రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కారు బెదిరిస్తోంది
తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే.. వెంటనే అతని ఆస్తులను ధ్వంసం చేసింది
పోటీ చేయడానికి వీల్లేదంటూ బెదిరించింది.. సంఖ్యా బలం లేకపోయినా అధికారాన్ని లాక్కునేందుకు అరాచకం సృష్టిస్తోంది
మాజీ మంత్రులు అంబటి, వెలంపల్లి, వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం
టీడీపీ నేతల ఆగడాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు
విప్ ఉల్లంఘించిన వారు డిస్ క్వాలిఫై అవుతారని వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేషన్లు(corporations ), మున్సిపాలిటీల(municipalities) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం బెదిరిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యకాండను అడ్డుకుని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏపీ ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాశ్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకులు అంకంరెడ్డి నారాయణమూర్తి, కొమ్మూరి కనకారావు కలిసి వినతి పత్రం అందజేశారు.
బెదిరించి లాక్కోవడం దుర్మార్గం
మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి డిప్యూటీ మేయర్ పదవికి వైఎస్సార్‌సీపీ తరఫున శేఖర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆయన ఆస్తులను ధ్వంసం చేశారని, భవనాలను కూల్చేశారని మండిపడ్డారు. పోటీ చేయడానికి వీల్లేదంటూ ఆయన్ని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మేయర్ శిరీష వెళితే ఆమెనూ అడ్డుకున్నారని దుయ్యబట్టారు. బహిరంగంగా రాజీనామా చేసి వస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని చంద్రబాబు చెబుతున్నారని.. కార్పొరేటర్లకు ఆ నిబంధన వర్తించదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన వారిని ప్రలోభపెట్టి లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. విప్‌ను ఉల్లంఘిస్తే డిస్‌క్వాలిఫై అవుతారని హెచ్చరించారు.
నిజాయితీగా పనిచేసే అధికారులను నియమించి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరామని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి.. తాను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నాడని, పవన్‌కళ్యాణ్ ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించడం సమంజçÜం కాదన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి పార్టీలకు బలం లేని చోట ఎందుకు పోటీకి దిగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్లా వైఎస్సార్‌సీపీకే బలం ఉందని చెప్పారు. టీడీపీ గెలిచే అవకాశమే లేదని తెలిసినా.. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అడ్డదారుల్లో గెలవడం కోసం ఇంత దారుణంగా ప్రయత్నించడం ఎక్కడా చూడలేదన్నారు. పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment