మున్సిపాలిటీలను ముంచేశారు! | Chandrababu Govt Used Municipal Accounts For Pasupu kunkuma | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలను ముంచేశారు!

Published Mon, May 6 2019 3:04 AM | Last Updated on Mon, May 6 2019 5:25 AM

Chandrababu Govt Used Municipal Accounts For Pasupu kunkuma - Sakshi

విశాఖ సిటీ: ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు ప్రభుత్వ ఖజానాని దొరికింది దొరికినట్లే ఖాళీ చేసిన చంద్రబాబు సర్కారు నిర్వాకాలు శాఖల వారీగా బయటపడుతూనే ఉన్నాయి. పసుపు కుంకుమ కోసం వివిధ శాఖల ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్ని దారిమళ్లించిన ప్రభుత్వం.. తాజాగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌నూ ఊడ్చేసిన వ్యవహారం బయటకు వచ్చింది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పర్సనల్‌ డిపాజిట్‌(పీడీ) అకౌంట్‌ మొత్తాన్ని ఖాళీ చేయడంతోపాటు మున్సిపాలిటీలు, వివిధ కార్పొరేషన్ల ట్యాక్స్‌ కలెక్షన్, బీపీఎస్‌ ఫీజులుండే అకౌంట్‌ అయిన 002ను కూడా ఊడ్చేసింది. దీంతో ఈ ఖాతాలో ప్రస్తుతం బ్యాలెన్స్‌ జీరో చూపిస్తోంది. మార్చిలోనే మొత్తం ఖాతాలన్నింటిని ప్రభుత్వం ఖాళీ చేసిందని మున్సిపల్‌ అధికారులు వాపోతున్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వ విభాగాలు..
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ విభాగాల్ని, ఉద్యోగుల్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఓటర్లకు తాయిలాలు పంచడానికి అన్ని శాఖల నుంచి అడ్డగోలుగా నిధులు మళ్లించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్‌ ఖాతాలు ఒక్కొక్కటిగా ఖాళీ కాగా.. ప్రభుత్వం మాత్రం సీఎంఎఫ్‌ఎస్‌లో లోపాలు తలెత్తాయంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. పింఛన్లు, పసుపు కుంకుమ పేరుతో ఓట్ల కొనుగోలుకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పసుపు కుంకుమ కోసం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలకు ఎసరు పెట్టిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్‌లను నిలువునా ముంచేసింది. వీటికి సంబంధించిన సొమ్ముల్ని పథకాల కోసం దారి మళ్లించేసింది.

మార్చిలోనే పీడీ అకౌంట్లు ఖాళీ
ప్రతి మున్సిపాలిటీకీ, కార్పొరేషన్‌కు ట్రెజరీలో పర్సనల్‌ డిపాజిట్‌ (పీడీ) అకౌంట్‌ ఉంటుంది. ఇందులో ఆయా సంస్థలకు వచ్చిన నిధులు జమ అవుతుంటాయి. ఈ నిధులన్నింటినీ ప్రభుత్వం మార్చి 31 నాటికే వాడేసుకుంది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని పీడీ అకౌంట్‌లు ప్రస్తుతం జీరో బ్యాలెన్స్‌ను చూపిస్తున్నాయి. ఉదాహరణకు.. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)కి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.26 కోట్లు, స్టాంపు డ్యూటీ రూ.12 కోట్లు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం విడుదల చేసిన రూ.12 కోట్లు, మార్చి మొదటి వారంలో విడుదల చేసిన ఎస్‌సీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.27 కోట్లు పీడీ అకౌంట్‌లో ఉండేవి. మార్చి 31న ఈ నిధులన్నీ.. ఒకేసారి మాయమైపోయాయి. ఇలా.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన పీడీ అకౌంట్లలో సుమారు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్లను సర్కారు దారి మళ్లించేసింది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లు మినహా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పన్నుల వసూళ్లు, బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ (బీపీఎస్‌)కు సంబంధించిన ఫీజులతోపాటు వివిధ వసూళ్లన్నీ ట్రెజరీలో 002 నంబర్‌తో ఉన్న పీడీ అకౌంట్‌లో నిక్షిప్తమై ఉంటాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం మార్చి మూడో వారం వరకూ పన్నుల వసూళ్లతో ఈ 002 అకౌంట్‌ కళకళలాడుతూ ఉండేవి. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు రూ.500 కోట్లకుపైనే 002 అకౌంట్‌లో ఉండేవని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

పంపించిన బిల్లులు వెనక్కి..
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్‌ బిల్లులన్నింటినీ మార్చి 31 అర్ధరాత్రి లోపు పంపించాలంటూ మున్సిపల్‌ పరిపాలన – పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికనుగుణంగా అన్ని బిల్లుల్నీ పంపించిన స్థానిక సంస్థలకు సర్కారు మొండిచేయి చూపింది. బిల్లులకు సంబంధించిన డబ్బులు మంజూరయ్యేలోపే ఉన్నదంతా ఊడ్చేసింది. చిన్న చిన్న కొర్రీలు వేస్తూ బిల్లులు తప్పుగా పంపించారంటూ వెనక్కు పంపడంతో అధికారులు, సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. ఇలా ప్రభుత్వం తన ఎన్నికల ప్రలోభాల కోసం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌నూ వాడేసుకుందని వాపోతున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి దాదాపు రూ.45 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. వీటిని కచ్చితంగా మంజూరు చేయాల్సి వస్తుందని కొర్రీలు వేసి సుమారు రూ.20 వేల కోట్ల బిల్లులను ఆయా విభాగాలకు తిప్పి పంపించేశారు. ఇప్పుడు మాత్రం కేవలం రూ.25 వేల కోట్లు బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయనీ సర్కారు దొంగ లెక్కలు చెబుతోంది. ఈ బిల్లుల భారమంతా.. 2019–20 ఆర్థిక సంవత్సరంపై భారం పడనుందనీ.. దీని వల్ల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement