ఆరని అసమ్మతి సెగలు
- అవినీతిపరుల విషయం తేల్చనిదే సంస్థాగత ఎన్నికలు జరగనివ్వం
- పీఏ, ఆయన అనుచరుల అవినీతిపై పట్టుబట్టిన అసమ్మతి నాయకులు
హిందూపురం అర్బన్ : హిందూపురం నియోజకవర్గ టీడీపీలో అమస్మతి సెగలు ఆరిపోకపోగా రోజురోజుకూ ఎగసిపడుతున్నాయి. ఇక్కడి పరిస్థితిని చక్కదిద్ది సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని విచ్చేసిన పార్టీ పరిశీలకుడు కృష్ణమూర్తి ఎదుట అసమ్మతి నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, మహిళా సంఘాల నాయకులు హాజరై ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్, అతని అనుచరులుగా చెలామణి అవుతున్న చిలమత్తూరు, లేపాక్షి ఎంపీపీలు చేసిన అవినీతిపై ఏకరువు పెట్టారు. అవినీతిపరులను పార్టీ, పదవుల నుంచి తప్పించకపోతే భవిష్యత్తులో పార్టీకి ఆదరణ లేకుండా పోతుందని చెప్పుకొచ్చారు.
మూడు రోజులుగా నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి అక్కడి నాయకులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్న కృష్ణమూర్తి శనివారం రాత్రి హిందూపురంలోని అంబికా లక్ష్మీనారాయణ నివాసంలో అసమ్మతి నాయకులు, కొన్ని సంఘాల వారితో సమావేశమయ్యారు. చిలమత్తూరు, లేపాక్షికి చెందిన నాయకులు పీఏ శేఖర్ కారణంగా తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అలాగే శేఖర్ వసూళ్ల పర్వాన్నీ వివరించారు.
ఆయన అవినీతి, అక్రమాలు, అతని అనుచరుల దురాగతాలపై నిగ్గు తేల్చనిదే పార్టీ సంస్థాగత ఎన్నికలను జరగనిచ్చేది లేదని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు తేల్చి చెప్పారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీలో ముఖ్యమైన నాయకులతోపాటు చాలామంది సభ్యత్వాలు కూడా తీసుకోలేదన్నారు. గతంలో సభ్యత్వ నమోదులు, ఓటరు జాబితా చూసి పేర్లు రాసుకుని ఆయా గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో రూ.లక్షలు వసూలు చేశారన్నారు. అర్హులైన కార్యకర్తల పేర్లు కూడా నమోదు కాలేదని మండిపడ్డారు.
లక్షలాది రూపాయల వసూలు
నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంఘాల వారితో పీఏ శేఖర్ రూ.లక్షలు వసూలు చేశారని అసమ్మతి నాయకులు ఆరోపించారు. లారీ అసోసియేషన్ వారిపై పోలీసులతో ఒత్తిడి చేయించి వారికి లోడింగ్ ఇవ్వకుండా నెలసరి మామూళ్లు ఇచ్చే మరో సంఘం వారికే పారిశ్రామికవాడలో లోడింగ్ చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
మధ్యాహ్న ఏజెన్సీ, స్టోర్ డీలర్లను కూడా వదలకుండా నియామకాలకు డబ్బులు వసూలు చేశారన్నారు. గతేడాది రాష్ట్రంలో వరదలు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపుతో ప్రతి కార్యకర్తా జోలె పట్టి వసూలు చేసిన డబ్బును కూడా కాజేశారని ఆవేదన చెందారు. విజిలెన్స్ అధికారులను ఉసిగొల్పి మెడికల్ అసోసియేషన్, ముద్దిరెడ్డిపల్లిలో సొసైటీ, చీరల వ్యాపారులు, స్వర్ణకారులు ఇలా అన్ని వర్గాల వారితో రూ.కోట్లు దండుకున్నారని, ఇందుకు సాక్ష్యాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. రిజిస్టర్ ఆఫీసులో ప్రతి రిజిస్ట్రేషన్‌కూ పీఏ అనుమతి తప్పనిసరి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికులకే ఇస్తే బాగుంటుంది : కృష్ణమూర్తి
ఇంత దారుణంగా వసూళ్లకు పాల్పడిన వ్యక్తులకు కాకుండా స్థానికులకే బాధ్యత ఇవ్వడం భావ్యమని కృష్ణమూర్తి తన అభిప్రాయంగా చెప్పారు. ఆదివారం సాయంత్రం హిందూపురం నుంచి బయలుదేరతానని, ఇక్కడి విషయాలను పూర్తిస్థాయిలో ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణతో పాటు చిలమత్తూరు జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి, మార్కెట్‌యార్డు డైరెక్టర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.