ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మహిళలు బ్రహ్మరథం పట్టారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో పాటు.. ప్రాంతాలకతీతంగా మహిళలంతా ముక్తకంఠంతో జననేతకు జై కొట్టారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసి.. తీరా ఎన్నికల వేళ పసుపు–కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెడదామనుకున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పారు..
సాక్షి, అమరావతి : తమను గెలిపిస్తుందని చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న పసుపు – కుంకుమ పథకం టీడీపీని చావు దెబ్బే తీసింది. ఐదేళ్లుగా అనేక రకాలుగా మోసం చేసినా రాష్ట్రంలో 95 లక్షల మంది దాకా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందు ఏదో ఒక తాయిలం ఇస్తే వాళ్ల ఓట్లన్నీ తనకే పడతాయని భ్రమల్లో ఉన్న టీడీపీ అధినేతకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు మహిళలను విశేషంగా ఆకట్టుకోవడంతో వైఎస్సార్‌సీపీకి వారంతా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లుండగా.. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 3,13,33,631 మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 1,98,79,421 మంది మహిళా ఓటర్లే. కాగా 1,57,87,759 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహిళలు అత్యధికంగా ఓట్లు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా.. మొత్తం సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది.
మాఫీ పేరుతో మాయ
మొత్తం 1.98 కోట్ల మంది మహిళా ఓటర్లలో దాదాపు కోటి మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్నికల వాగ్దానంలో భాగంగా తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. జీరో వడ్డీ పథకానికి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల తాయిలం ప్రకటించారు. సరిగ్గా పోలింగ్‌కు రెండురోజుల ముందు ప్రభుత్వ ఖజానా నుంచి డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చారు. దీంతో మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే పడ్డాయని, గెలుపు తమదేనని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. తీరా టీడీపీకి మహిళలు దిమ్మ తిరిగిపోయే ఫలితాన్నివ్వడంతో డీలాపడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment