రసకందాయంలో తిరుపతి టీడీపీ రాజకీయాలు | Politics in Tirupati | Sakshi
Sakshi News home page

రసకందాయంలో తిరుపతి టీడీపీ రాజకీయాలు

Apr 11 2014 3:25 AM | Updated on Sep 2 2017 5:51 AM

రసకందాయంలో తిరుపతి టీడీపీ రాజకీయాలు

రసకందాయంలో తిరుపతి టీడీపీ రాజకీయాలు

తిరుపతి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఒక రోజు మాత్రమే గడువు ఉండటంతో టికెట్టు కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు.

  •      ఐవీఆర్‌ఎస్‌లో మొదట వెంకటరమణ పేరు
  •      అగ్గిమీద గుగ్గిలం అవుతున్న చదలవాడ వర్గీయులు
  •      రాజధానికి వెళ్లిన వెంకటరమణ, చదలవాడ
  •  సాక్షి, తిరుపతి: తిరుపతి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఒక రోజు మాత్రమే గడువు ఉండటంతో టికెట్టు కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. ఒకరి వెంట ఒకరు రాజధానికి పరుగులు తీస్తున్నారు. పార్టీ అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికకోసం చంద్రబాబు అనుసరిస్తున్న ఐవీఆర్‌ఎస్ కూడా వీరి మధ్య చిచ్చు పెట్టింది.

    ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ పేరు ఐవీఆర్‌ఎస్‌లో మొదట చేర్చడం చదలవాడ వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. తిరుపతి టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థుల తొలిజాబితాను బుధవారం ప్రకటించిన వెంటనే మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ రాజధానికి వెళ్లారు.

    అధిష్టానం ఆశీస్సులు పొంది టికెట్టు తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తి గురువారం ఉదయం హుటాహుటిన హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇద్దరు నేతలూ టికెట్టు తమకేనన్న ధీమాతో ఉన్నారు.
     
    ఐవీఆర్‌ఎస్‌లో వెంకటరమణ ఫస్ట్
     
    అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు అనుసరిస్తున్న ఐవీఆర్‌ఎస్‌లో వరుసగా వెంకటరమణ, చదలవాడ, డాక్టర్ హరిప్రసాద్ పేర్లు ఉన్నాయి. ఈ ముగ్గురూ నచ్చకపోతే మీరే ఏదో ఒక పేరు సూచించాలని ఫోన్ కాల్ అందుకున్న వారిని కోరుతోంది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న చదలవాడను కాదని వెంకటరమణ పేరు ముందు చేర్చడం ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకున్నారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులుగా పోటీ చేసిన వెంకటరమణ, చదలవాడ అప్పట్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నా రు. మారిన రాజకీయ పరిణామాల్లో వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో అభ్యర్థిత్వం ఆయననే వరిస్తుందని ప్రచారం ఎక్కువ కావడం చదలవాడ వర్గీయులను మనస్తాపానికి గురిచేస్తోంది.

    పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా అవకాశవాదంతో జెండా మార్చిన వారికి పెద్దపీట వేయడం దీనంతటికీ కారణమనే అభిప్రాయం వారిలో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. దీంతో టికెట్టు ఆశిస్తున్న ఇరువురు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి ఉన్నా ఇంకో వర్గం నుంచి అభ్యర్థికి ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement