తిరుమలలో టీడీపీ ఎన్నికల ర్యాలీ
బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలులో ఎన్నికల సభ
జీఎన్సీ టోల్గేట్లో తనిఖీ లేకుండానే దూసుకొచ్చిన వాహనాలు
సాక్షి, తిరుమల: తిరుపతి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఎం.వెంకటరమణ తిరుమలలో బుధవారం నిబంధనలు ఉల్లంఘిస్తూ నానా హంగామాచేశారు. వెంకటరమణ బుధవారం సాయంత్రం మందీ మార్బలం, ఎన్నికల ప్రచార సామగ్రితో తిరుమలకు వచ్చారు. ప్రస్తుతం ఆయన పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యుడి కావడం వల్ల ఆయన వాహనానికి తనిఖీ లేకున్నా.. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థిగా టీటీడీ నిబంధనల ప్రకారం అనుచరగణం ప్రయాణించిన వాహనాలను టోల్గేట్ల వద్ద తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.
అలాంటివి ఏమీ పట్టనట్టుగా వాహనాలు ఏమాత్రం తనిఖీ చే సుకోకుండానే అతివేగంగా వచ్చేశాయి. తన అనుచరులతో రెండు వాహనాల్లో స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ చేరుకున్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలు వెంకటరమణపై పూలవర్షం కురిపించారు. జై తెలుగుదేశం నినాదాలు చేశారు. ఓ సందులో ఉండే స్థానిక నివాసాల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. వెంకటరమణ కూర్చుని ఉన్న ఏపీ03 ఏఆర్1 నెంబరుగల వాహనానికి అటుఇటుగా టీడీపీ కార్యకర్తలు వేలాడుతూ చేతులు ఊపుతూ.. పార్టీ నినాదాలు చేశారు.
మరికొందరు కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై ర్యాలీలో పాల్గొంటూ జై వెంకటరమణ అంటూ నినాదాలు చేశారు. బాలాజీనగర్ కమ్యూనిటీ హాలు వద్దకు వాహనాల్లో ర్యాలీగా వచ్చిన వెంకటరమణ అక్కడే సమావేశం ఏర్పాటు చేశారు. సభలో వేచిఉన్న పార్టీ కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ మరోసారి నినాదాలు చేశారు. అక్కడ సభ నిర్వహిస్తారని ముందే పసిగట్టిన టీటీడీ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటరమణ వారిపై బూతులు అందుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు వేధిస్తున్నారని కొందరు అనుచరులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకటరమణ ఓ విజిలెన్స్ ఉన్నతాధికారికి ఫోన్ చేసి ‘చూసిపోండి.. లేదంటే మా తడాఖా చూపిస్తాం’ అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రాత్రి వరకు పార్టీ కార్యకర్తలతో వెంకటరమణ, మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం చేస్తూ అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. ఎక్కడికక్కడ స్వీట్లు, ఫలహారాలు పంచుతూ ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ నానా హంగామా చేశారు. రాత్రి 7.30 గంటలకు తిరుగుప్రయాణం అయ్యారు.
ఉల్లంఘనలు ఉంటే కేసు నమోదు చేస్తాం
కమ్యూనిటీ హాలులో బుధవారం సభ నిర్వహించుకునేందుకు టీడీపీ అభ్యర్థి వెంకటరమణకు తిరుపతి అర్బన్ఎస్పీ అనుమతి ఇచ్చారు. అయితే తిరుమల ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం తప్పనిసరిగా కేసు నమోదు చేస్తాం. ఎవరు ఫిర్యాదు చేసినా.. చేయకపోయినా ఆధారాలుంటే చర్యలు తీసుకుంటాం.
-నరసింహారెడ్డి, తిరుమల డీఎస్పీ