‘నేను బతికే ఉన్నా’
ఐ.పోలవరం :రికార్డుల్లో చనిపోయినట్టు చూపించి పింఛను తొలగించడంతో ‘నేను బతికున్నాను’ అంటూ జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఓ మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులను మొరపెట్టుకుంది. ఐ.పోలవరం గ్రామంలో గురువారం జరిగిన ‘జన్మభూమి’ గ్రామసభలో ఈ సంఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పాటి సత్యవతి చనిపోయినట్టుగా అధికారులు రికార్డుల్లో చూపించి ఆమె పింఛను తొలగించారు. సత్యవతి భర్త సుబ్బారావు అనారోగ్యంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ 2010 మార్చి 23న మరణించాడు. ఈ మేరకు మరణ ధ్రువీకరణ పత్రాన్ని అప్పట్లో ఆమె అధికారుల వద్ద తీసుకుంది.
ఈ క్రమంలో నాలుగేళ్లుగా ఆమె వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ప్రభుత్వం గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పింఛను లబ్ధిదారుల సర్వే నిర్వహించింది. ఆ కమిటీ సభ్యులకు కూడా తన ఆవేదనను వెళ్లగక్కి, వితంతు పింఛను మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. ఆమె చనిపోయినట్టుగా రికార్డుల్లో ఉందని గుర్తించారు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి, పింఛను మంజూరు చేయలేమని దరఖాస్తును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ‘జన్మభూమి’ గ్రామసభలో ఆమె అధికారులు, ప్రజాప్రతినిధుల ముందు తన ఆవేదన వెళ్లగక్కింది.
దీనిపై ఎమ్మెల్యే బుచ్చిబాబు, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్.. ఎంపీడీఓ, తహశీల్దార్, పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. ఆమె బతికుండగా చనిపోయినట్టు ఎలా నమోదు చేశారంటూ ప్రశ్నించారు. ఎంపీడీఓ అప్పారావు సమాధానమిస్తూ రికార్డుల నమోదులో తప్పిదం జరిగిందంటూ చెప్పారు. దీంతో ఎమ్మెల్యే , జెడ్పీటీసీ సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పిదాల వల్ల ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. ఇటువంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రికార్డులు సరిచేసి పింఛను అందేలా చర్యలు తీసుకొంటామని సత్యవతికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.