కోట్లు మా బిడ్డల్ని తిరిగి తెస్తాయా?
న్యూఢిల్లీ : తీవ్ర విషాదాన్ని నింపిన ఢిల్లీలోని ఉపహార్ సినిమాహాల్ అగ్నిప్రమాదం కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సోదరులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కిందికోర్టు వారికి విధించిన జైలు శిక్షను రద్దు చేసి, రూ. 60 కోట్ల జరిమానా విధించడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఈ తీర్పును అంగీకరించొద్దని విజ్ఙప్తి చేస్తూ బాధిత కుటుంబాలు శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిశారు.
వాళ్లు చెల్లించే పరిహారం చనిపోయిన తమ బిడ్డలను తిరిగి ఇస్తుందా అని ఉపహార్ బాధితుల సంఘం అధ్యక్షురాలు నీలం కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన కేజ్రీవాల్... సుప్రీం తీర్పు బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తీర్పును తాము అంగీకరించమని కేజ్రీవాల్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. భారత న్యాయ వ్యవస్థపై బాధిత కుటుంబ సభ్యుల్లో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు ఇంకా చాలా చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
కాగా ఉపహార్ కేసులో అన్సల్ సోదరులకు కిందికోర్టు విధించిన ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పటికే వాళు శిక్షను అనుభవించారని పేర్కొంటూ బాధితులకు 60 కోట్ల రూపాయాలను పరిహారాన్ని చెల్లిస్తే సరిపోతుందని బుధవారం న్యాయస్థానం తీర్పుచెప్పిన సంగతి తెలిసిందే.
1997 జూన్ 13న బోర్డర్ అనే సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన 59 మందిలో నీలం కృష్ణమూర్తి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీంతో గత 18 సంవత్సరాలుగా ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు.