టర్లకు పంపడం పెరిగిపోయిందని, కొన్ని కేసుల్లో చర్యలు కూడా తీసుకున్నట్టు తెలిపింది. ఏఎంఎల్, సీఎఫ్‌టీ నిబంధనల అమలులో లోపాలకు సంబంధించి బీఎస్‌ఈ 195 సంస్థలపై, సీడీఎస్‌ఎల్‌ 236 సంస్థలపై, ఎంసీఎక్స్‌ 59 సంస్థలపై, ఎన్‌ఎస్‌ఈ 27 సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement